సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాష్ట్రంలోని ప్రైవేట్ బస్సుల్లో మూడు నెలల్లోగా విధిగా అత్యవసర ద్వారాలను అమర్చుకోవాలని ఆపరేటర్లను ప్రభుత్వం శుక్రవారం ఆదేశించింది. బెల్గాంలో శాసన సభ సమావేశాల చివరి రోజు ఎగువ సభలో బీజేపీ సభ్యుడు రఘునాథ రావు మల్కాపురె అడిగిన ప్రశ్నకు రవాణా శాఖ మంత్రి రామలింగా రెడ్డి సమాధానమిస్తూ, టూరిస్టు బస్సుల్లో నిర్ణీత గడువులోగా అత్యవసర ద్వారాలను ఏర్పాటు చేయకపోతే రవాణా పర్మిట్లను ఉపసంహరించుకుంటామని హెచ్చరించారు.
రాష్ట్రంలో గత నెలలో జరిగిన రెండు ఘోర దుర్ఘటనల్లో 58 మంది మరణించారంటూ, దీనికి వోల్వో బస్సుల నిర్మాణంలోనే ఏదో లోపం ఉందని మల్కాపురెతో పాటు ఇతర సభ్యులు సందేహం వ్యక్తం చేశారు. ఈ ప్రమాదాలకు డ్రైవర్ల తప్పిదాలు, వాణిజ్య సరుకులు ప్రధాన కారణాలని మంత్రి చెబుతూ, దీనిపై రాష్ట్ర ప్రభుత్వం దర్యాప్తునకు ఆదేశించిందని చెప్పారు. ఢిల్లీకి చెందిన నేషనల్ ఆటోమేటివ్ టెస్టింగ్ అండ్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టుకు దర్యాప్తు బాధ్యతను అప్పగించామని, త్వరలో నివేదిక అందుతుందని తెలిపారు.
నెల రోజులుగా రవాణా శాఖ క్రమం తప్పకుండా బస్సుల తనిఖీలను నిర్వహిస్తోందని, ప్రయాణికుల వాహనాల్లో వాణిజ్య సరుకులను భర్తీ చేసినందుకు జరిమానాలు విధించిందని వివరించారు. బస్సు బయలుదేరడానికి ముందు భద్రతా మార్గదర్శకాలు, అత్యవసర ద్వారాల గురించి ప్రయాణికులకు వివరించాల్సిందిగా డ్రైవర్లు, కండక్టర్లకు సూచించినట్లు తెలిపారు.
విమానాల్లో మాదిరే ఈ భద్రతా సూచనలు చెప్పే పద్ధతిని పాటించాలని ఆదేశించామన్నారు. ట్రిప్ షీట్లను నిర్వహించాల్సిందిగా ఆపరేటర్లకు సూచించామని, డ్రైవర్ల డ్యూటీ ఎనిమిది గంటలకు మించరాదని, ప్రథమ చికిత్స కిట్, నిప్పునార్పే యంత్రాలు విధిగా బస్సుల్లో ఉండేట్లు చూడాలని ఆదేశించినట్లు స్పష్టం చేశారు.
ప్రైవేట్ బస్సుల్లో అత్యవసర ద్వారాలు
Published Sat, Dec 7 2013 4:08 AM | Last Updated on Sat, Sep 2 2017 1:20 AM
Advertisement
Advertisement