ముద్దు తెచ్చిన తంటా..!
= మద్యం మత్తులో యువతుల ఆగడాలు
= అర్ధరాత్రి వరుస ప్రమాదాలు
= మద్యం తాగలేదని బౌరింగ్
ఆస్పత్రి వైద్యుల తప్పుడు నివేదిక ?
బెంగళూరు (బనశంకరి) : మద్యం మత్తులో కారు డ్రైవింగ్ చేస్తున్న ముగ్గురు యువతులు పరస్పరం ముద్దు పెట్టుకోవడానికి యత్నించి వరుస ప్రమాదాలకు కారణమైన సంఘటన ఆదివారం అర్దరాత్రి నందిదుర్గ రోడ్డులో జరిగింది. వివరాలు... నగరానికి చెందిన షాలిని అనే యువతితో పాటు మరో ఇద్దరు స్నేహితులు నందిదుర్గ రోడ్డులో హొండా కారులో వెళ్తూ పీకలదాకా మద్యం తాగారు. అదే సమయంలో మద్యం మత్తులో ఒకరినొకరు ముద్దు పెట్టుకోడానికి యత్నించారు.
దీంతో కారు అదుపుతప్పి ముందు వెళ్తున్న మరో కారును, ఓ స్కూటర్‌ను ఢీకొట్టింది. అనంతరం పారిపోవడానికి యత్నించిన వీరిని ఫర్హాన్ అనే వ్యక్తి కారులో వెంబడించి షాలినితో పాటు ఇద్దరు యువతులను పట్టుకుని ఆర్టీ నగర పోలీసులకు అప్పగించాడు. ఈ ముగ్గురు పరస్పరం ముద్దుపెట్టుకోవడానికి వెళ్లి ఈ ప్రమాదం కారణమయ్యారని ఫర్హాన్ పోలీసులకు వివరించాడు.
ఇదే సమయంలో ట్రాఫిక్ పోలీసులు షాలినీని బౌరింగ్ ఆస్పత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించగా ఆమె మద్యం సేవించలేదని నివేదిక ఇచ్చారు. బౌరింగ్ ఆస్పత్రి వైద్యులు తప్పుడు నివేదిక ఇచ్చారని మరోకారు డ్రైవర్ ఆరోపించాడు. ఆర్టీ నగర ట్రాఫిక్ పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు.