పుర పోరు.. ఫ్యాన్ జోరు
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: జిల్లాలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. దాంతోపాటు ఎన్నికల వ్యూహరచనలో పార్టీలు తలమునకలుగా ఉన్నాయి. సార్వత్రిక ఎన్నికల ముందు జరగనున్న ఈ మున్సిపల్ పోరులో వైఎస్సార్ కాంగ్రెస్‌కు సానుకూల పవనాలు వీస్తున్నాయి.
సామాజికవర్గ సమతూకం.. బలీయంగా ఉన్న స్థానిక నేతలు.. క్షేత్రస్థాయిలో పట్టున్న అభ్యర్థులు.. వెరసి పుర పోరులో ఆ పార్టీ ముందంజ వేస్తోంది. తీవ్రపోటీ ఇస్తుందని భావించిన టీడీపీ అసలు పరీక్ష సమయానికి పట్టు సడలించేసింది. నియోజకవర్గస్థాయిలో పటిష్ట నాయకత్వం లేకపోవడంతో ఎన్నికల వ్యూహరచనలో విఫలమవుతోంది. కాంగ్రెస్ ఇప్పటికే కుదేలైపోవడంతో వైఎస్‌ఆర్‌సీపీ, టీడీపీల మధ్యే ప్రధాన పోటీ జరుగుతోంది. ముఖాముఖీ పోరులో వైఎస్‌ఆర్‌సీపీ స్పష్టమైన ఆధిక్యత కనబరుస్తోంది. మున్సిపాలిటీల వారీగా ఎన్నికల పోరును పరిశీలిస్తే..
ఆమదాలవలసలో దిలాసా
ఆమదాలవలస మున్సిపాలిటీలో వైఎస్సార్ కాంగ్రెస్ అనుసరిస్తున్న వ్యూహం సత్ఫలితాలనిస్తోంది. కౌన్సిల ర్, మున్సిపల్ చైర్‌పర్సన్ అభ్యర్థిత్వం విషయంలో నియోజకవర్గ సమన్వయకర్త తమ్మినేని సీతారాం పూర్తి పరిపక్వతతో వ్యవహరించారు.
దీంతో మొత్తం 23 వార్డులకుగాను 15కుపైగా వార్డుల్లో ఆ పార్టీ అగ్రపథంలో దూసుకుపోతోంది. మరో 5 వార్డుల్లో బలోపేతమవుతోంది. ఇక్కడ టీడీపీ ప్రాబల్యం 4 వార్డులకే పరిమితమైంది. ఆ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి కూన రవికుమార్‌కు మున్సిపాలిటీ పరిధిలో ఏ మాత్రం పట్టు లేదు.
దాంతో ఆయన పూర్తిగా ద్వితీ య, తృతీయ శ్రేణి నేతలపై ఆధారపడాల్సి వస్తోంది. కాంగ్రెస్ పార్టీ పూర్తిగా కుదేలైపోయింది. నేరుగా అభ్యర్థులను పోటీకి నిలిపేందుకే సాహసించలేకపోయింది. స్వతంత్ర అభ్యర్థుల ముసుగులో ఆ పార్టీ నేతలు నామినేషన్లు వేయడం కాంగ్రెస్ బలహీనతను సూచిస్తోంది.
పాలకొండంత బలం
కొత్తగా ఆవిర్భవించిన పాలకొండ నగర పంచాయతీలో తొలిపోరు ఆసక్తికరంగా మారింది. వైఎస్సార్‌కాంగ్రెస్, టీడీపీ రెండూ కూడా ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. కాగా పార్టీ ఆవిర్భావం నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి పాలకొండ బలమైన కేంద్రంగా గుర్తింపు పొందింది.
సీనియర్ నేత, పార్టీ కేంద్ర పాలకమండలి సభ్యుడు పాలవలస రాజశేఖరం అన్నీ తానై పార్టీని నడిపిస్తున్నారు. ఆయన సతీమణి ఇందుమతి మున్సిపల్ చైర్‌పర్సన్ అభ్యర్థిగా ఉండటం పార్టీకి కలసివస్తోంది. నగర పంచాయతీలో మొత్తం 20 వార్డుల్లో వైఎస్సార్ కాంగ్రెస్ 10 చోట్ల తిరుగులేని ఆధిక్యం కనబరుస్తోంది.
మరో 5 వార్డుల్లో రోజురోజుకు బలోపేతమవుతోంది. కాగా టీడీపీల ప్రాబల్యం 4 వార్డులకే పరిమితమైపోయింది. పాలవలస కుటుంబాన్ని ఢీకొట్టే స్థాయి గల నేత లేకపోవడం, మున్సిపల్ చైర్‌పర్సన్ అభ్యర్థిపై స్పష్టత కొరవడటం టీడీపీకి ప్రతికూలాంశాలుగా మారాయి. స్థానిక టీడీపీ ముఖ్య నేత వివాదాస్పదుడు కావడం కూడా ఆ పార్టీకి ఇబ్బందికరంగా తయారైంది. కాంగ్రెస్ పార్టీ ఇక్కడ నామమాత్రంగానే పోటీ చేస్తోంది.
