సాక్షి, న్యూఢిల్లీ : హిజ్బుల్ ముజాహిద్దీన్ చీఫ్, మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది సయ్యద్ సలావుద్దీన్‌కు ఊహించని షాక్. అతని కొడుకు షాహిద్ యూసఫ్‌ను జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) మంగళవారం అరెస్ట్ చేసింది. ఉగ్రవాదులకు నిధులు చేరవేసిన కేసులో అతనిని అదుపులోకి తీసుకున్నట్లు ప్రకటించింది.
జమ్ము కశ్మీర్ లో ఉద్యోగిగా పని చేస్తున్న యూసఫ్‌కు సౌదీ అరేబియా హిబ్జుల్ ముజాహీద్దిన్ సభ్యుడు ఐజా అహ్మద్ భట్ నుంచి డబ్బు సమకూరిందనే ఆరోపణలు వెలువెత్తాయి. దీని వెనుక సలావుద్దీన్ ప్రధాన కుట్రదారుడిగా ఉన్నాడు. ఇక ఈ డబ్బును యూసఫ్.. 2011 నుంచి 2014 వరకూ కాశ్మీర్ లోయలో ఉగ్రవాద కార్యకలాపాలకు వినియోగించారని విచారణలో తేలింది. బలమైన సాక్ష్యాలు సేకరించాకే అతన్ని అదుపులోకి తీసుకున్నట్లు దర్యాప్తు సంస్థ వెల్లడించింది.
కాగా, 2011లో ఈ కేసులో ఎన్‌ఐఏ రెండు ఛార్జీషీట్‌లను నమోదు చేసింది. మొత్తం ఆరుగురు నిందితులలో ఇప్పటివరకు ఇద్దరిని అరెస్ట్ చేయగా.. మొహమ్మద్ మక్బూల్ పండిట్, అజీజ్ అహ్మద్ భట్ లు సహా మిగతా వారు పాకిస్థాన్, పీవోకే లో తలదాచుకున్నారు. జమ్ము కశ్మీర్‌లో శాంతి చర్చలను ప్రారంభించేందుకు ప్రత్యేక ప్రతినిధులతో కూడిన బృందాన్ని ఏర్పాటు చేస్తామని కేంద్రం వెల్లడించిన మరుసటి రోజే.. ఈ అరెస్ట్ చోటు చేసుకోవటం గమనార్హం. పాక్ కేంద్రంగా హిజ్బుల్ ముజాహిద్దీన్‌ను నడిపిస్తూ.. రాజకీయ ఆరంగ్రేటం కోసం యత్నిస్తున్న సలావుద్దీన్‌కి కొడుకు అరెస్ట్ పెద్ద ఎదురుదెబ్బేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment