చిన్నమ్మ పిటిషన్ తిరస్కృతి..!
సాక్షి, చెన్నై:
విదేశీ మారక ద్రవ్యం కేసులో వీడియో కాన్పెరెన్స్ విచారణ నిమిత్తం ముందుగా శశికళకు ప్రశ్నల జాబితా ఇవ్వడానికి ఎగ్మూర్‌కోర్టు నిరాకరించింది. ఆమె చేసుకున్న అభ్యర్థనను తిరస్కరించింది. పిటిషన్ విచారణ యోగ్యం కాదని తేల్చింది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ తీవ్ర ఆక్షేపణకు కోర్టు స్పందించింది.
దివంగత సీఎం జయలలిత నెచ్చెలి శశికళపై ఉన్న కేసుల్లో విదేశీ మారక ద్రవ్యం కేసు కూడా ఒకటి. అక్రమాస్తుల కేసులో ఆమె కారాగార వాసంలో ఉన్న నేపథ్యంలో కేసుల విచారణలన్నీ వేగం పుంజుకుంటున్నాయి. ఇందులో 1996–2001 మధ్యకాలంలో శశికళ పై ఈడీ దాఖలు చేసిన కేసులు ఐదు ఉన్నాయి. జయ టీవీకి విదేశాల నుంచి పరికరాల కొనుగోళ్లల్లో సాగిన నగదు బట్వాడాలో విదేశీ మారక ద్రవ్యం వ్యవహారంపై చెన్నై ఎగ్మూర్‌కోర్టులో కేసు విచారణ సాగుతున్నది.
కోర్టుకు శశికళ నేరుగా హాజరుకావాల్సి ఉన్నా, జైలు శిక్ష నేపథ్యంలో కుదరని పని. దీంతో వీడియో కాన్పెరెన్స్ విచారణకు అనుమతి ఇవ్వాలని కోరుతూ కోర్టులో పిటిషన్ వేశారు. కాగా, ముందస్తు ప్రశ్నల జాబితాకు చట్టంలో ఆస్కారం ఉందంటూ శశికళ తరపు న్యాయవాదులు వాదన వినిపించారు. చట్టంలో ఇందుకు ఆస్కారం లేదని, వీడియో కాన్పెరెన్స్ విచారణలో న్యాయవాదులకు పనేలేదంటూ ఈడి వాదన వినిపించింది.
వీడియో కాన్ఫెరెన్స్ విచారణ కోర్టు, నింధితుల మధ్య మాత్రమే సాగుతుందన్న విషయాన్ని పరిగణించి శశికళ పిటిషన్ తిరస్కరించాలని ఈడి విజ్ఞప్తి చేసింది. సోమవారం ఈ పిటిషన్‌పై న్యాయమూర్తి జాకీర్ హుస్సేన్ తీర్పువెలువరించారు. శశికళ తరపు పిటిషన్ విచారణ యోగ్యం కాదని తేల్చారు. కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నింధితులకు ముందుగానే ప్రశ్నలతో కూడిన జాబితా ఇవ్వడానికి వీలు లేదని, వీడియో కాన్ఫెరెన్స్ విచారణలో కోర్టు ప్రశ్నలను సందించాల్సి ఉంటుందంటూ, ఆమె పిటిషన్‌ను తిరస్కరిస్తున్నట్టు ప్రకటించారు. దీంతో తదుపరి ప్రయత్నాల్లో శశికళ తరపు న్యాయవాదలు నిమగ్నం అయ్యారు. పిటిషన్ తిరష్కరణ దృష్ట్యా, తదుపరి విచారణలో శశికళను కోర్టుకు హాజరుపరచాల్సిన అవసరం ఉంటుందా..? అన్న చర్చలో పడ్డారు. ఇందుకు తగ్గ అవకాశాలు ఉన్నాయా..? అని ఆమె తరపున న్యాయవాదులు పరిశీలనలో నిమగ్నం అయ్యారు.