మందుబాబులు మూడింతలు
సాక్షి ముంబై: నగరంలో వారం రోజుల ముందు నుంచే ‘థర్టీ ఫస్ట్’ పార్టీలు ప్రారంభమయ్యాయి. ఈ వేడుకల్లో ఎక్కువశాతం మంది మద్యం సేవిస్తున్నారు. దీంతో తాగుబోతుల సంఖ్య మూడింతలు పెరిగిందని ‘ది అసోసియేటెడ్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా’ సంవత్సరం చివరి రోజు, నూతన సంవత్సరం వేడుకల్లో యువకులు మద్యం సేవించే అంశంపై నిర్వహించిన సర్వేలో ఈ విషయం తేలింది. డిసెంబర్ 31ని పురస్కరించుకొని పెద్ద ఎత్తున జరుపుకునే వేడుకల్లో మద్యం సేవించడం మూడింతలు పెరిగిందని ఆ సంస్థ స్పష్టం చేసింది. మన దేశంలో 18 సంవత్సరాలపై ఉన్న వారు మద్యం సేవించాలన్న నిబంధన ఉన్నా అది సరిగ్గా అమలవుతున్నట్టు ఎక్కడా కన్పించడం లేదు. 14 ఏళ్ల బాలురు కూడా మద్యం సేవిస్తున్నారు. ముంబైలో 14 నుంచి 29 సంవత్సరాల వయస్సు గల బాలురు, యువకులను పలు ప్రశ్నలు అడిగి, వారిచ్చిన సమాధానాలతో రూపొందించిన నివేదికలో ఈ విషయాలు ఉన్నాయని సంస్థ తెలిపింది. 15 నుంచి 18 సంవత్సరాల వయస్సు గల వారు ఎక్కువగా మద్యం చేస్తున్నారని తేలిందని వెల్లడించింది. ఈ వయస్సు గల యువకుల్లో 60 శాతం మంది మద్యం సేవించిన తర్వాత అదుపు తప్పి ప్రవర్తిస్తున్నారనే విషయం తేలింది. వీరు ఇలాగే వ్యవహరిస్తే ఆరోగ్యం దెబ్బతినే అవకాశముంటుందని సంస్థ ఆరోగ్య విభాగ చైర్మన్ బి.కె.రావ్ తెలిపారు.
పిల్లలు ముందు రుచి చూడటం కోసం ఫ్రూట్ ఫ్లేవర్డ్ ఉన్న మద్యం సేవిస్తారు. ఆ తర్వాత మగ్ బీర్, వోడ్కా లాంటి తీవ్ర మత్తు కలిగించే మద్యం సేవించడం ప్రారంభిస్తారని ఆయన చెప్పారు. 20 నుంచి 29 సంవత్సరాలలోపు గల యువకుల్లో 69 శాతం మంది నూతన సంవత్సరం వేడుకలు జరుపుకోవడానికి ఎంతో ఉత్సాహం చూపుతున్నారని, అందులో అందరు మద్యం సేవించడానికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు కనిపించిందన్నారు. 15 నుంచి 18 వయస్సు గల వారు ‘తాము మద్యం సేవిస్తున్నామని’ గర్వంగా చెబుతున్నారని రావ్ అన్నారు. ‘దేశంలో 1958 సంవత్సరంలో 28 సంవత్సరాల వయస్సు గల యువకులు మాత్రమే మద్యం సేవించేవారు. కానీ ప్రస్తుత రోజుల్లో మాత్రం ఆ వయస్సు సంఖ్య 18కు దిగిపోవడం గమనార్హమ’ని ఆయన తెలిపారు.
మందుబాబులపై ట్రాఫిక్ శాఖ దృష్టి...
ఇదిలాఉండగా సంవత్సరం చివరి రోజు, నూతన సంవత్సరం రానుండడంతో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నియంత్రించడానికి నగర ట్రాఫిక్ శాఖ సిద్ధమవుతోంది. వేడుకల్లో మద్యం సేవించి వాహనం నడపడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉండటంతో మందుబాబులపై చర్యలు తీసుకోవడంపై దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ పోలీసులు నగరంలోని అనేక చోట్ల నాకాబందీలు, ప్రత్యేక చర్యలు ప్రారంభిస్తున్నారు. దీంతో రాబోయే రోజుల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు కొంతమేర అయినా తగ్గే అవకాశముందని నగర పోలీసులు అంటున్నారు.