terror funds
-
ఖతర్నాక్ ఖలీమ్! మానవ బాంబు డాలిన్‌ను సిటీకి తీసుకొచ్చింది ఇతడే..
సాక్షి, సిటీబ్యూరో: నగరంలో గత ఏడాది దసరా ఉత్సవాల నేపథ్యంలో హ్యాండ్ గ్రెనేడ్లతో విధ్వంసాలకు కుట్ర పన్నిన కేసులో హైదరాబాద్ సిట్ పోలీసులు గురువారం అరెస్టు చేసిన మహ్మద్ అబ్దుల్ ఖలీమ్ సామాన్యుడు కాదని అధికారులు చెబుతున్నారు. లష్కరేతోయిబా (ఎల్ఈటీ) ఉగ్రవాదులు అబ్దుల్ జాహెద్, మహ్మద్ సమీయుద్దీన్, మాజ్ హసన్ ఫారూఖ్‌లకు సంబంధించిన కేసులోనే సిట్ ఇతడినీ కటకటాల్లోకి పంపింది. తదుపరి విచారణ నిమిత్తం ఖలీమ్‌ను తమ కస్టడీలోకి తీసుకోవాలని పోలీసులు నిర్ణయించారు. బిలాల్ ద్వారానే ఉగ్రబాట... ఎల్బీనగర్ సమీపంలోని ఎన్టీఆర్ నగర్‌కు చెందిన ఖలీమ్ అక్కడే వెల్డింగ్ దుకాణం నిర్వహిస్తుంటాడు. ముసరాంబాగ్ ప్రాంతానికి చెందిన, పాకిస్థాన్‌లోని కరాచీలో ఎన్కౌంటర్ అయిన ఎల్ఈటీ ఉగ్రవాది షాహెద్ అలియాస్ బిలాల్ ద్వారా ఉగ్రవాద బాట పట్టాడు. 2004లో నగరం నుంచి పారిపోయి సౌదీ అరేబియాలో తలదాచుకున్న బిలాల్ ఆదేశాల మేరకు 2005లో అతడి సోదరుడు జాహెద్‌తో కలిసి పని చేయడానికి అంగీకరించాడు. అప్పట్లో ఈ లష్కరేతోయిబా ఉగ్రవాదులు గ్రీన్‌ల్యాండ్స్‌లో ఉండే హైదరాబాద్ పోలీసు కమిషనర్, టాస్‌్కఫోర్స్ కార్యాలయాన్ని టార్గెట్ చేశారు. వరుసగా ఉగ్రవాదులను అరెస్టు చేస్తుండటంతో పోలీసులను నైతికంగా దెబ్బతీయడానికే దీన్ని ఎంచుకున్నారు. ఈ కుట్ర మొత్తం సౌదీ నుంచి బిలాల్ అమలుపరిచాడు. అప్పటి నుంచి జాహెద్‌తో కలిసే.. దసరా రోజు కావడంతో పెను ముప్పు తప్పగా ఓ హోంగార్డు మాత్రం అమరుడయ్యాడు. ఈ కేసులో అదే ఏడాది అక్టోబర్ 18న అరెస్టైన ఖలీమ్ 2017 వరకు జాహెద్‌తో కలిసి జైల్లోనే ఉన్నాడు. టాస్క్‌ఫోర్స్ కార్యాలయంపై మానవబాంబు దాడి కేసు వీగిపోవడంతో విడుదలయ్యాడు. అప్పటి నుంచి జాహెద్‌తో సన్నిహితంగానే ఉంటున్నాడు. ‘దసరా విధ్వంసాల’ కోసం పాకిస్థాన్‌లో ఉన్న ఫర్హాతుల్లా ఘోరీ జాహెద్‌కు మొత్తం రూ.40 లక్షల వరకు పంపాడు. ఈ మొత్తం వివిధ హవాలా ఆపరేటర్లతో పాటు ఖలీమ్ ద్వారానూ ఇతడికి అందింది. రూ.10 లక్షలు అందించిన ఖలీమ్ నగరంలో రెక్కీ చేయడానికి సహకరించాడు. దసరా ఉత్సవాలు జరిగే మైదానాలే వీరి టార్గెట్‌లో ఉన్నాయి. ఖలీమ్‌ను సిట్ పోలీసులు టాస్‌్కఫోర్స్ అధికారుల సాయంతో గురువారం చంద్రాయణగుట్టలోని అతడి అత్తగారింటి వద్ద అరెస్టు చేశారు. ఆ సమయంలో అతడి బంధువులు, కుటుంబీకులు పోలీసులకు అడ్డుకోవడానికి ప్రయత్నించారు. జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించిన అధికారులు తదుపరి విచారణ నిమిత్తం తమ కస్టడీకి కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసు ఇప్పటికే ఎన్ఐఏకు బదిలీ కావడంతో ఖలీమ్ విచారణ తర్వాత పూర్తి స్థాయిలో ఆ విభాగానికి అప్పగించనున్నారు. ఆ ఆపరేషన్‌లోనూ కీలకపాత్ర.. శ్రీలంకకు చెందిన ఎల్టీటీఈకి, కాశ్మీర్‌లోని ఉగ్రవాద సంస్థలకు మాత్రమే పరిమితమైన మానవ బాంబు విధానాన్ని టాస్క్‌ఫోర్స్ కార్యాలయంపై వాడాలని ఈ ఉగ్రవాదులు నిర్ణయించుకున్నారు. బంగ్లాదేశ్‌లోని ఢాకాకు చెందిన మౌథసిమ్ బిల్హా అలియాస్ డాలిన్‌ను