ఉగ్రవాదుల నిధులు అటాచ్ | Enforcement Directorate attaches Rs 55 lakh terror funds of Kashmiri fugitive | Sakshi
Sakshi News home page

ఉగ్రవాదుల నిధులు అటాచ్

Published Thu, Jan 2 2014 11:28 PM | Last Updated on Wed, Sep 5 2018 1:38 PM

Enforcement Directorate attaches Rs 55 lakh terror funds of Kashmiri fugitive

న్యూఢిల్లీ: కాశ్మీరీ వలసవాది నసీర్ సఫీ మీర్ నుంచి స్వాధీనం చేసుకున్న రూ.55 లక్షల మొత్తాన్ని ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్ (ఈడీ) స్తంభింపజేసింది. ఇంత పెద్దమొత్తంలో ఉగ్రవాదుల నిధులను ఈడీ అటాచ్ చేయడం ఇదే ప్రథమం. నకిలీ పాస్‌పోర్టు కేసులో 2006, ఫిబ్రవరిలో మీర్‌ను ఢిల్లీలో పోలీసు లు అరెస్టు చేశారు. అతని నుంచి భారీగా ఆయుధాలు, రెండు కిలోల ఆర్డీఎక్స్, మందుగుండుతోపా టు రూ.55 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (ఉపా), ఆయుధాల చట్టం, పేలుడు పదార్థాల చట్టంలోని వివిధ నిబంధనల కింద మీర్‌పై కేసు నమోదు చేశారు. ఆరోగ్య కారణాలతో 2008లో ఢిల్లీ హైకోర్టు నుంచి మీర్ బెయిల్ పొందాడు. తర్వాత ఢిల్లీ నుంచి అదృశ్యమయ్యాడు.
 ఇదిలాఉండగా ఢిల్లీలోని కన్నాట్ ప్లేస్, టోనీ మార్కెట్‌లో రహస్యంగా పనిచేస్తున్న హవాలా నిర్వాహకుడి నుంచి నల్లధనాన్ని మీర్ తీసుకున్నట్లుగా ఆరోపిస్తూ ఈడీ 2007లో కేసు నమోదు చేసింది. ప్రస్తుతం స్పెషల్ సెల్ ఆధీనంలోనున్న రూ. 55 లక్షల మొత్తాన్ని మనీ లాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ) కింద అటాచ్ చేస్తూ ఈడీ తాజాగా ఆదేశాలు జారీ చేసింది. 
 
 ఎవరీ మీర్...
 జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాదులు, వేర్పాటువాద శక్తులకు నిధులను సమకూర్చడంలో నసీర్ సఫీ మీర్ కీలక పాత్రదారి అనే ఆరోపణలు ఉన్నాయి. 43 ఏళ్ల మీర్ ఉత్తర కాశ్మీర్‌కు చెందినవాడు. 1983లో చదువు మానేసి తివాచీల వ్యాపారం ప్రారంభించాడు. తర్వాత రాజధాని ఢిల్లీకి వచ్చి లజ్‌పత్‌నగర్‌లో కొన్నాళ్లు ఉన్నాడు. అయితే 1990లో ఉగ్రవాదులతో సంబంధాలున్నాయనే ఆరోపణలతో అతని తండ్రిని పోలీసులు అరెస్టు చేసిన తర్వాత దుబాయ్‌కు వలస వెళ్లాడు. దుబాయ్‌లో సొంత ఇల్లు, తివాచీల షోరూమ్ ఉన్న మీర్... మరోవైపు గల్ఫ్‌లో మారకద్రవ్య సరఫరా వ్యవహారాలు సాగించేవాడు. అక్కడి నుంచే భారతీయ పాస్‌పోర్టు(నకిలీ) సంపాదించాడు. అలాగే దక్షిణ ఢిల్లీలోని జమ్మూ కాశ్మీర్ బ్యాంకులో ఎన్నారై ఖాతాను నిర్వహించాడు.హురియత్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు మిర్వాయిజ్ ఉమర్ ఫరూక్‌కు సన్నిహితుడైన మీర్... కేంద్ర దర్యాప్తు సంస్థల విచారణలో నిషేధిత ఉగ్రవాద సంస్థ హిజ్బుల్ ముజాహిద్దీన్, వేర్పాటువాద సంస్థలతో సంబంధం ఉన్నట్లు బయటపెట్టాడు. అయితే మిర్వాయిజ్ గురువారం శ్రీనగర్ నుంచి ఫోన్‌లో పీటీఐ వార్తాసంస్థతో మాట్లాడుతూ... మిర్, అతని కుటుంబం గురించి మాత్రమే తనకు తెలుసునని, అతణ్ని ఎందుకు అరెస్టు చేశారో తెలియదని చెప్పారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement