న్యూఢిల్లీ: ఇద్దరు దోషులకు విధించిన ఉరిశిక్షను సస్పెండ్ చేస్తూ అత్యున్నత న్యాయస్థానం తీసుకున్న నిర్ణయంపై డిసెంబర్,16 సామూహిక అత్యాచార ఘటన బాధితురాలి తండ్రి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తీర్పు అనంతరం సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘హైకోర్టు విధించిన ఉరిశిక్షపై సుప్రీంకోర్టు స్టే ఇవ్వడం నాకు ఎంతమాత్రం సంతోషం కలిగించడం లేదు. నా కుమార్తెపై దోషులు అత్యంత కిరాతకంగా వ్యవహరించారు. తాను బతకాలని ఆశించింది. అయితే ఆమెను కాపాడుకోలేకపోయా. ఆమె మృతితో నేను సర్వం కోల్పోయా. ఏదైనా నిర్ణయం తీసుకునేందు ముందు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు నావంటి భావనలు, ఆలోచనలు కలిగిఉండాల్సింది’ అని అభిప్రాయపడ్డాడు. సుప్రీంకోర్టు తీర్పుతో నాతోపాటు మా కుటుంబసభ్యులంతా దిగ్భ్రాంతికి గురయ్యాం. దోషులకు ఉరిశిక్ష విధించాలనేదే నా చివరి డిమాండ్. అందుకోసం పోరాటం చేస్తూనే ఉంటా’ అని అన్నారు. కాగా ఈ కేసులో దోషులైన వినయ్‌శర్మ, అక్షయ్‌ఠాకూర్‌లకు హైకోర్టు విధించిన ఉరిశిక్షపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చిన సంగతి విదితమే.
పరిచితులే నిందితులు
దేశ రాజధాని నగరంలో నమోదవుతున్న అత్యాచార కేసు బాధితుల్లో అత్యధిక శాతం మంది 18 ఏళ్ల లోపువారే. ఇందులోనూ గమనించాల్సిన అంశమేమిటంటే అత్యధిక శాతం మంది దోషులు బాధిత యువతులకు పరిచితులే. నగర పోలీసులు ఇటీవల జరిపిన ఓ అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. నగరంలో ఇటీవల అత్యాచార ఘటనలు పెరిగిపోయిన నేపథ్యంలో పోలీసులు ఈ అధ్యయనం చేశారు. అత్యధికంగా 81.22 శాతం కేసుల్లో అత్యాచారానికి పాల్పడినవారికి, బాధిత యువతులకు మధ్య పరిచయం ఉండడంతోపాటు ఇటువంటివన్నీ సమీపంలోని గృహాల్లో జరిగినవే. 46 శాతం నేరాలు 18 ఏళ్లలోపు వారిపై జరిగినవే. ఈ విషయాన్ని సంబంధిత పోలీసు ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. 21 శాతం మంది ఇరుగుపొరుగువారు అత్యాచారానికి పాల్పడగా, ఇంకో 41 శాతం మంది బాధితుల స్నేహితులతోపాటు అత్యంత సన్నిహితంగా మెలుగుతున్నవారేనని తేలింది.
కాగా 2.25 శాతం కేసుల్లో నిందితులు బాధిత యువతుల తండ్రులేనని ఈ అధ్యయనంలో తేలింది. ఇంకా 1.25 శాతం మంది బాధితుల బాబాయిలు, 0.6 శాతం మంది సోదరులు, 1.34 శాతం మంది మాజీ భర్తలు, 1.8 శాతం మంది మామయ్యలు, 0.3 శాతం మంది సేవకులు, మరో 3.5 శాతం మంది ఆయా సంస్థల యజమానులు ఉన్నారు. 14 శాతం కేసుల్లో 16 నుంచి 18 ఏళ్ల వయస్సు కలిగిన బాధిత యువతులపై నిందితులు దాడికి పాల్పడ్డారు. అత్యంత హేయంగా రెండు సంవత్సరాలకంటే తక్కువ వయసున్న వారిపైనా నిందితులు అత్యాచారానికి పాల్పడ్డారు. నిందితులు 18 నుంచి 25 ఏళ్ల వయస్సుగల యువతులను లక్ష్యంగా చేసుకుని నేరాలకు పాల్పడుతున్నారు. నేరాల్లో 4.5 శాతం పూరిపాకల్లోనూ, 1.5 శాతం వాహనాల్లోనూ. మూడు శాతం ఉద్యానవనాల్లోనూ, దుకాణాలు, కార్యాలయాల్లో 1.2 శాతం, హోటళ్లు, రెస్టారెంట్లలో 2.5 శాతం, పాఠశాలలు, కళాశాలల భవనాల్లో 0.75 శాతం జరిగాయి. 2013, డిసెంబర్ 13 తర్వాత నుంచి ఇప్పటిదాకా నగరవ్యాప్తంగా మొత్తం 1,647 కేసులు నమోదయ్యాయి.
దిగ్భ్రాంతికి గురయ్యాం
Published Mon, Jul 14 2014 10:50 PM | Last Updated on Sun, Sep 2 2018 5:20 PM
Advertisement
Advertisement