
కరువు కోరల్లో 25 వేల గ్రామాలు: సీఎం
నాగపూర్: రాష్ర్టంలోని 25 వేల గ్రామాలు కరువుకోరల్లో చిక్కుకుపోయాయని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ పేర్కొన్నారు. ఈ పరిస్థితిని అధిగమించేందుకు తమ ప్రభుత్వం అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటోందని తెలిపారు. శాసనసభలో బుధవారం ఈ మేరకు ఆయన ఓ ప్రకటన చేశారు. ‘కరువు పరిస్థితి తీవ్రంగా ఉన్న 14 ప్రాంతాల్లో కేంద్ర ప్రభుత్వం పర్యటించిందన్నారు. అక్కడి స్థితిగతులను అధ్యయనం చేసింది. మేము తీసుకుంటున్న చర్యలను అభినందించింది’అని అన్నారు.
మొత్తం కరువుపీడిత గ్రామాలు 19వేలని, ఇందులో 5,600 గ్రామాలను కేంద్ర కమిటీ కొత్తగా చేర్చిందన్నారు. కరువుపీడిత గ్రామాలకు తాగునీరు, పశువులకు దాణా అందించేందుకు తమ ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటోందన్నారు. కరువు పరిస్థితి భీకరంగా ఉందన్నారు. కరువుపీడిత కుటుంబాలకు సబ్సిడీ ధరలపై ఆహార ధాన్యాలను అందజేస్తున్నామన్నారు.
ఉన్నతస్థాయి సమావేశంలో చర్చ
అంతకుముందు సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ అధ్యక్షతన ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి స్వాధీన్ క్షత్రియ, అదనపు ప్రధాన కార్యదర్శి సుధీర్‌కుమార్ గోయల్, ఆర్థిక విభాగం అదనపు ప్రధాన కార్యదర్శి సుధీర్ శ్రీవాస్తవ తదితరులు పాల్గొన్నారు.