ఈ రిక్షా చోదకుల లెసైన్సు నిబంధనలు సడలించిన ప్రభుత్వం
సాక్షి, న్యూఢిల్లీ: ఇ-రిక్షా డ్రైవర్ల డ్రైవింగ్ లెసైన్స్ నిబంధనలను ప్రభుత్వం సడలించింది. దీనితో ఢిల్లీ రోడ్లపై ఇ-రిక్షాలు తిరగడానికి మార్గం సుగమమైంది. భద్రతా కారణాల దృష్ట్యా ఢిల్లీ హైకోర్టు ఈ రిక్షాలపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే . ఇ-రిక్షా చోదకుల డ్రైవింగ్ లెసైన్స్ నిబంధనలను సడలించే ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపిందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. లైట్ మోటార్ వెహికిల్ డ్రైవింగ్ లెసైన్స్ కనీసం ఏడాదిగా కలిగినవారికే వాణిజ్య వాహనం నడిపేందుకు లర్నర్స్ లెసైన్స్ ఇవ్వాలన్న నిబంధనను కొట్టివేశారని ఓ ప్రభుత్వ అధికారి తెలిపారు. ఇ-రిక్షా చట్టబద్దమైన వాహనమని, డ్రైవింగ్ టెస్ట్ పాసైన డ్రైవర్‌కు డ్రైవింగ్ లెసైన్స్ జారీచేస్తారని ఆయన తెలిపారు.
ఇ-రిక్షాలు నడపడానికి డ్రైవింగ్ లెసైన్స్ తప్పనిసరి చేస్తూ వాటి గరిష్ట వేగం గంటకు 25 కిలోమీటర్లు మించరాదని ప్రభుత్వం అక్టోబర్‌లో ఇ-రిక్షాల నియమాలను నోటిఫై చేసింది. స్పెషల్ పర్పస్ బ్యాటరీ ఆపరేటెడ్ వెహికిల్స్ నడవడానికి వీలుగా ప్రభుత్వం కేంద్ర మోటారు వాహనాల నిబంధలు- 2014 (16వ సవరణ )ను ప్రభుత్వం నోటిఫై చేసింది. ఇ-రిక్షాలలో నలుగురు ప్రయాణికులకు మించి ప్రయాణించరాదని, 40 కిలోల బరువు సామగ్రికి మించి తీసుకెళ్లరాదని ఈ నియమాలు పేర్కొన్నాయి. ఇ-రిక్షాలు ఇతర వాహనాలకు, పౌరుల ప్రాణాలకు ముప్పుగా పరిణమించాయని పేర్కొంటూ ఢిల్లీ హైకోర్టు జులై 31న నగరంలో వాటిపై నిషేధం విధించింది.