హైకోర్టు మొదటి మహిళా చీఫ్ జస్టిస్‌గా రోహిణి
Published Tue, Apr 15 2014 10:57 PM | Last Updated on Sat, Sep 2 2017 6:04 AM
న్యూఢిల్లీ: ఢిల్లీ హైకోర్టుకు మరో వారం రోజుల్లో మొదటి మహిళా ప్రధాన న్యాయమూర్తి రానున్నారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో సీనియర్ జడ్జి అయిన జస్టిస్ జి. రోహిణిని ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమిస్తూ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఇటీవల ఆదేశాలు జారీచేసిన విషయం తెలిసిందే. ఈమె నియామకంతో హైకోర్టులో మహిళా జడ్జీల సంఖ్య 10కి పెరిగింది. ప్రస్తుతం ఢిల్లీ హైకోర్టులో 40 మంది జడ్జీలు ఉన్నారు. 58 ఏళ్ల జస్టిస్ రోహిణి మరో నాలుగేళ్లపాటు ఈ పదవిలో కొనసాగుతారు.
కాగా, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ రోహిణి నియామకంపై ఢిల్లీ హైకోర్టు బార్ అసోసియేషన్ హర్షం వ్యక్తం చేసింది. ఈ నియామకం న్యాయవాద వృత్తిలో మహిళలను మరింత ప్రోత్సహించడానికి తోడ్పడుతుందని అసోసియేషన్ అధ్యక్షుడు రాజీవ్ శుక్లా అన్నారు. ‘మేం ఆమె రాక కోసం ఎదురుచూస్తున్నాం.
హైకోర్టులో సమస్యల పరిష్కారానికి ఆమె కృషిచేస్తారని విశ్వసిస్తున్నాం. న్యాయవ్యవస్థలో పారదర్శకత, సమానవకాశాల కోసం మా అసోసియేషన్ ఉద్యమిస్తోంది.. మా డిమాండ్లను ఆమె తీరుస్తారని ఆశిస్తున్నా’ మని ఆయన అన్నారు. ఇదిలా ఉండగా, జస్టిస్ రోహిణి 1955 ఏప్రిల్ 14న ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో జన్మించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, ఆంధ్రా యూనివర్సిటీ నుంచి లా డిగ్రీ పొందారు. 1980లో న్యాయవాదిగా ప్రాక్టీస్ మొదలుపెట్టి రెండు దశాబ్దాలపాటు వివిధ స్థాయిల్లో పనిచేశారు. ఏపీ లా జర్నల్స్‌లో జర్నలిస్టుగా పనిచేశారు. 1985లో జర్నల్స్‌కు ఎగ్జిక్యూటివ్ ఎడిటర్‌గా సేవలందించారు. 2001 జూన్ 25న అదనపు జడ్జిగా నియమితులయ్యారు. 2002 జూలై 31 తర్వాత శాశ్వత జడ్జిగా బాధ్యతలు చేపట్టారు.
Advertisement
Advertisement