రాజకీయం..రణరంగం | Political war | Sakshi
Sakshi News home page

రాజకీయం..రణరంగం

Published Sat, Dec 26 2015 2:22 AM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM

రాజకీయం..రణరంగం - Sakshi

రాజకీయం..రణరంగం

♦ దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన ‘ఓటుకు కోట్లు’ వ్యవహారం
♦ ఏడాది పొడవునా టీఆర్‌ఎస్ ‘ఆక ర్ష్’.. అధ్యక్షుడిగా మళ్లీ కేసీఆర్
♦ వరంగల్ ఉప ఎన్నికల్లో గులాబీ ఘన విజయం
♦ సారథి మారినా రాత మారని కాంగ్రెస్
♦ వరుసగా ఎదురు దెబ్బలు.. నేతల మధ్య లుకలుకలు
♦ ‘రేవంత్’ వ్యవహారంతో పరువు పోగొట్టుకున్న టీ టీడీపీ
♦ నేతల వలసలతో డీలా.. పార్టీ అధ్యక్షుడిగా రెండోసారి రమణ
♦ పరామర్శయాత్రతో వైఎస్సార్‌సీపీ భరోసా
♦ ఇంటి పోరులో బీజేపీ.. పోరుబాటలో వామపక్షాలు
 
 ఈ ఏడాది సంచలనం సృష్టించిన రాష్ట్ర రాజకీయాలు
 
 రాష్ట్రంలో ఈ ఏడాది (2015) చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలు దేశవ్యాప్తంగా రాజకీయ వర్గాల దృష్టిని ఆకర్షించాయి. ‘ఓటుకు కోట్లు’ కేసు అయితే పెను సంచలనమే సృష్టించింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య ప్రచ్ఛన్న పోరుగా మారుతుందా అన్న స్థాయిలో చర్చ జరిగింది. అవినీతి ఆరోపణలతో కేబినెట్ నుంచి ఉప ముఖ్యమంత్రి టి.రాజయ్యను బర్తరఫ్ చేయడం రాజకీయ విశ్లేషకులకే ఆశ్చర్యం కలిగించింది. ఇక ఏడాది పొడవునా విడతల వారీగా జరిగిన వివిధ ఎన్నికలతో అన్ని రాజకీయ పార్టీలకూ 2015 ఎన్నికల నామ సంవత్సరంగా మారింది. ప్రతిపక్షాల నుంచి అధికార పార్టీలోకి వలసలు కొనసాగుతూనే ఉన్నాయి.

ఇక టీఆర్ ఎస్ ఆవిర్భావ బహిరంగసభను జరుపుకొని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావును మరోసారి అధ్యక్షుడిగా ఎన్నుకుంది. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌కు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కొత్త సారథిగా బాధ్యతలు చేపట్టగా... తెలంగాణ టీడీపీకి రెండోసారి ఎల్.రమణ అధ్యక్షుడయ్యారు. ‘ఓటుకు కోట్లు ’ కేసులో పీకల్లోతు కూరుకుపోయిన ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డికి మానసిక ధైర్యం కల్పించేందుకు టీ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని కట్టబెట్టారు. ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడిగా నియమితుల య్యారు. ఇంటి గొడవల్లో కూరుకుపోయిన బీజేపీ.. ప్రజా సమస్యలపై వామపక్షాల ఉద్యమ బాట వెరసి ఈ ఏడాది ఆయా రాజకీయ పార్టీల తీరు ఆసక్తికరంగానే కొనసాగింది.    
 - సాక్షి ప్రతినిధి, హైదరాబాద్
 
 బీజేపీ: కల్లోల సాగరం
 కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ రాష్ట్రంలో మాత్రం అష్టకష్టాలు పడుతోంది. ఆ పార్టీలో గొడవలు, నేతల మధ్య సమన్వయం కొరవడి నానా అవస్థలూ పడుతోంది. మిత్రపక్షమైన టీడీపీతో కలసి వరంగల్ లోక్‌సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో పోటీ చేసినా.. డిపాజిట్ కూడా దక్కక బొక్కబోర్లా పడింది. మరోవైపు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడికి, ఎమ్మెల్యేలకు ఏ మాత్రం పొసగడం లేదు. ఎమ్మెల్యే రాజాసింగ్ తమ అధ్యక్షుడు కిషన్‌రెడ్డిపై తీవ్ర ఆరోపణల తో విరుచుకుపడ్డారు కూడా. పార్టీ నేతల తీరుతో విసిగిపోయిన మహబూబ్‌నగర్ మాజీ ఎమ్మెల్యే, సీనియర్ నేత యెన్నం శ్రీనివాస్‌రెడ్డి పార్టీకి రాజీనామా చేశారు. మరో సీనియర్ నాయకుడు నాగం జనార్ధన్‌రెడ్డి తో కలసి ‘తెలంగాణ బచావో మిషన్’ పేర వేరు కుంపటి పెట్టారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా రాష్ట్ర పర్యటనకు వచ్చి ఇక్కడి నేతలకు కార్యోపదేశం చేసినా కమలనాథుల కలహాలు తగ్గలేదు. మొత్తంగా ఈ ఏడాదిలో ఆ పార్టీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానంలో రామచందర్‌రావును గెలిపించుకుని కొంత సంతృప్తి పడింది.
 
