
న్యాయం జరగకపోతే భర్త దారిలోనే !
డివైఎస్‌పీ గణపతి భార్య పావన హెచ్చరిక
బెంగళూరు: ప్రభుత్వం నుంచి తమకు న్యాయం లభించకపోతే తన భర్త నడిచిన దారిలోనే ఆత్మహత్యకు పాల్పడతానని డీఎస్పీ గణపతి భార్య పావన హెచ్చరించారు. ప్రతిపక్ష నేత జగదీష్ శెట్టర్ నేతృత్వంలోని బీజేపీ నేతల బృందం శనివారం మడికేరిలోని రంగసముద్రంలో ఉన్న డీఎస్పీ గణపతి నివాసానికి చేరుకుని గణపతి భార్య పావన, కుమారుడు నిహాల్, తండ్రి కుశాలప్పలతో మాట్లాడారు. ఈ సందర్భంగా గణపతి భార్య పావన తన ఆవేదనను బీజేపీ నేతల బృందానికి వివరించారు. ‘ ఆయన ఎదుర్కొన్న ఒత్తిళ్లు మీడియా ఎదుటే వివరించారు... ఆయన బలవన్మరణానికి పాల్పడినా ఇప్పటి వరకు న్యాయం చేసేందుకు ప్రభుత్వం ముందుకు రాలేదు. న్యాయం జరుగుతుందనే నమ్మకం కూడా లేదు... మాకు న్యాయం లభించకపోతే నేను, నా పిల్లలు నా భర్త నడిచిన దారిలోనే నడిచి ఆత్మహత్య చేసుకుంటాం’అని బీజేపీ బృందానికి తెలిపారు.
దీంతో వారు ఆమెకు ధైర్యం చెప్పారు. పిల్లలు ఉన్న దృష్ట్యా అలాంటి నిర్ణయం తీసుకోవద్దని సూచించారు. అనంతరం ప్రతిపక్ష నేత జగదీష్ శెట్టర్ మాట్లాడుతూ...’డీఎస్పీ గణపతి ఆత్మహత్యకు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రి జార్జ్ రాజీనామా చేసే వరకు అసెంబ్లీలో అహోరాత్రుల్లు ధర్నాను కొనసాగిస్తామని, సోమవారం నుంచి తిరిగి మా ధర్నా ప్రారంభమవుతుందన్నారు. ఐదు రోజులుగా అసెంబ్లీలోనే ఉండి పోరాటం కొనసాగిస్తున్నా ప్రభుత్వం కనీసం స్పందించడం లేదని, జార్జ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. బృందంలో ఆర్.అశోక్, కె.జి.బోపయ్య, అప్పచ్చు రంజన్, సోమణ్ణ తదితరులు ఉన్నారు.