పలాసలో ప్రత్యర్థుల పలాయనం
వాణిజ్య కేంద్రమైన పలాస-కాశీబుగ్గ మున్సిపల్ పోరు జిల్లావ్యాప్తంగా అందర్నీ ఆకర్షిస్తోంది. ప్రధాన పోటీ వైఎస్సార్ కాంగ్రెస్, టీడీపీల మధ్య కేంద్రీకృతమైంది. సంస్థాగతంగా బలోపేతంగా ఉండటంతో వైఎస్సార్ కాంగ్రెస్ కొంతవరకు ఆధిక్యం సాధించగలుగుతోంది.
గతంలో మున్సిపల్ చైర్మన్‌గా చేసిన వజ్జ బాబూరావు నియోజకవర్గ సమన్వయకర్తగా ఉండటం.. ఎమ్మెల్యే జుత్తు జగన్నాయకులు అండదండలు.. ఇటీవల పలాస పీఏసీఎస్ ఎన్నికల్లో విజయం సాధించిన దువ్వాడ సోదరుల బలం.. కలిసి పార్టీని ఎన్నికల యుద్ధంలో ముందంజలో ఉంచుతున్నాయి. మొత్తం 25 వార్డుల్లో వైఎస్సార్ కాంగ్రెస్ 12 వార్డుల్లో స్పష్టమైన ఆధిక్యంలో కొనసాగుతోంది. మరో 6 వార్డుల్లో బలీయంగా ఉంది.
కాగా టీడీపీకి 5 వార్డుల్లోనే ఆధిక్యం ఉంది. మిగిలిన వార్డుల్లో ఆ పార్టీ పెద్దగా ప్రభావం చూపించలేకపోతోంది. ఈ కారణంతోనే ఆ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి గౌతు శివాజీ కూడా మున్సిపల్ ఎన్నికలకు దూరం జరుగుతున్నారు. తన కుటుంబ సన్నిహితులకు బాధ్యతలు అప్పగించేసి ఆయన తప్పుకుంటున్నారని టీడీపీవర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి. ఇక్కడ కూడా కాంగ్రెస్ దాదాపుగా తుడిచిపెట్టుకుపోయింది. పోటీ చేసేందుకు అభ్యర్థులే దొరకని దుస్థితిలోకి కూరుకుపోయింది.
వైఎస్‌ఆర్‌సీపీకి ‘ఇష్టా’పురం
రాష్ట్ర సరిహద్దు మున్సిపాలిటీ ఇచ్చాఫురంలో ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. ఇక్కడ మున్సిపల్ స్థాయి కంటే వార్డుస్థాయి రాజకీయ సమీకరణలే నిర్ణాయక పాత్ర పోషిస్తున్నాయి. అందుకే వైఎస్సార్ కాంగ్రెస్ ఆచితూచి ఎన్నికల వ్యూహాన్ని రూపొందించింది. మాజీ ఎమ్మెల్యే ఎం. వి.కృష్ణారావు, పార్టీ పరిశీలకుడు కొయ్య ప్రసాదరెడ్డి, సమన్వయకర్త నర్తు నరేంద్ర క్షేత్రస్థాయి వాస్తవాలను గుర్తించి అభ్యర్థులను ఎంపిక చేశారు.
దాంతో వైఎస్సార్ కాంగ్రెస్‌కు సానుకూల వాతావరణం నెల కొంది. మొత్తం 23 వార్డుల్లో వైఎస్సార్ కాంగ్రెస్ 12 చోట్ల తిరుగులేని ఆధిక్యం కనబరుస్తోంది. మరో 6 వార్డుల్లో నువ్వా నేనా అన్న రీతిలో పోటీ పడుతోంది. కాగా నియోజకవర్గస్థాయి నాయకత్వలోపం టీడీపీకి ప్రతికూలంగా మారింది.
ఆ పార్టీ ఇన్‌చార్జి బెందాళం అశోక్‌కు మున్సిపాలిటీపై ఏమాత్రం పట్టు లేదు. టీడీపీ శ్రేణులు ఆశలు పెట్టుకున్న పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్‌చార్జి కింజరాపు రామ్మోహన్‌నాయుడు కూడా ఈ ఎన్నికలను పట్టించుకోవడం లేదు. దాంతో ఆ పార్టీ 5 వార్డుల్లోనే ప్రభావం చూపిస్తోంది. ఇక్కడా కాంగ్రెస్ పరిస్థితి ఏమాత్రం మెరుగ్గా లేదు. ఆ పార్టీ ప్రాబల్యం కేవలం ఒక్క వార్డుకే పరిమితమైపోయింది.