మానవ బాంబుగా మార్చారు. ఇతడిని తీసుకురావడానికి అప్పట్లో ఖలీమ్ సరిహద్దులు దాటి అక్రమంగా బంగ్లాదేశ్ వెళ్లడంతో పాటు కొన్నాళ్లు ఉగ్రవాద శిక్షణ తీసుకున్నాడు. డాలిన్‌ను తీసుకుని నగరానికి చేరుకుని ఎన్టీఆర్ నగర్‌లోని తన ఇంట్లోనే అతడికి ఆశ్రయం ఇవ్వడం, టాస్క్‌ఫోర్స్ ఆఫీస్ వద్ద రెక్కీ చేయించడంలో కీలక పాత్ర పోషించాడు. నాటి బాంబు కూడా ఖలీమ్ ఇంట్లోనే తయారైంది. తనను తాను పేల్చుకోవడానికి సిద్ధమైన డాలిన్‌ను 2005 అక్టోబర్ 12 (దసరా రోజు) టాస్క్‌ఫోర్స్ కార్యాలయం వద్దకు తీసుకువెళ్లి వదిలాడు. చదవండి: అపరిచితులు ఆహారం పెట్టినా ముట్టవు.. చిటికెలో జాడ పట్టేయగలవు.. -
హైదరాబాద్ పేలుళ్ల కుట్రకోణంలో కొత్త మలుపు
సాక్షి, హైదరాబాద్: హ్యాండ్ గ్రెనేడ్లతో దసరా వేడుకల్లో హైదరాబాద్‌లో భారీ విధ్వంసాన్ని సృష్టించాలని పథకం వేసి నగర పోలీసులకు చిక్కిన ముగ్గురు ఉగ్రవాదులకు గతంలో నగదు సమకూర్చిన ఫైనాన్షియర్ తాజాగా పోలీసులకు పట్టుబడ్డాడు. హవాలా రూపంలో వచ్చిన ఈ నగదు సరఫరాలో కీలక పాత్ర పోషించిన ఆపరేటర్ల కోసం సిట్ ముమ్మరంగా దర్యాప్తు చేసింది. ఈ నగదు సమకూర్చిన వారిలో కీలక నిందితుడు, పాతబస్తీకి చెందిన హవాలా ఆపరేటర్ మహ్మద్ అబ్దుల్ ఖలీమ్‌ను సీసీఎస్ నేతృత్వంలోని సిట్ గురువారం అరెస్ట్ చేసింది. ఉగ్ర కుట్ర అమలుకు రూ.40లక్షలు గత ఏడాది దసరా ఉత్సవాల సందర్భంగా బాంబులు పేల్చి భారీ ప్రాణనష్టం కల్పించి, తద్వారా హైదరాబాద్‌లో మతకలహాలు సృష్టించి అశాంతిని రేకిత్తించేందుకు భారీ కుట్ర జరిగింది. ఈ కేసులో గత ఏడాది అక్టోబర్ 2వ తేదీన హైదరాబాద్ పోలీసులు లష్కరే తోయిబా ఉగ్రవాదులైన అబ్దుల్ జాహెద్, మహ్మద్ సమీయుద్దీన్, మాజ్ హసన్ ఫారూఖ్‌లను అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి నాలుగు హ్యాండ్ గ్రెనేడ్లను స్వా«దీనం చేసుకున్నారు. చైనాలో తయారైన హ్యాండ్ గ్రెనేడ్లు జమ్మూ కశీ్మర్ సరిహద్దుల ద్వారా మన దేశంలోకి వచ్చాయి. పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాదులు ఫర్హతుల్లా ఘోరీ, సిద్దిఖ్ బిన్ ఉస్మాన్, అబ్దుల్ మాజిద్‌లు ఇచ్చిన ఆదేశాలతో ఆ ముగ్గురూ ఉగ్రకుట్ర ప్రణాళికలు సిద్ధం చేశారు. అయితే ఉగ్రకుట్రను విజయంతం చేయడానికి కావాల్సిన ఆర్థిక సహాయం హైదరాబాద్‌లో ఉన్న నిందితులకు హవాలా ద్వారా అందింది. హవాలా మార్గంలో రూ.40 లక్షలు ఇచ్చేందుకు పాతబస్తీకి చెందిన మహ్మద్ అబ్దుల్ ఖలీమ్ సహకరించినట్లు తేలడంతో తాజాగా సిట్ అరెస్ట్ చేసింది. అరెస్టయి జైల్లో ఉన్న ముగ్గురు ఉగ్రవాదులకు సహకరించిన మరో 8 మందిని కూడా పోలీసులు మొదట్లోనే విచారించారు. అందులో కొందరు తెలిసి, మరికొందరు తెలియకుండా వారికి సహకరించినట్లు పోలీసులు ఆధారాలు సేకరించారు. ఉగ్రవాదులకు సాయం చేసిన వారిపై సిట్ కన్ను దర్యాప్తులో ఉగ్రవాదులకు సహాయ సహకారాలు అందించిన వారిపై ఇప్పుడు సిట్ దృష్టి పెట్టింది. ఇందులో భాగంగానే హవాల మార్గంలో డబ్బు పంపించాలని ఎవరు ఆదేశించారు, డబ్బు ఎవరు ఇచ్చారు, ఎన్నిసార్లు ఆ డబ్బును ఖలీమ్ సమకూర్చాడు అనే విషయాలపై ఇప్పుడు సిట్ దృష్టి పెట్టింది. ఇదిలాఉండగా వచ్చిన డబ్బుతో ముగ్గురు ఉగ్రవాదులు రెండు ఇన్ఫీల్డ్ బైక్‌లు కొనడంతో పాటు ఒక కారును కూడా కొన్నారు. హైదరాబాద్‌లో దసరా వేడుకలలో నరమేధం సృష్టించేందుకు బైక్‌లు, కార్లలో వెళ్లి గ్రెనేడ్లను పేల్చాలని ఉగ్రవాదులు ప్లాన్ చేశారు. పోలీసుల నిఘాలో ఈ కుట్ర బయటపడడంతో ముగ్గురు ఉగ్రవాదులను పోలీసులు అరెస్ట్ చేశారు, ఈ నేపధ్యంలో అరెస్టైయిన ఉగ్రవాదులకు ఖలీమ్‌తో ఎన్నాళ్లుగా సంబంధాలున్నాయనే విషయంలో లోతైన దర్యాప్తు జరిపేందుకు నిందితుడిని కస్టడీలోకి తీసుకోనున్నారు. కాగా ఈ ఘటనపై ఎన్ఐఏ కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన విషయం తెలిసిందే. చదవండి: ఢిల్లీ లిక్కర్ స్కాం నిందితులకు బెయిల్ నిరాకరణ -
FATF: పాక్‌కు ఊరటపై భారత్ స్పందన
ఉగ్రవాద ఆర్థిక కార్యకలాపాల వ్యతిరేక గ్లోబల్ విభాగం ఫాట్ఫ్(FATF.. ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్) తన ‘గ్రే లిస్ట్’ నుంచి పాకిస్థాన్‌ను తొలగించింది. ఫ్రాన్స్ పారిస్‌లో జరిగిన రెండు రోజుల సమావేశం అనంతరం.. ఫాఫ్ట్ అధ్యక్షుడు రాజ కుమార్ ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. అయితే నాలుగేళ్ల తర్వాత పాక్‌కు దక్కిన ఊరట పరిణామంపై పొరుగు దేశం భారత్ స్పందించింది. మనీల్యాండరింగ్ అంశంలో ఆసియా ఫసిఫిక్ గ్రూప్‌నకు పాక్ సహకారం కొనసాగిస్తుందని ఆశిస్తున్నట్లు భారత్ పేర్కొంది. అంతేకాదు.. ఫాట్ఫ్ పరిశీలన ఫలితంతో.. 26/11 ముంబై దాడుల్లో పాల్గొన్న ఉగ్రవాదులతో పాటు మరికొందరిపై పాక్ కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు భారత విదేశాంగ ప్రతినిధి అరిందమ్ బాగ్చీ ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రపంచ ప్రయోజనాల దృష్ట్యా.. పాక్ తన ఆధీనంలో ఉన్న భూభాగంలో ఉగ్రవాదం, ఉగ్రవాద ఆర్థిక కార్యాకలాపాలకు వ్యతిరేకరంగా నమ్మకమైన, నిరంతర చర్యలను కొనసాగించాలని.. ఈ విషయాన్ని ప్రపంచానికి స్పష్టంగా తెలియజేయాలని ఆయన ప్రకటనలో కోరారు. ► ఇక.. జూన్ 2018 మరియు జూన్ 2021లో FATF గుర్తించిన వ్యూహాత్మక లోపాలకు సంబంధించి పాక్ ఇచ్చిన వివరణ పట్ల ఫాట్ఫ్ సంతృప్తి వ్యక్తం చేసింది. కార్యాచరణ ప్రణాళికల కట్టుబాట్లను నెరవేర్చడానికి సాంకేతిక లోపాలను కారణంగా చూపించింది పాక్. ఈ కారణంతో.. పాక్‌కు ఊరట ఇస్తూ ఫాట్ఫ్ నిర్ణయం తీసుకుంది. ► FATF బ్లాక్‌లిస్ట్‌లో ఒక దేశం చేరిందంటే.. ఆ దేశం మనీల్యాండరింగ్, టెర్రరిస్ట్ ఫైనాన్సింగ్‌లో ప్రపంచ పోరాటానికి సహకారం అందించడం లేదనే అర్థమన్నమాట. ► ఒకవేళ ఫాట్ఫ్ బ్లాక్ లిస్ట్‌లో ఏదైనా దేశానికి స్థానం దక్కితే.. ఆ దేశానికి ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంకు, ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్, యూరోపియన్ యూనియన్ నుంచి సహకారం అందడం తగ్గిపోతుంది. ► FATF(Financial Action Task Force)లో సభ్య దేశాలు 39. అమెరికా, యూకేతో పాటు భారత్ కూడా కూడా సభ్య దేశంగా ఉంది. ► పాకిస్తాన్‌ను ఫాట్ఫ్ గ్రే లిస్ట్ నుంచి తొలగించడంపై.. అమెరికా హర్షం వ్యక్తం చేసింది. ఇదీ చదవండి: ఉక్రెయిన్‌తో యుద్ధంలో మరణించిన రష్యా సైనికుల సంఖ్య అంతా? -
నాలుగేళ్ల తర్వాత పాకిస్తాన్‌కు బిగ్ రిలీఫ్.. 'గ్రే లిస్ట్' నుంచి తొలగింపు
పారిస్: పాకిస్తాన్‌కు భారీ ఊరట లభించింది. ఉగ్రవాదుల ఆర్థిక విషయాలపై నిఘా వహించే ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్(ఎఫ్ఏటీఎఫ్).. ఆ దేశాన్ని నాలుగేళ్ల తర్వాత 'గ్రే లిస్ట్' నుంచి తొలగించింది. ఉగ్రవాదుల కార్యకలాపాల విషయంలో పాక్ పురోగతి సాధించిందని, తీవ్రవాద సంస్థలకు నిధుల చేరవేతలో దిగొచ్చిందని ఈమేరకు నిర్ణయం తీసుకుంది. పారిస్‌లో శుక్రవారం జరిగిన సమావేశం అనంతరం ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన విడుదల చేసింది. అయితే అనూహ్యంగా మరో ఆసియా దేశం మయన్మార్‌ను బ్లాక్ లిస్టులో చేర్చింది ఎఫ్ఏటీఎఫ్. డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, టాంజానియా, మొజాంబిక్ దేశాలను కొత్తగా గ్రే లిస్టులో చేర్చింది. పాకిస్తాన్, నికరాగ్వా దేశాలను ఈ జాబితా నుంచి తొలగించింది. ఉగ్రవాద సంస్థలకు నిధుల మళ్లించడమే గాక, తీవ్రవాదుల పట్ల సానుభూతిగా ఉండే పాకిస్థాన్‌ను వరుసగా నాలుగేళ్ల పాటు గ్రే లిస్టలో ఉంచింది ఎఫ్ఏటీఎఫ్. తాము తీవ్రవాదులపై ఉక్కుపాదం మోపుతున్నామని, అనేక మంది టెర్రరిస్టులను అరెస్టు చేస్తున్నామని పాకిస్తాన్ కొద్ది సంవత్సరాలుగా చెబుతున్నా ఎఫ్ఐటీఎఫ్ దాన్ని సమర్థించలేదు. ఎట్టకేలకు నాలుగేళ్ల తర్వాత ఉగ్రవాద సంబంధిత కార్యకలాపాలు తగ్గినందున ఆ దేశానికి ఊరటనిచ్చింది. చదవండి: ఉక్రెయిన్‌తో యుద్ధంలో 66,000 మంది రష్యా సైనికులు మృతి! -
గ్రే లిస్టులోనే పాకిస్తాన్
న్యూఢిల్లీ: లష్కరే తోయిబా, జైషే మహమ్మద్ వంటి ఉగ్రవాద సంస్థలకు నిధుల ప్రవాహాన్ని అడ్డుకోని పాకిస్థాన్‌ను పలు ఆంక్షలు విధించేందుకు వీలు కల్పించే గ్రే లిస్ట్‌లోనే కొనసాగిస్తున్నట్లు అంతర్జాతీయ సంస్థ ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్‌ఫోర్స్ (ఎఫ్ఏటీఎఫ్) శుక్రవారం ప్రకటించింది. ఈ ఏడాది జూన్‌లోపు ఎఫ్ఏటీఎఫ్ ఆదేశాలను అమలు చేయకపోతే వాణిజ్యపరమైన పరిణామాలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని పాక్‌ను హెచ్చరించింది. భారత్‌లో పలు ఉగ్రదాడులకు కారణమైన సంస్థలకు నిధులు అందకుండా చేసేందుకు 27 చర్యలు చేపట్టాలని ఆదేశించినా పాకిస్థాన్ వాటిల్లో కొన్నింటిని మాత్రమే అమలు చేసిందని గుర్తు చేసింది. పాకిస్థాన్ గ్రే లిస్టులో కొనసాగితే ఈయూ, ఐఎంఎఫ్, ప్రపంచబ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు వంటి అంతర్జాతీయ సంస్థల నుంచి ఆర్థిక సాయం అందడం కష్టమవుతుంది. ఎఫ్ఏటీఎఫ్ నిర్ణయం ఇప్పటికే అధ్వాన్న స్థితిలో ఉన్న పాక్ ఆర్థిక పరిస్థితిని మరింత దిగజారుస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఉగ్రవాద సంస్థలకు పాకిస్థాన్ దన్నుగా నిలుస్తోందని, దానిపై చర్యలు చేపట్టాలని భారత్ ఎఫ్ఏటీఎఫ్కు ఫిర్యాదు చేయడంతోపాటు సంబంధించిన రుజువులూ అందిస్తూ వచ్చింది. -
ఉగ్రవాద నిధుల కేసులో ఎన్ఐఏ దాడులు
