దీక్షకు దిగిన డీడీ నాయుడు మెడికల్ కళాశాల విద్యార్థులు
Published Wed, Aug 7 2013 3:38 AM | Last Updated on Fri, Sep 1 2017 9:41 PM
తిరువళ్లూరు, న్యూస్‌లైన్: తమను నట్టేట ముంచిన డీడీ నాయుడు కళాశాలపై చర్యలు తీసుకోవాలని, విద్యా సంవత్సరాన్ని కోల్పోయిన తమకు న్యాయం చేయాలని కోరుతూ విద్యార్థులు మంగళవారం దీక్ష చేపట్టారు. తిరువళ్లూరు జిల్లా కనకమ్మసత్రం సమీపంలోని కున్నవలం గ్రామంలో డీడీ నాయుడు మెడికల్ కళాశాల ఉంది. ఈ కళాశాలకు 2010లో ఇండియన్ మెడికల్ కౌన్సిల్ మెడికల్ కళాశాల నిర్వాహణ కోసం అనుమతి ఇచ్చింది. తర్వాత పలు ఆరోపణలు రావడంతో తనిఖీలు నిర్వహించిన మెడికల్ కౌన్సిల్ 2011లో అనుమతిని రద్దు చేసింది. కళాశాల నిర్వాహకులు 2010లో కౌన్సిల్ ఇచ్చిన అనుమతిని చూపించి 2011లో 103 మందిని, 2012లో 100 మందికి పైగా విద్యార్థులను చేర్చుకున్నారు. వారి నుంచి డొనేషన్ సహా అనేక ఫీజుల రూపంలో రూ.30 లక్షల నుంచి రూ.40 లక్షల వరకు వసూలు చేశారు. ఇంత పెద్ద ఎత్తున ఫీజులు చెల్లించినా యూనివర్సిటీ నిర్వహించే ఒక్క పరీక్షను కూడా విద్యార్థులు రాయలేదు.
దీంతో కళాశాలపై అనుమానం కలిగిన విద్యార్థులు యూనివర్సిటీ వీసీని కలిశారు. దీంతో కళాశాలకు అనుమతి లేదని తెలుసుకున్న షాక్‌కు గురయ్యారు. తమకు న్యాయం చేయాలని కోరుతూ పలుమార్లు ఆందోళనలు చేశారు. విద్యార్థులకు నష్టం జరుగకుండా చర్యలు తీసుకుంటామని వీసీ హామీ ఇవ్వడంతో విద్యార్థులు శాంతించారు. వీసీ ఇచ్చిన హామీ అమలుకాకపోవడంతో పాటు, కళాశాల చైర్మన్ డీడీ నాయుడుపై చీటింగ్, హత్యాయత్నంతో పాటు పలు కేసులు నమోదయ్యాయి. మూడు నెలల క్రితం అతన్ని పోలీసులు ఢిల్లీలో అరెస్టు చేశారు. అనంతరం ఫిర్యాదులు వెల్లువెత్తడంతో గూండా చట్టం కింద అరెస్టు చేసి వేలూరు జైలుకు తరలించారు. దీంతో తమ ఫీజులు తిరిగి చెల్లించాలని కొందరు, పరీక్ష రాసే అవకాశం కల్పించాలని మరి కొందరు ఆందోళన చేయడంతో కళాశాలను మూసేశారు. నెలలు గడుస్తున్నా తమకు న్యాయం జరగడం లేదని ఆరోపిస్తూ 2011-12 బ్యాచ్‌కు చెందిన విద్యార్థులు మంగళవారం దీక్షకు దిగారు. డీడీ నాయుడు నిర్వాకం వల్ల తాము మూడు విద్యా సంవత్సరాలు, లక్షలాది రూపాయలు నష్టపోయామని వాపోయారు. తమకు న్యాయం జరిగే వరకు కదిలేది లేదని తేల్చిచెప్పారు.
టెంట్‌ను తొలగించిన పోలీసులు: దీక్షకు అనుమతి లేదని ఆగ్రహించిన పోలీసులు విద్యార్థులు వేసుకున్న టెంట్‌ను తొలగించారు. దీంతో విద్యార్థులకు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. అనేక విధాలుగా నష్టపోయిన తమకు నిరసన తెలిపే హక్కు కూడా లేదా అని వాపోయారు. అనంతరం కళాశాల లోపలికి వెళ్లిన విద్యార్థులు తాము ఆమరణ నిరాహర దీక్షకు దిగుతున్నట్టు ప్రకటించారు. తమ కళాశాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని, లేదా తమకు వేరే కళాశాలలో సీటు కల్పించాలని నినాదాలు చేశారు. విద్యార్థుల తల్లిదండ్రులు మీడియాతో మాట్లాడుతూ తమ పిల్లల భవిష్యత్తు నాశన మైందన్నారు. ప్రభుత్వం చర్యలు తీసుకుని న్యాయం చేయాలని కోరారు.
Advertisement
Advertisement