ఎన్నికల పోరు...ఫ్యాన్ జోరు | ysrcp josh in elections | Sakshi
Sakshi News home page

ఎన్నికల పోరు...ఫ్యాన్ జోరు

Published Thu, Mar 27 2014 3:26 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

ఎన్నికల పోరు...ఫ్యాన్ జోరు - Sakshi

ఎన్నికల పోరు...ఫ్యాన్ జోరు

సాక్షి ప్రతినిధి, విజయనగరం : సార్వత్రిక ఎన్నికల ముందు సెమీఫైనల్స్‌గా జరగనున్న మున్సిపల్, ప్రాదేశిక ఎన్నికల్లో పట్టు సాధించేందుకు ప్రధాన పార్టీలు ప్రచారం జోరు పెంచాయి. జిల్లాలో నాలుగు మున్సిపాలిటీలు, ప్రాదేశికాలలో తమ జెండాలను ఎగురవేయాలని ఆయా పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి.  
 
క్షేత్రస్థాయిలో నెగ్గుకురాగలిగిన వారికే మంచి ఫలితాలు లభిస్తాయి. ఇదే సూత్రాన్ని శిరసావహిస్తూ వైఎస్‌ఆర్ సీపీ పట్టుబిగిస్తోంది. ఒకవైపు ప్రచారంలో దూసుకుపోతూ, మరోవైపు ఇతర పార్టీల నేతలు, కార్యకర్తలను చేర్చుకుంటూ ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోంది.  దీంతో అభ్యర్థుల్లో ఉత్సాహం ఉరకలేస్తోంది.
 
నలు చెరగులా... నలుగురు..

జిల్లా నలుచెరగులా నలుగురు నేతలు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. పార్టీ ఉత్తరాంధ్ర జిల్లాల సమన్వయకర్త సుజయ్‌కృష్ణ రంగారావు, జిల్లా పార్టీ అధ్యక్షుడు పెనుమత్స సాంబశివరాజు, విజయనగరం, అరకు పార్లమెంట్ సమన్వయకర్తలు బేబీనాయన, కొత్తపల్లి, అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తలు ప్రణాళిక ప్రకారం ప్రచారం సాగిస్తున్నారు. నాలుగు మున్సిపాల్టీలను, జిల్లా పరిషత్‌తో పాటు అత్యధిక మండల పరిషత్‌లు ఆ పార్టీకి దక్కేలా పావులు కదుపుతున్నారు.
   
వైఎస్‌ఆర్ సీపీలోకి వలసల జోరు    

కాంగ్రెస్, టీడీపీల నుంచి వస్తున్న వేలాది మంది కార్యకర్తలు వైఎస్‌ఆర్ సీపీలో చేరుతున్నారు. ఒక్క బుధవారమే గరుగుబిల్లి మండలంలోని కాంగ్రెస్, టీడీపీకి చెందిన వేలాది మంది కార్యకర్తలు, పలు గ్రామాల సర్పంచ్‌లు, మాజీ ప్రజాప్రతినిధులు ఆ పార్టీలో చేరారు. అలాగే తెర్లాం, బాడంగి, రామభద్రపురం మండలాల్లో కూడా చేరికలు జరిగాయి. సుజయ్‌కృష్ణ రంగారావు, బేబీనాయన ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా చేరికలు జరగ్గా, నెల్లిమర్లలో పెనుమత్స సాంబశివరాజు, డాక్టర్ సురేష్‌బాబు,  గజపతినగరం నియోజకవర్గంలో కడుబండి శ్రీనివాసరావు, చీపురుపల్లి నియోజకవర్గంలో బెల్లాన చంద్రశేఖర్, కురుపాం నియోజకవర్గంలో శత్రుచర్ల చంద్రశేఖర్‌రాజు, సాలూరు నియోజకవర్గంలో రాజన్నదొర, పార్వతీపురంలో జమ్మాన ప్రసన్నకుమార్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున చేరికలు జరుగుతున్నాయి.
 