న్యూఢిల్లీ: క్రాస్ లైన్ ఆఫ్ కంట్రోల్ (ఎల్ఓసి) సరిహద్దుల్లో వాణిజ్య వ్యాపారులపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) మంగళవారం దాడులు చేసింది. పుల్వామా, శ్రీనగర్ జిల్లాల్లో ఎన్ఐఏ అధికారులు ఈ దాడులు నిర్వహించారు. కెల్లర్ ప్రాంతంలోని వ్యాపారి గులాం అహ్మద్ వానీ ఇంటిపై ఎన్ఐఏ అధికారులు, జమ్మూ కాశ్మీర్ పోలీసుల సంయుక్త బృందం కలసి దాడులు చేసినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. పుల్వామాలో సీఆర్పీఎఫ్ సిబ్బందిపై 2019 ఫిబ్రవరి 14 న ఉగ్రదాడి జరగక ముందే అహ్మద్ వానీ క్రాస్ ఎల్ఓసి వాణిజ్యంలో పాల్గొన్నట్లు ఎన్ఐఏ పేర్కొంది. ఉగ్రవాదలకు అందుతున్న నిధులపై ఎన్ఓఏ ప్రారంభించిన దర్యాప్తులో భాగంగా ఈ దాడులు జరిగాయి. ఈ కేసుకు సంబంధించి ఇప్పటివరకు ప్రసిద్ధ కాశ్మీరీ వ్యాపారవేత్త జహూర్ వతాలీ, షబ్బీర్ షా, ఆసియా ఆండ్రాబీ, మసారత్ ఆలం సహా కీలకమైన వేర్పాటువాద నాయకులను ఎన్ఐఏ ఇప్పటికే అరెస్టు చేసింది. కాశ్మీర్లో ఉగ్రవాద కార్యకలాపాలను ప్రోత్సహించడానికి పాకిస్తాన్ నుంచి నిధులు అందుకున్నారన్న ఆరోపణలపై వతాలీని 2017లో ఎన్ఐఏ అరెస్టు చేసింది. అతడిని వేర్పాటువాద నాయకుడు సయ్యద్ అలీ షా గీలానీకి సన్నిహితుడిగా పేర్కొంటారు. ఎన్ఐఏ దర్యాప్తులో వతాలీకి కోట్ల రూపాయల విలువైన ఆస్తులు ఉన్నట్లు తేలింది. బ్రిటన్, దుబాయ్‌లలో వతాలీకి అనేక ఆస్తులు ఉన్నట్లు గుర్తించారు. ఉగ్రవాద నిధుల కేసుకు సంబంధించి అరెస్టయిన వేర్పాటువాదులందరూ ప్రస్తుతం ఢిల్లీ తీహార్ జైలులో ఉన్నారు. జమ్మూ కాశ్మీర్లో నిరసన కార్యక్రమాలు నిర్వహించడానికి విదేశాల నుంచి నిధులు, విరాళాలు సేకరిస్తున్నట్లు దుఖ్తరన్-ఎ-మిల్లతాద్ సంస్థ చీఫ్ ఆసియా ఆండ్రాబీ, మసారత్ ఆలం విచారణలో అంగీకరించినట్లు ఎన్ఐఏ పేర్కొంది. -
12 మంది మృతి.. అట్టుడుకుతున్న ఇరాన్
టెహ్రాన్ : ఇరాన్లో ప్రభుత్వ వ్యతిరేక ప్రదర్శనలు ఒక్కసారిగా హింసాత్మకంగా మారాయి. ప్రభుత్వం తక్షణమే దిగిపోవాలంటూ ఆందోళనకారులు రోడ్డెక్కగా.. శాంతి భద్రతలు పూర్తిగా అదుపు తప్పటంతో పోలీసులు కాల్పులకు దిగారు. గత రెండు రోజుల్లో చోటు చేసుకున్న వేర్వేరు ఘటనల్లో 12 మంది పౌరులు మృత్యువాత పడినట్లు తెలుస్తోంది. ఇజే పట్టణంలో శనివారం పోలీస్ కాల్పుల్లో ఇద్దరు చనిపోయినట్లు ఎంపీ హదయాతుల్లా ఖదెమి వెల్లడించారు. కాగా, 2009 తర్వాత మళ్లీ ఇప్పుడు ఇరాన్లో పెద్ద ఎత్తున్న అల్లర్లు చెలరేగుతున్నాయి. ఆర్థిక వ్యవస్థను దిగజారుస్తూ ఉగ్రవాద సంస్థలకు నిధులు సమకూరుస్తుందంటూ ప్రభుత్వంపై ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రతిపక్షాలు.. ప్రభుత్వం గద్దెదిగి పోవాలంటూ నిరసన ప్రదర్శనలకు పిలుపునివ్వగా.. సోషల్‌మీడియాలో అది విపరీతంగా చక్కర్లు కొట్టింది. దీంతో నిరసనలకు ప్రజల నుంచి పెద్ద ఎత్తున్న స్పందన వస్తోంది. ఆదివారం రాత్రి ఉన్నతాధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించిన ఇరాన్ అధ్యక్షుడు హస్సన్ రౌహానీ ఆపై మీడియాతో మాట్లాడారు. నిరసనలు తెలపటం తప్పు కాదని.. అలాగని శాంతి భద్రతలకు భంగం కలిగించటం, ప్రభుత్వ- ప్రజా ఆస్తులను ధ్వంసం చేస్తే మాత్రం చూస్తూ సహించే ప్రసక్తే లేదని రౌహానీ ఆందోళనకారులను