 టీఆర్‌ఎస్
 అదే ఆధిపత్యం
 రాష్ట్రంలో ప్రతిపక్షాలపై ఆధిపత్యం కొనసాగించేందుకు అధికార టీఆర్‌ఎస్ మొదటి నుంచీ దూకుడుగానే వ్యవహరించింది. పార్టీ ప్లీనరీ, ఆవిర్భావ బహిరంగసభను   ఘనంగా నిర్వహించుకుని.. అధ్యక్షుడిగా మరోసారి కేసీఆర్‌ను ఎన్నుకుంది. కానీ ఇది జరిగి ఎనిమిది నెలలైనా రాష్ట్ర కమిటీని ఏర్పాటు చేసుకోలేదు. దాంతో పార్టీలో అంతా పాత పదవులతోనే కొనసాగుతున్నారు. నామినే టెడ్ పదవుల భర్తీని చేపట్టకపోవడంతో ఈ ఏడాది పార్టీ శ్రేణుల్లో తీవ్ర నిరాశ నిస్పృహలు నెలకొన్నాయి. మరోవైపు పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీల కోసం మూడు రోజుల పాటు నాగార్జునసాగర్‌లో శిక్షణ శిబిరాన్ని నిర్వహించింది.

సీఎం కేసీఆర్ స్వయంగా పాల్గొన్నారు. వివిధ అంశాలపై నిపుణులతో శిక్షణ ఇప్పించారు. ఈ ఏడాది ఆరంభంలోనే జనవరిలో జరిగిన ఘటన పార్టీలో పెద్ద కుదుపును సృష్టించింది. మంత్రి వర్గం లో చేరి ఆరు నెలల సమయం కూడా గడవక ముందే వైద్య, ఆరోగ్య శాఖకు ప్రాతినిధ్యం వహించిన డిప్యూటీ సీఎం టి.రాజయ్యను సీఎం కేసీఆర్ బర్తరఫ్ చేశారు. వరంగల్ ఎంపీగా ఉన్న కడియం శ్రీహరిని ఆ స్థానంలో కూర్చోబెట్టి విద్యాశాఖను అప్పగించారు. ఈ పరిణామంతో మంత్రులు జగదీశ్‌రెడ్డిని విద్యా శాఖ నుంచి విద్యుత్ శాఖకు, లక్ష్మారెడ్డిని విద్యుత్ శాఖ నుంచి వైద్య, ఆరోగ్య శాఖకు మార్చారు. ఇక ఈ ఏడాది పట్టభద్రుల కోటాలో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో ఒక స్థానం కోల్పోవడంతో టీఆర్‌ఎస్ షాక్ తిన్నది. టీఎన్జీవోల నేత దేవీప్రసాద్ టీఆర్‌ఎస్‌లో చేరి పోటీ చేసి, ఓటమి పాలయ్యారు. కానీ ఆ తర్వాత జరిగిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఐదు స్థానాలను గులాబీ పార్టీ కైవసం చేసుకుంది. ఈ ఎన్నికల్లోనే ‘ఓటుకు కోట్లు’ వ్యవహారం చోటు చేసుకుంది.

 వరంగల్‌లో ఘనవిజయం
 లోక్‌సభ చరిత్రలో ఏడో అతి భారీ మెజారిటీతో వరంగల్ ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్ ఘన విజయం సాధించి దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ పార్టీ అభ్యర్థి పసునూరి దయాకర్ విజయం సాధించగా.. కాంగ్రెస్, బీజేపీ సహా అన్ని పార్టీల అభ్యర్థుల డిపాజిట్లు గల్లంతయ్యాయి. అధికార పార్టీ పాలనపై ప్రజల్లో వ్యతిరేకత పెరిగిందని, అది తమకు లాభిస్తుందని ఊదరగొట్టిన కాంగ్రెస్, బీజేపీలు దెబ్బతిన్నాయి. పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ ఒక బహిరంగసభలో మాత్రమే పాల్గొనగా, మెజారిటీ సంఖ్యలో మంత్రులు వరంగల్‌లో తిష్టవేసి ప్రచారం చేశారు. ఇక సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎన్నికల నుంచి, ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు, వరంగల్ ఉప ఎన్నిక, స్థానిక కోటా ఎమ్మెల్సీ ఎన్నికల దాకా టీఆర్‌ఎస్ విజయాల పరంపరను కొనసాగించింది.
 
 కొనసాగిన వలసలు
 శాసనసభలో, మండలిలో తన బలం పెంచుకోవడంపై దృష్టిపెట్టిన అధికార పార్టీ... ఇతర పార్టీల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులకు గాలం వేసింది. కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ తదితర పార్టీల నుంచి టీఆర్‌ఎస్‌లోకి ఏడాది పొడవునా వలసలు కొనసాగాయి. వచ్చే ఏడాది జరగనున్న గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరే షన్ (జీహెచ్‌ఎంసీ) ఎన్నికల్లో విజయం కోసం ఆ పార్టీ వలసలతో బలపడడంపైనే ఆధార పడింది. కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేలు రెడ్యానాయక్, కాలె యాదయ్య, టీడీపీ నుంచి మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, మాధవరపు కృష్ణారావు. సాయన్న, వైఎస్సార్‌సీపీ నుంచి తాటి వెంకటేశ్వర్లు, కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్సీ ఎం.ఎస్.ప్రభాకర్‌లు ఈ ఏడాదే గులాబీ కండువాలు కప్పుకున్నారు. సరిగ్గా వరంగల్ ఉప ఎన్నికల సమయంలోనే ఆ జిల్లాకు చెందిన రాజ్యసభ సభ్యురాలు గుండు సుధారాణి టీఆర్‌ఎస్‌లో చేరారు. ఇక స్థానిక కోటా ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులు, కార్పొరేటర్లు, కౌన్సెలర్లు టీఆర్‌ఎస్ బాట పట్టారు. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నామినేషన్ల ఉపసంహరణల దశలోనే విపక్ష అభ్యర్థులను తప్పించడంపై దృష్టిపెట్టిన టీఆర్‌ఎస్.. ఏకంగా ఆరు స్థానాలను ఏకగ్రీవంగా తమ ఖాతాలో వేసుకుంది.
 
 కాంగ్రెస్
 సారథి మారినా.. అదృష్టం మారలేదు
 రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ సారథి మారినా... ఏడాది పొడవునా సమస్యలతోనే ఉక్కిరి బిక్కిరి అయింది. సార్వత్రిక ఎన్నికల ముందు సారథ్య బాధ్యతలు చేపట్టిన పొన్నాల లక్ష్మయ్యకు పార్టీ అధిష్టానం ఉద్వాసన పలికి.. అప్పటిదాకా వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టులో ఉన్న ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి ఫిబ్రవరిలో టీపీసీసీ చీఫ్‌గా పట్టం కట్టింది. భట్టి విక్రమార్కను వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమించింది. వారు కూడా కాంగ్రెస్‌ను కష్టాల కొలిమి నుంచి బయటపడేయలేక పోయారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు రెండు పర్యాయాలు పీసీసీ అధ్యక్షుడిగా పనిచేసిన సీనియర్ నేత, డి.శ్రీనివాస్ (డీఎస్) టీఆర్‌ఎస్ గూటికి చేరడం... కాంగ్రెస్ శ్రేణులపై బాగానే ప్రభావం చూపింది.

వరంగల్ ఉప ఎన్నికల్లో తొలుత అభ్యర్థిగా బరిలోకి దిగిన మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య ఇంట్లో జరిగిన దారుణ ఘటన ఆ పార్టీకి ఇబ్బందికరంగా మారింది. ఇక స్థానిక కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున బరిలోకి దిగిన అభ్యర్థులు.. నామినేషన్లను ఉపసంహరించుకుని, టీఆర్‌ఎస్‌లో చేరడం పెద్ద దెబ్బ. పీఏసీ చైర్మన్‌గా ఉండిన నారాయణఖేడ్ ఎమ్మెల్యే పి.కిష్టారెడ్డి ఆకస్మిక మరణం కాంగ్రెస్‌లో విషాదం నింపింది. దాదాపు ఏడాదంతా ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొన్న కాంగ్రెస్ పార్టీకి.. జూన్‌లో జరిగిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక స్థానం గెలుచుకోవడమొక్కటే ఊరట.
 
 టీ టీడీపీ
‘ఓటుకు కోట్లు’తో బజారున పడిన పరువు
 తెలంగాణ తెలుగుదేశం పార్టీ (టీ టీడీపీ) స్వీయ తప్పిదాలతో ఈ ఏడాదంతా గడ్డు కాలాన్నే ఎదుర్కొంది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకుని, జాతీయ గీతాన్ని అవమానపరిచారన్న ఆరోపణతో సభ్యులంతా సస్పెండయ్యారు. ఆ తర్వాత ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు ఒక్కొక్కరుగా జారిపోవడంతో ఆ పార్టీ చిక్కి శల్యమైంది. జూన్‌లో జరిగిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో లేని సీటు కోసం ప్రయత్నించి అభాసుపాలైంది. తమ అభ్యర్థి వేం నరేందర్‌రెడ్డిని గెలిపించుకోవడం కోసం కోట్ల రూపాయలు గుమ్మరించేందుకు సిద్ధపడి, అడ్డంగా ఇరుక్కుంది. పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు డెరైక్షన్‌లో ఆ పార్టీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి రంగంలోకి దిగి నామినేటెడ్ స్టీఫెన్సన్‌కు రూ. 50 లక్షలు ముడుపులిస్తూ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయారు.

చంద్రబాబు నేరుగా స్టీఫెన్సన్‌తో బేరాలాడిన ఆడియో రికార్డులు సైతం బహిర్గతం అయ్యాయి. మరో ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యకు ఈ వ్యవహారంలో భాగస్వామ్యం ఉందన్న ఆరోపణతో తెలంగాణ టీడీపీ పరువు బజారున పడింది. ఇక టీ టీడీపీ అధ్యక్షుడిగా రెండోసారి ఎల్.రమణకు అవకాశం దక్కింది. ‘ఓటుకు కోట్లు’ కేసులో ఇరుక్కున్న రేవంత్‌రెడ్డికి వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి కట్టబెట్టారు. పార్టీ నుంచి వలసలను నిలువరించేందుకు ఇద్దరు ఎమ్మెల్యేలకు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యులుగా అవకాశమిచ్చారు. అయినా కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న పార్టీని వీడారు. మరో సీనియర్ నేత, మాజీ మంత్రి విజయరామారావు టీటీడీపీతో తెగదెంపులు చేసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా జిల్లాల్లోనూ టీ టీడీపీ సమస్యలు ఎదుర్కొన్నది.
 
 వామపక్షాలు: పోరుబాటలో
 ఈ ఏడాదికాలంలో సీపీఐ, సీపీఎంలో చెప్పుకోదగిన పరిణామాలేవీ చోటు చేసుకోలేదు. అయితే ఈ రెండు పార్టీలు ఉమ్మడిగా, వేర్వేరుగా ప్రజా సమస్యలపై ఆందోళనా కార్యక్రమాలు నిర్వహించాయి. వరంగల్ ఉప ఎన్నికల్లో తమ అభ్యర్థులను పోటీకి పెట్టకుండా... తెలంగాణ ఉద్యమ సంఘాల నుంచి పోటీ చేసిన గాలి వినోద్‌కుమార్‌కు మద్దతు ఇచ్చాయి. రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ కార్మికుల సమస్యలపై సీపీఎం సమ్మె చేసింది. ఆశా వర్కర్లతో సమ్మె చేయించింది. చౌక మద్యం తేవాలన్న ప్రతిపాదనలను విమర్శిస్తూ.. సీపీఎం ఆందోళనలు చేపట్టింది. బస్సు యాత్ర నిర్వహించింది. ఇక స్థానిక కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో సీపీఐ ఖమ్మం నుంచి అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది.
 
 వైఎస్సార్ కాంగ్రెస్
 తెలంగాణ ప్రజలకు పరామర్శ
 ఈ ఏడాది తెలంగాణ పల్లెల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పరామర్శ యాత్ర కొనసాగింది. పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సొదరి షర్మిల మహబూబ్‌నగర్, నల్లగొండ, వరంగల్, కరీంనగర్, రంగారెడ్డి జిల్లాల్లో పరామర్శ యాత్రలు నిర్వహించి.. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మరణాన్ని త ట్టుకోలేక గుండెపగిలి చనిపోయినవారి కుటుంబాలను పరామర్శించారు. ఆవేదనలో ఉన్నవారికి భరోసా కల్పించారు. పార్టీ తెలంగాణ శాఖకు కొత్త కమిటీని నియమించగా... ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ తెలంగాణ కమిటీ తొలి అధ్యక్షుడిగా నియమితులయ్యారు. వరంగల్ ఉప ఎన్నికల్లోనూ ఈ పార్టీ పోటీ చేసింది. పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి కూడా ప్రచారం చేశారు. ఇక స్థానిక కోటాలో శాసన మండలికి జరిగిన ఎన్నికల్లో భాగంగా ఖమ్మం స్థానం కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోటీ పడుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement