Syed Salahuddin son
-
అంతర్జాతీయ ఉగ్రవాది కుమారుడి అరెస్ట్
శ్రీనగర్: ఉగ్ర నిధుల కేసుకు సంబంధించి అంతర్జాతీయ ఉగ్రవాది సయ్యద్ సలాహుద్దీన్ కొడుకు షకీల్ యూసఫ్‌ను జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) అదుపులోకి తీసుకుంది. శ్రీనగర్ ప్రభుత్వ ఆస్పత్రిలో ల్యాబ్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న షకీల్‌ను రాంబాగ్‌లో ఉండగా గురువారం అదుపులోకి తీసుకున్నట్లు ఎన్ఐఏ తెలిపింది. షకీల్ తన తండ్రి నుంచి ఉగ్రవాద నిధులు అందుకున్నట్లు 2011 ఏప్రిల్‌లో కేసు నమోదైంది. ఇదే కేసులో సలాహుద్దీన్ పెద్ద కొడుకు షాహిద్‌ను జూన్‌లో ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. వీరు హవాలా మార్గం ద్వారా పాక్ నుంచి సేకరించిన నిధులను ఉగ్రవాదులు, వేర్పాటువాదులకు అందించినట్లు ఎన్ఐఏ అనుమానిస్తోంది. ఇదే కేసులో పాక్ అనుకూల వేర్పాటువాద నేత సయ్యద్ అలీ షా గిలానీతోపాటు మహ్మద్ సిద్దిఖి గనాయ్, గులాం జిలానీ లిలూ, ఫరూక్ అహ్మద్ ఇప్పటికే ఎన్ఐఏ కస్టడీలో ఉన్నారు. -
మోస్ట్ వాంటెడ్‌కు గట్టి షాక్
సాక్షి, న్యూఢిల్లీ : హిజ్బుల్ ముజాహిద్దీన్ చీఫ్, మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది సయ్యద్ సలావుద్దీన్‌కు ఊహించని షాక్. అతని కొడుకు షాహిద్ యూసఫ్‌ను జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) మంగళవారం అరెస్ట్ చేసింది. ఉగ్రవాదులకు నిధులు చేరవేసిన కేసులో అతనిని అదుపులోకి తీసుకున్నట్లు ప్రకటించింది. జమ్ము కశ్మీర్ లో ఉద్యోగిగా పని చేస్తున్న యూసఫ్‌కు సౌదీ అరేబియా హిబ్జుల్ ముజాహీద్దిన్ సభ్యుడు ఐజా అహ్మద్ భట్ నుంచి డబ్బు సమకూరిందనే ఆరోపణలు వెలువెత్తాయి. దీని వెనుక సలావుద్దీన్ ప్రధాన కుట్రదారుడిగా ఉన్నాడు. ఇక ఈ డబ్బును యూసఫ్.. 2011 నుంచి 2014 వరకూ కాశ్మీర్ లోయలో ఉగ్రవాద కార్యకలాపాలకు వినియోగించారని విచారణలో తేలింది. బలమైన సాక్ష్యాలు సేకరించాకే అతన్ని అదుపులోకి తీసుకున్నట్లు దర్యాప్తు సంస్థ వెల్లడించింది. కాగా, 2011లో ఈ కేసులో ఎన్ఐఏ రెండు ఛార్జీషీట్లను నమోదు చేసింది. మొత్తం ఆరుగురు నిందితులలో ఇప్పటివరకు ఇద్దరిని అరెస్ట్ చేయగా.. మొహమ్మద్ మక్బూల్ పండిట్, అజీజ్ అహ్మద్ భట్ లు సహా మిగతా వారు పాకిస్థాన్, పీవోకే లో తలదాచుకున్నారు. జమ్ము కశ్మీర్లో శాంతి చర్చలను ప్రారంభించేందుకు ప్రత్యేక ప్రతినిధులతో కూడిన బృందాన్ని ఏర్పాటు చేస్తామని కేంద్రం వెల్లడించిన మరుసటి రోజే.. ఈ అరెస్ట్ చోటు చేసుకోవటం గమనార్హం. పాక్ కేంద్రంగా హిజ్బుల్ ముజాహిద్దీన్ను నడిపిస్తూ.. రాజకీయ ఆరంగ్రేటం కోసం యత్నిస్తున్న సలావుద్దీన్కి కొడుకు అరెస్ట్ పెద్ద ఎదురుదెబ్బేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
తీవ్రవాది కొడుకును కాపాడిన ఆర్మీ
శ్రీనగర్: పాంపోర్ ఎన్ కౌంటర్ నుంచి తీవ్రవాది అగ్రనేత కొడుకును భద్రతా బలగాలు కాపాడాయి. గతవారం ఉగ్రవాదులతో జరిగిన ఎదురుకాల్పులు సందర్భంగా 100 మందిని భద్రతా దళాలు రక్షించాయి. వీరిలో తీవ్రవాద సంస్థ హిజబుల్ ముజాహిద్దీన్ అగ్రనేత సయిద్ సలావుద్దీన్ కుమారుడు సయిద్ మొయిన్ ఉన్నాడు. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్(ఈడీఐ)లో మొయిన్ ఐటీ మేనేజర్ గా పనిచేస్తున్నాడు. సలావుద్దీన్ ముగ్గురు కొడుకుల్లో మొయిన్ ఒకడని, అతడికి తీవ్రవాద సంస్థలతో సంబంధాలు లేవని పోలీసులు తెలిపారు. అయితే ఈడీఐపై ఉగ్రవాదుల దాడి తర్వాత మొయిన్ ను పోలీసులు ప్రశ్నించినట్టు వార్తలు వచ్చాయి. పాకిస్థాన్ కు చెందిన లష్కరే-ఈ-తోయిబా ఉగ్రవాదులు శనివారం మధ్యాహ్నం శ్రీనగర్ - జమ్మూ జాతీయ రహదారిపై సీఆర్పీఎఫ్ కాన్వాయ్ మీద దాడి చేసి.. సమీపంలోని ఈడీఐ భవంతిలోకి చొరబడిన విషయం విదితమే. మూడు రోజుల పాటు జరిగిన ఎన్ కౌంటర్ లో ముగ్గురు ఉగ్రవాదులు, ఐదుగురు భద్రతా సిబ్బంది, ఒక పౌరుడు మృతి చెందారు.