హెచ్చరించాడు. అమెరికా హెచ్చరిక ఇక ఇరాన్ లో నెలకొన్న ప్రతిష్టంభనపై అమెరికా స్పందించింది. పరిణామాలు చక్కబెట్టుకోకపోతే అంతర్జాతీయ సమాజం తరపున తాము రంగంలోకి దిగాల్సి ఉంటుందని యూఎస్ రక్షణ శాఖ ఓ ప్రకటనలో హెచ్చరించింది. ఇక ఆందోళనకారులకు మద్దతుగా ట్రంప్ కూడా ఈమేరకు ట్వీట్ కూడా చేశారు. ప్రపంచం మిమిల్ని గమనిస్తోంది.. ప్రజలకు శాంతియుతంగా నిరసనలు తెలిపే హక్కు ఉంటుందని పేర్కొన్నారు. Many reports of peaceful protests by Iranian citizens fed up with regime’s corruption & its squandering of the nation’s wealth to fund terrorism abroad. Iranian govt should respect their people’s rights, including right to express themselves. The world is watching! #IranProtests — Donald J. Trump (@realDonaldTrump) 30 December 2017 -
మోస్ట్ వాంటెడ్‌కు గట్టి షాక్
సాక్షి, న్యూఢిల్లీ : హిజ్బుల్ ముజాహిద్దీన్ చీఫ్, మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది సయ్యద్ సలావుద్దీన్‌కు ఊహించని షాక్. అతని కొడుకు షాహిద్ యూసఫ్‌ను జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) మంగళవారం అరెస్ట్ చేసింది. ఉగ్రవాదులకు నిధులు చేరవేసిన కేసులో అతనిని అదుపులోకి తీసుకున్నట్లు ప్రకటించింది. జమ్ము కశ్మీర్ లో ఉద్యోగిగా పని చేస్తున్న యూసఫ్‌కు సౌదీ అరేబియా హిబ్జుల్ ముజాహీద్దిన్ సభ్యుడు ఐజా అహ్మద్ భట్ నుంచి డబ్బు సమకూరిందనే ఆరోపణలు వెలువెత్తాయి. దీని వెనుక సలావుద్దీన్ ప్రధాన కుట్రదారుడిగా ఉన్నాడు. ఇక ఈ డబ్బును యూసఫ్.. 2011 నుంచి 2014 వరకూ కాశ్మీర్ లోయలో ఉగ్రవాద కార్యకలాపాలకు వినియోగించారని విచారణలో తేలింది. బలమైన సాక్ష్యాలు సేకరించాకే అతన్ని అదుపులోకి తీసుకున్నట్లు దర్యాప్తు సంస్థ వెల్లడించింది. కాగా, 2011లో ఈ కేసులో ఎన్ఐఏ రెండు ఛార్జీషీట్లను నమోదు చేసింది. మొత్తం ఆరుగురు నిందితులలో ఇప్పటివరకు ఇద్దరిని అరెస్ట్ చేయగా.. మొహమ్మద్ మక్బూల్ పండిట్, అజీజ్ అహ్మద్ భట్ లు సహా మిగతా వారు పాకిస్థాన్, పీవోకే లో తలదాచుకున్నారు. జమ్ము కశ్మీర్లో శాంతి చర్చలను ప్రారంభించేందుకు ప్రత్యేక ప్రతినిధులతో కూడిన బృందాన్ని ఏర్పాటు చేస్తామని కేంద్రం వెల్లడించిన మరుసటి రోజే.. ఈ అరెస్ట్ చోటు చేసుకోవటం గమనార్హం. పాక్ కేంద్రంగా హిజ్బుల్ ముజాహిద్దీన్ను నడిపిస్తూ.. రాజకీయ ఆరంగ్రేటం కోసం యత్నిస్తున్న సలావుద్దీన్కి కొడుకు అరెస్ట్ పెద్ద ఎదురుదెబ్బేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
ఉగ్రవాదులకు కాంగ్రెస్ వంతపాడుతోంది
-
ఉగ్రవాదులకు కాంగ్రెస్ వంతపాడుతోంది: జైట్లీ
రాబోయే కొన్ని రోజుల్లో.. ప్రపంచంలోనే అతిపెద్ద నోట్ల మార్పిడి వ్యవహారం పూర్తవుతుందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలంటూ ప్రతిపక్షాలు ఇచ్చిన అల్టిమేటంను ఆయన కొట్టిపారేశారు. ఉగ్రవాదులకు కాంగ్రెస్ పార్టీ వంతపాడుతోందని మండిపడ్డారు. గత కొన్ని రోజుల్లో తమకు వినియోగదారుల నుంచి కొన్ని ఫిర్యాదులు వచ్చాయని.. క్యూలో నిలబడినా నోట్లు అందడం లేదని చెప్పడం వల్లే నగదు మార్పిడి పరిమితి తగ్గించామని ఆయన చెప్పారు. ఏటీఎంలను యుద్ధప్రాతిపదికన రీకాలిబరేట్ చేస్తున్నామన్నారు. బ్యాంకు ఉద్యోగులు నిర్విరామంగా పనిచేస్తున్నారని, అందుకు వారిని అభినందించాల్సిందేనని, వాళ్లు గత ఏడు రోజుల్లో కోట్లాది రూపాయలు తమ చేతులతో మార్చారని జైట్లీ తెలిపారు. వారం రోజుల్లోనే బ్యాంకులలో రద్దీ తగ్గినందున ఇప్పుడు ఇక డబ్బులు దొరకవేమోనని ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. కొంతమందికి మాత్రం అసౌకర్యం కలుగుతున్నందుకు చింతిస్తున్నామన్నారు. భారత ఆర్థిక వ్యవస్థను ఇది ముందుకు తీసుకెళ్తుంది కాబట్టి ప్రతి రాజకీయ పార్టీ కూడా ఈ విషయంలో తమకు మద్దతు పలుకుతుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. పౌరులందరూ ఈ చర్యకు మద్దతు పలకాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నానని, కొంతమంది అనవసరంగా గందరగోళం సృష్టిస్తున్నారని విమర్శించారు. చాలామంది ముఖ్యమంత్రులు తమ నిర్ణయానికి మద్దతు తెలిపారని, వారిని అభినందిస్తున్నానని, కొంతమంది సీఎంలు మాత్రం లేనిపోని వివాదాలతో ప్రజల్లో భయోత్పాతం సృష్టిస్తున్నారని పరోక్షంగా అరవింద్ కేజ్రీవాల్, మమతా బెనర్జీలపై మండిపడ్డారు. ప్రతిపక్షం చర్చ నుంచి పారిపోతోందని... నల్లధనాన్ని, ఉగ్రవాదులకు డబ్బులు అందే ప్రక్రియను అడ్డుకుంటే కాంగ్రెస్ పార్టీ ఎందుకు వ్యతిరేకిస్తోందని ప్రశ్నించారు. ఈ విషయంలో వాళ్లకు స్వార్థ ప్రయోజనాలున్నాయని మండిపడ్డారు. జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్.. తమ చర్యకు మద్దతు పలకాల్సింది పోయి విమర్శించడంతో పాటు దీన్ని పాక్ ఉగ్రవాదంతో పోల్చడం బాధ్యతారాహిత్యమని విమర్శించారు. రాజ్యసభకు ప్రధానమంత్రే వచ్చి సమాధానం ఇవ్వాలనడం సరికాదని, చర్చకు ఎవరు సమాధానం చెప్పాలో నిర్ణయించుకునే హక్కు ప్రభుత్వానికి ఉంటుందని స్పష్టం చేశారు. -
ఉగ్రవాదులకు నిధులు అందకుండా ఆంక్షలు
న్యూఢిల్లీ: ఉగ్రవాదులకు నిధులు అక్రమంగా చేరకుండా లక్షిత ఆర్థిక ఆంక్షలు అమలు చేయటం అత్యవసరమని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. టైస్టులకు అందిన ఆర్థిక సహకారం, అక్రమ సొమ్ము వల్ల ప్రపంచానికి జరుగుతున్న నష్టానికి పారిస్ మారణహోమం ఓ నిదర్శనమని పేర్కొన్నారు. ఉగ్రవాదులకు వాహనాల దొంగతనం మొదలుకుని తీవ్రమైన క్రిమినల్ నేరాల ద్వారా నిధులు అందుతున్నాయన్నారు. ఉగ్రవాద సంస్థలకు నిధులు అందించే ఆర్థిక మూలాలను నియంత్రిస్తే వారి దాడులకు అడ్డుకట్ట వేసినట్లేనన్నారు. బుధవారమిక్కడ 6వ గ్లోబల్ ఫోకల్ పాయింట్ కాన్ఫరెన్స్, సీబీఐ, స్టేట్ యాంటీ కరప్షన్, విజిలెన్స్ బ్యూరో 21వ కాన్ఫరెన్స్‌లో మోదీ ప్రసంగించారు. బహుళత్వమే మా బలం: మోదీ బహుళత్వం సహా భారత్‌కు అద్భుతమైన సామాజిక సామర్ధ్యాలు అనేకం ఉన్నాయని ప్రధాని నరేంద్రమోదీ పేర్కొన్నారు. ఎన్డీయే పాలనలో దేశంలో నెలకొన్న అసహనంపై పెద్ద ఎత్తున విమర్శలు చెలరేగుతున్న నేపథ్యంలో.. ఈ అంశంపై మోదీ మరోసారి స్పందించారు. గతవారం లండన్‌లోని వెంబ్లీ స్టేడియంలో మాట్లాడుతూ.. భారత దేశ బలం వైవిధ్యత, బహుళత్వమేనని, అదే భారత్ ప్రత్యేకత అని తేల్చిచెప్పిన విషయం తెలిసిందే. తాజాగా ప్రఖ్యాత ‘ఎకనమిస్ట్’ పత్రికలో రాసిన వ్యాసంలో అదే అంశాన్ని ఆయన మరోసారి స్పష్టం చేశారు. మోదీ వ్యాసంలోని కొన్ని ముఖ్యాంశాలను ఆ పత్రిక విలేకరి బుధవారం ట్వీట్ చేశారు. నా ప్రమాణానికి రండి: నితీశ్ పట్నా: ఈ నెల 20న బిహార్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయనున్న నితీశ్ కుమార్, ఆ కార్యక్రమానికి రావాలని ప్రధాని మోదీని ఫోన్ చేసి ఆహ్వానించారు. -
ఉగ్రవాదుల నిధులు అటాచ్
న్యూఢిల్లీ: కాశ్మీరీ వలసవాది నసీర్ సఫీ మీర్ నుంచి స్వాధీనం చేసుకున్న రూ.55 లక్షల మొత్తాన్ని ఎన్ఫోర్స్మెంట్ డెరైక్టరేట్ (ఈడీ) స్తంభింపజేసింది. ఇంత పెద్దమొత్తంలో ఉగ్రవాదుల నిధులను ఈడీ అటాచ్ చేయడం ఇదే ప్రథమం. నకిలీ పాస్‌పోర్టు కేసులో 2006, ఫిబ్రవరిలో మీర్‌ను ఢిల్లీలో పోలీసు లు అరెస్టు చేశారు. అతని నుంచి భారీగా ఆయుధాలు, రెండు కిలోల ఆర్డీఎక్స్, మందుగుండుతోపా టు రూ.55 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (ఉపా), ఆయుధాల చట్టం, పేలుడు పదార్థాల చట్టంలోని వివిధ నిబంధనల కింద మీర్‌పై కేసు నమోదు చేశారు. ఆరోగ్య కారణాలతో 2008లో ఢిల్లీ హైకోర్టు నుంచి మీర్ బెయిల్ పొందాడు. తర్వాత ఢిల్లీ నుంచి అదృశ్యమయ్యాడు. ఇదిలాఉండగా ఢిల్లీలోని కన్నాట్ ప్లేస్, టోనీ మార్కెట్లో రహస్యంగా పనిచేస్తున్న హవాలా నిర్వాహకుడి నుంచి నల్లధనాన్ని మీర్ తీసుకున్నట్లుగా ఆరోపిస్తూ ఈడీ 2007లో కేసు నమోదు చేసింది. ప్రస్తుతం స్పెషల్ సెల్ ఆధీనంలోనున్న రూ. 55 లక్షల మొత్తాన్ని మనీ లాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) కింద అటాచ్ చేస్తూ ఈడీ తాజాగా ఆదేశాలు జారీ చేసింది. ఎవరీ మీర్... జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదులు, వేర్పాటువాద శక్తులకు నిధులను సమకూర్చడంలో నసీర్ సఫీ మీర్ కీలక పాత్రదారి అనే ఆరోపణలు ఉన్నాయి. 43 ఏళ్ల మీర్ ఉత్తర కాశ్మీర్‌కు చెందినవాడు. 1983లో చదువు మానేసి తివాచీల వ్యాపారం ప్రారంభించాడు. తర్వాత రాజధాని ఢిల్లీకి వచ్చి లజ్‌పత్‌నగర్‌లో కొన్నాళ్లు ఉన్నాడు. అయితే 1990లో ఉగ్రవాదులతో సంబంధాలున్నాయనే ఆరోపణలతో అతని తండ్రిని పోలీసులు అరెస్టు చేసిన తర్వాత దుబాయ్‌కు వలస వెళ్లాడు. దుబాయ్‌లో సొంత ఇల్లు, తివాచీల షోరూమ్ ఉన్న మీర్... మరోవైపు గల్ఫ్‌లో మారకద్రవ్య సరఫరా వ్యవహారాలు సాగించేవాడు. అక్కడి నుంచే భారతీయ పాస్‌పోర్టు(నకిలీ) సంపాదించాడు. అలాగే దక్షిణ ఢిల్లీలోని జమ్మూ కాశ్మీర్ బ్యాంకులో ఎన్నారై ఖాతాను నిర్వహించాడు.హురియత్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు మిర్వాయిజ్ ఉమర్ ఫరూక్‌కు సన్నిహితుడైన మీర్... కేంద్ర దర్యాప్తు సంస్థల విచారణలో నిషేధిత ఉగ్రవాద సంస్థ హిజ్బుల్ ముజాహిద్దీన్, వేర్పాటువాద సంస్థలతో సంబంధం ఉన్నట్లు బయటపెట్టాడు. అయితే మిర్వాయిజ్ గురువారం శ్రీనగర్ నుంచి ఫోన్లో పీటీఐ వార్తాసంస్థతో మాట్లాడుతూ... మిర్, అతని కుటుంబం గురించి మాత్రమే తనకు తెలుసునని, అతణ్ని ఎందుకు అరెస్టు చేశారో తెలియదని చెప్పారు.