బేరసారాలు
విజయనగరం మున్సిపాలిటీ, న్యూస్‌లైన్: మున్సిపల్ ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. పోలింగ్‌కు మరో వారం రోజులే గడువు ఉండటంతో ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో అభ్యర్థులు శ్రమిస్తున్నారు. ప్రస్తుతం ఒకప్పటిలా పరిస్థితి లేదు. నేతల హామీలకు ఓట్లు రాలే పరిస్థితి లేదు.
దీంతో ఓటర్లను మచ్చిక చేసుకునేందుకు అభ్యర్థులు తమకు తెలిసిన విద్యలన్నింటినీ ప్రయోగిస్తున్నారు. బంధుత్వాలతో వరసలు కలుపుకోవడం ఒక ఎత్తయితే.. స్థానిక నాయ కులు, కుల పెద్దలతో బేరసారాలు కుదుర్చుకుంటున్నారు. ఓటర్లకు వ్యక్తిగతంగా మందు, నగదు, నజరానాలు అందజేసేందుకూ ఒప్పందాలు చేసుకుంటున్నారు. ఇప్పటికే డబ్బు మూటలు దిగుతున్నాయి.
ఒక్కమాటలే చెప్పాలంటే గెలుపే ధ్యేయంగా అభ్యర్థులు అడ్డదారులు తొక్కుతున్నారు. ఈ నేపథ్యంలో ఓట్ల కోసం బేరసారాలు ఊపందుకున్నాయి. ఈ ప్రక్రియలో చోటా నేతలు కీలక పాత్ర పోషిస్తున్నారు. వారే డీల్ మాట్లాడుకుని డబ్బు మూటలు అందజేస్తున్నారు. అభ్యర్థులు కూడా గెలుపే లక్ష్యంగా ఎంతకైనా సై అంటున్నారు.
అంతటా ఓటూ... నోటే...!
సాధారణ ఎన్నికలను తలదన్నేలా జిల్లాలో మున్సిపల్ పోరు మారుతోంది. కొద్ది రోజుల్లోనే సాధారణ ఎన్నికలు రానున్న దృష్ట్యా ఈ ఎన్నికల ప్రాధాన్యం మరింత పెరిగింది. ప్రస్తుత ఎమ్మెల్యేలతోపాటు భవిష్యత్‌లో ఎమ్మెల్యేలుగా పోటీ చేసే వారు.. బరిలో ఉన్న కౌన్సిలర్ అభ్యర్థులకు దన్నుగా నిలుస్తున్నారు. దీంతో ధన ప్రవాహం పెరిగింది. ప్రచారానికే ఒక్కో అభ్యర్థీ రూ.లక్షల మీద ఖర్చు చేస్తున్నట్లు వినికిడి. భోజనాలు, మద్యం, ఇతర తాయిలాలు ఈ ఖాతాలోకే వస్తాయి.
ప్రచారానికి ఖర్చు తడిసిమోపెడవుతున్నా అభ్యర్థులు వెనక్కి తగ్గకపోవడం విశేషం. ఓ వైపు ప్రచారం చేస్తూనే మరో వైపు ఓటుకు ఇంత
ఇస్తామని ఒప్పందాలు కుదుర్చుకునే పనిలో నిమగ్నమవుతున్నారు. జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో 129 వార్డు స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. అంతటా ఇదే పరిస్థితి ఉన్నట్లు తెలుస్తోంది.
రాష్ట్ర విభజన నేపథ్యంలో అంతటా కాంగ్రెస్‌కు గడ్డు పరిస్థితి ఎదురవుతున్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో ఓటర్లను మచ్చిక చేసుకునేందుకు ఆ పార్టీ నేతలు ఆఫర్లు మీద ఆఫర్లు ప్రకటించేస్తున్నట్లు సమాచారం. ఇక కాంగ్రెస్ గడ్డు పరిస్థితిని తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు టీడీపీ నేతలు. గెలుపే ధ్యేయంగా అడ్డదారులు తొక్కేస్తున్నారు. ఓటుకు రూ.500 నుంచి రూ.2 వేల వరకు వెచ్చించేందుకు అభ్యర్థులు సిద్ధపడుతున్నట్లు వినికిడి.
చెర్మన్ అభ్యర్థిగా బరిలో ఉన్న అభ్యర్థుల వార్డులో అయితే ఓటు ధర రూ.2 వేల నుంచి రూ.3 వేల వరకు పలుకుతున్నట్లు సమాచారం. రానున్న అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఓట్ల కోసం ఎంతైనా వెచ్చించేందుకు అభ్యర్థులు సమాయత్తమవుతున్నారు. ప్రధానంగా తీవ్రమైన పోటీ ఉన్న వార్డుల్లో 100 నుంచి 200 ఓట్లు నిర్ణయాత్మక పాత్ర పోషించనున్నాయి. అలాంటి ఓట్ల కోసం కచ్చితమైన హమీతో రూ.3 వేలు నుంచి రూ.5 వేల వరకు ఇస్తామని కొంతమంది ముందుకు వస్తున్నారంట!
స్పాన్సర్లను రంగంలోకి దించిన అధికారపక్షం..!
ఇదిలా ఉండగా మున్సిపల్ ఎన్నికల కోసం అటు అధికార, ఇటు ప్రతిపక్ష టీడీపీలు స్పాన్సర్లను రంగంలోకి దింపాయన్న ఆరోపణలు జోరుగా వినిపిస్తున్నాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారులు, కాంట్రాక్టర్లు, బడా వ్యాపారులకు ఈ బాధ్యతలు అప్పగిస్తున్నారు. ‘నువ్వు ఆ వార్డుకు వంద కేసులు మద్యం పంపించు... నువ్వు ఆ వార్డుకు రూ.3 లక్షలు డొనేషన్ ఇవ్వు...’ అంటూ తమ చేతికి తడి అంటుకోకుండా వారి సేవలు వినియోగించుకుంటున్నారు.
వాస్తవానికి ఇది ఎన్నికల నియామవళికి విరుద్ధం. కానీ సంబంధిత అధికారులు వీటిపై దృష్టి సారించడం లేదు. దీంతో ధన బలం ఉన్న నాయకులు స్పాన్సర్లకు బాధ్యతలు అప్పగించి గెలుపు కోసం అడ్డదారులు తొక్కుతున్నారు. ఈ పరిణామాలతో మున్సిపల్ పోరు సాధారణ ఎన్నికలను తలపిస్తోంది.