కేకే.నగర్ : తిరువొత్తియూర్ సమీపంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్యకు పాల్పడగా, పెళ్లి కుమారుడు నచ్చలేదని ఓ నర్సు విషం ఇంజెక్షన్ వేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన రాయపురంలో చోటు చేసుకుంది. పొల్లాచ్చిలో వ్యాపారి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటనలు ఆ ప్రాంతంలో విషాదాన్ని నింపాయి.
కుటుంబం ఆత్మహత్య : తిరువొత్తియూరు సమీపంలోని మణలి చిన్నసేక్కాడు బుద్ధబిరాన్ వీధికి చెందిన దేవగిరి(66) అతని భార్య జ్యోతి(55). ఈ దంపతులకు జయకని, షీలా ఇద్దరు కుమార్తెలు. వేదగిరి తిరువొత్తియూరు లిమ్కా కంపెనీలో పని చేసి విశ్రాంతి పొందాడు. పెద్ద కుమార్తె జయకనికి వివాహం కాలేదు. రెండో కుమార్తె షీలాకు మతిస్థిమితం లేకపోవడంతో ఆమెను చికిత్స నిమిత్తం వేలూరు ఆసుపత్రిలో చేర్పించారు. పెద్ద కుమార్తెకు వివాహం కాకపోవడం, చిన్న కుమార్తెకు మతిస్థిమితం లేకపోవడం వేదగిరి, జ్యోతి దంపతులు మానసికంగా కుంగిపోయారు. తమకు జీవితంపై విరక్తిగా ఉందని మరణమే దీనికి పరిష్కారం అంటూ జ్యోతి చుట్టుపక్కల వారితో చెప్పి కన్నీరు పెట్టుకునేది. ఈ నేపథ్యంలో వేదగిరి, జ్యోతి, జయకని ఈ ముగ్గురు శుక్రవారం అర్ధరాత్రి కిరోసిన్ పోసుకుని నిప్పు అంటించుకున్నారు. వారి అరుపులు విని చుట్టుపక్కల వారు రక్షించే లోపు వారు మంటల్లో కాలిపోయి మృతి చెందారు. మణలి పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు.
నర్సు ఆత్మహత్య : న్యూ వాషర్‌మెన్‌పేట కీరై తోటకు చెందిన సింధు. నుంగంబాక్కంలోని ప్రైవేటు ఆసుపత్రిలో నర్సుగా పని చేస్తోంది. సింధుకు ఆమె తల్లిదండ్రులు పెళ్లి ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఆమెకు వరుడు నచ్చలేదు. దీంతో విరక్తి చెందిన సింధు విషయాన్ని కుటుంబసభ్యులకు చెప్పలేక మథనపడేది. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి హఠాత్తుగా సృహ తప్పి పడిపోయింది. వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం స్టాన్లీ ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే సింధు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. విచారణలో వరుడు నచ్చకపోవడంతో విషం ఇంజెక్షన్ వేసుకుని సింధు ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసింది.
వ్యాపారి ఆత్మహత్య : కోయంబత్తూరు జిల్లా పొల్లాచ్చి సమీపంలోని చిన్నంపాళయంకు చెందిన దురైస్వామి టెంకాయల వ్యాపారి. ఇతడు వ్యాపారం కోసం పొల్లాచ్చిలోని ప్రైవేటు ఫైనాన్స్ సంస్థలో కొన్నేళ్ల క్రితం రూ.4 లక్షలు అప్పు తీసుకున్నారు. దీనికి పలుమార్లు లక్షల రూపాయలను వడ్డీగా చెల్లించాడు. అయితే ఫైనాన్స్ సంస్థ అతని ఇంటి పట్టాను వాళ్ల పేరున మార్చుకుని అధిక మొత్తంలో వడ్డీ డబ్బులు అడిగి బెదిరించినట్లు తెలుస్తోంది. దీంతో విరక్తి చెందిన దురైస్వామి శుక్రవారం ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. వడ్డీ కోసం తనను వేధించడం వల్లనే ఆత్మహత్య చేసుకుంటున్నట్టు దురైస్వామి రాసిన లేఖ పోలీసులకు అందింది. దీంతో పోలీసులు ఫైనాన్స్ కంపెనీకి చెందిన శివానందంను అరెస్టు చేసి, అధిక వడ్డీకి అప్పు ఇవ్వడం, ఆత్మహత్యకు ప్రేరేపించడం వంటి కేసులు నమోదు చేశారు.
వేర్వేరు ప్రాంతాల్లో ఆత్మహత్యలు
Published Sun, Sep 25 2016 2:06 AM | Last Updated on Mon, Sep 4 2017 2:48 PM
Advertisement