తణుకు, న్యూస్‌లైన్: పురపోరులో నిలిచి ఓటడిగేందుకు ప్రజల వద్దకు వెళుతున్న తెలుగు తమ్ముళ్లకు సమైక్య సెగ తగులుతోంది. రాష్ట్ర విభజన అంశంతో సమైక్య ఉద్యమసెగకు భయపడి కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులే కరువైన విషయం తెలిసిందే. విభజనకు మద్దతుగా టీడీపీ లేఖ ఇవ్వడంతో తమ వద్దకు ఓటు అడిగేందుకు వస్తున్న టీడీపీ అభ్యర్థులను తణుకు పట్టణ ప్రజలు నిలదీస్తున్నారు.
రెండు కళ్ల సిద్ధాంతంతో మీ అధినేత చంద్రబాబు సీమాంధ్రులను నిలువునా ముంచారంటూ మొహం మీదే ఆగ్రహం వ్యక్తం చేస్తుండటంతో తమ్ముళ్లు బిక్కమొహాలు వేస్తున్నారు. సమైక్య సెగ ప్రభావం మునిసిపల్ ఎన్నికలతో పాటు ప్రాదేశిక పోరులోనూ ఉంటుందని టీడీపీ నేతలు ఆందోళన చెందుతున్నారు.
మరోవైపు గతంలో బీజేపీతో పొత్తు పెట్టుకోవడం వల్ల కొంతమేర కలిసొచ్చేదని, ఈసారి వారిని దూరంగా ఉంచటం కూడా తమ అభ్యర్థుల విజయావకాశాలపై ప్రభావం చూపొచ్చని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. టీడీపీ అభ్యర్థులు 32 వార్డుల్లో పోటీ చేస్తుండగా, ఒక వార్డు సీపీఐకి, మరో వార్డులో స్వతంత్ర అభ్యర్థికి టీడీపీ మద్దతు ఇస్తోంది.
రెండుచోట్ల సీపీఎంతో వైసీపీ పొత్తు
సమైక్య ఉద్యమాన్ని భుజానవేసుకుని.. ఉద్యమంలో ప్రజల వెంట నడచిన వైఎస్సార్ సీపీ అభ్యర్థులు ఇదే అంశాన్ని ప్రచారంలో వివరిస్తున్నారు. మునిసిపాలిటీలో 34 వార్డులుండగా సమైక్యవాదం వినిపించిన సీపీఎంతో వైఎస్సార్ సీపీ పొత్తు పెట్టుకుంది. రెండు వార్డులను సీపీఎం అభ్యర్థులకు కేటాయించారు.
ప్రజల్లో మంచి పేరు, పూర్తిస్థాయిలో అందుబాటులో ఉన్నవారిని గుర్తించి వైసీపీ తమ అభ్యర్థులుగా నిలపటం వల్ల పేద, మధ్యతరగతి వర్గాల ఆదరణ పొందుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
నమ్మించి నయవంచన
టీడీపీ నేతలు తమను నమ్మించి నయవంచన చేశారని బీజేపీ నేతలు దుమ్మెత్తి పోస్తున్నారు. నామినేషన్ల ఉపసంహరణ వరకు సీట్లు సర్ధుబాటంటూ టీడీపీ నేతలు నమ్మించి, చివరి నిమిషంలో సీట్లు ఇచ్చేది లేదని నయవంచనకు పాల్పడ్డారని బీజేపీ నేతలు టీడీపీ బహిరంగంగా విమర్శలు గుప్పిస్తుండటం టీడీపీకి మింగుడు పడడం లేదు. పట్టణంలో బీజేపీ ఎవరితోనూ పొత్తు లేకుండా 5 స్థానాల్లో పోటీకి దిగింది. లోక్‌సత్తా 5 స్థానాల్లో పోటీ చేస్తోంది.
తమ్ముళ్లకు సమైక్య సెగ
Published Fri, Mar 21 2014 1:42 AM | Last Updated on Fri, Mar 29 2019 9:18 PM
Advertisement