బలమైన బొబ్బిలి..
వైఎస్‌ఆర్ సీపీకి బొబ్బిలి బలమైన కోటగా ఆవిర్భవించింది. ఉత్తరాంధ్ర జిల్లాల కన్వీనర్ సుజయ్‌కృష్ణరంగారావు, విజయనగరం పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయ కర్త బేబీనాయన పార్టీకి రచించిన వ్యూహాలు సత్ఫలితాలిచ్చాయి. నిత్యం ప్రజల మధ్యే ఉంటున్నారు. దీంతో ప్రత్యర్థి పార్టీలకు చెందిన వేలాది మంది పార్టీలో చేరుతున్నారు.ఇక్కడ కాంగ్రెస్ పూర్తిగా కుదేలయింది.
 
మూడు ప్రధాన పార్టీలూ 30 వార్డుల్లోనూ పోటీ చేస్తున్నా మిగతా పార్టీలకంటే ఫ్యాన్‌గాలి జోరుగా వీస్తోంది. సరైన నాయకత్వం లేకపోడంతో టీడీపీ క్యాడర్ జారుకుంటోంది. టీడీపీ, కాంగ్రెస్ పార్టీ గూడుపుఠాణీకి దిగడంతో కార్యకర్తల్లో అసంతృప్తి పెరుగుతోంది. దీంతో ఆ పార్టీల గ్రాఫ్ దిగజారుతోంది.
 
 పార్వతీపురం..
పార్వతీపుంలో సుజయ్‌కృష్ణరంగరావు, బేబీనాయన, కొత్తపల్లి గీతతో పాటు స్థానిక సమన్వయకర్త జమ్మాన ప్రసన్నకుమార్, ఇతర నేతలు ద్వారపురెడ్డి శ్రీనివాసరావు, మజ్జి వెంకటేష్ తదితరులు కృషి ఫలించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
 స్థానిక ఎమ్మెల్యే జయమణి కూడా వైఎస్‌ఆర్ సీపీ వైపు మొగ్గుచూపడం ఆ పార్టీకి కలిసివచ్చింది.
 
 టీడీపీలో టిక్కెట్ల కేటాయింపులో గందరగోళం, టిక్కెట్లు అమ్ముకుంటున్నారని ఆరోపణలు రావడం, ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు జగదీశ్‌పై వ్యతిరేకత వల్ల ఆ పార్టీ నష్టపోనుంది. పార్వతీపురం మున్సిపాలిటీలోని గల 30 వార్డుల్లో వైఎస్‌ఆర్ సీపీ, టీడీపీలు పోటీ చేస్తుండగా, కాంగ్రెస్ 27 వార్డుల్లో మాత్రమే అభ్యర్థులను నిలబెట్టగలిగింది. ప్రచారంలో కూడా కాంగ్రెస్ కనుమరుగుకాగా, టీడీపీ వెనుకంజలో ఉంది.
 
 సాలూరు..
సాలూరులో స్థానిక ఎమ్మెల్యే పీడిక రాజన్న దొర చేరిన తరువాత వైఎస్‌ఆర్ సీపీ బలపడింది. పార్టీలోకి వలసలజోరు పెరిగింది. పార్టీకి ప్రజాబలం ఎక్కువగా ఉంది. టీడీపీ కూడా పోటీపడుతోంది. అయితే వైఎస్‌ఆర్ సీసీ ముందంజలో ఉంది. కాంగ్రెస్ పూర్తిగా వెనుకబడింది.
 
విజయన ‘గరం...గరం’
విజయనగరంలో వైఎస్‌ఆర్ సీపీ, టీడీపీ నువ్వానేనా అన్నట్టు పోటీపడుతున్నాయి. వైఎస్‌ఆర్ సీపీ జిల్లా అధ్యక్షుడు సాంబశివరాజు, ఉత్తరాంధ్ర సమన్వయకర్త సుజయ్‌కృష్ణరంగారావు విస్తృతంగా పర్యటిస్తుండడంతో పార్టీ బలం మరింత పెరిగింది. మరో వైపు టీడీపీ కూడా గట్టిపోటీ ఇస్తోంది. కాంగ్రెస్ వెనుకంజలో ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement