ఇక బీజేపీ లక్ష్యంగా టీఆర్‌ఎస్ మిషన్
ముగ్గురు ఎమ్మెల్యేలతో టీఆర్‌ఎస్ ముఖ్యుల మంతనాలు
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్, టీడీపీ, వైఎస్సార్‌సీపీ, బీఎస్పీ వంటి పార్టీల నుంచే కాక సీపీఐ ఎమ్మెల్యేను కూడా కలిపేసుకున్న తెలంగాణ రాష్ట్ర సమితి చూపు ఇప్పుడు బీజేపీపై పడింది. టీఆర్‌ఎస్‌లో చేరుతామని ఉత్సాహం చూపించిన వారినే కాకుండా మిగతావారిని కూడా నయానో, భయానో పార్టీలో చేర్చుకుంటున్నారని ప్రతిపక్షపార్టీలు ఆరోపిస్తున్నాయి. ఈ విమర్శలను, ఆరోపణలను పట్టించుకోకుండా వలసలపై టీఆర్‌ఎస్ ముందుకు దూసుకుపోతూనే ఉంది. ఇప్పటిదాకా బీజేపీ నుంచి వలసలు లేవు. వలసలను తట్టుకుని బీజేపీ నిలబడిందని అనుకుంటున్న ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ చూపు బీజేపీపై పడినట్టుగా తెలిసింది.
రాష్ట్రంలో బీజేపీకి ఐదుగురు ఎమ్మెల్యేలుండగా, ఇప్పటిదాకా వారెవరూ పార్టీ నుంచి దూరం కాలేదు. ప్రస్తుతం బీజేపీకి టీఆర్‌ఎస్ నుంచి ప్రమాదం ముంచుకొస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే బీజేపీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలతో టీఆర్‌ఎస్ ముఖ్యులు మంతనాలు జరిపినట్టుగా తెలిసింది. అయితే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సభ్యులను టీఆర్‌ఎస్‌లో చేర్చుకుంటే సమస్యలు ఏమైనా వస్తాయా అనే కోణంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కొంత వెనకడుగు వేస్తున్నట్టుగా తెలిసింది. బీజేపీ నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌లోకి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నారని, అయితే కేంద్ర ప్రభుత్వం నుంచి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉన్నందువల్ల అన్ని కోణాల్లోనూ ఆలోచనలు జరుగుతున్నాయని విశ్వసనీయ సమాచారం.