( ఫైల్ ఫోటో )
సాక్షి, హైదరాబాద్: హ్యాండ్ గ్రెనేడ్లతో దసరా వేడుకల్లో హైదరాబాద్‌లో భారీ విధ్వంసాన్ని సృష్టించాలని పథకం వేసి నగర పోలీసులకు చిక్కిన ముగ్గురు ఉగ్రవాదులకు గతంలో నగదు సమకూర్చిన ఫైనాన్షియర్ తాజాగా పోలీసులకు పట్టుబడ్డాడు. హవాలా రూపంలో వచ్చిన ఈ నగదు సరఫరాలో కీలక పాత్ర పోషించిన ఆపరేటర్ల కోసం సిట్ ముమ్మరంగా దర్యాప్తు చేసింది. ఈ నగదు సమకూర్చిన వారిలో కీలక నిందితుడు, పాతబస్తీకి చెందిన హవాలా ఆపరేటర్ మహ్మద్ అబ్దుల్ ఖలీమ్‌ను సీసీఎస్ నేతృత్వంలోని సిట్ గురువారం అరెస్ట్ చేసింది.
ఉగ్ర కుట్ర అమలుకు రూ.40లక్షలు
గత ఏడాది దసరా ఉత్సవాల సందర్భంగా బాంబులు పేల్చి భారీ ప్రాణనష్టం కల్పించి, తద్వారా హైదరాబాద్‌లో మతకలహాలు సృష్టించి అశాంతిని రేకిత్తించేందుకు భారీ కుట్ర జరిగింది. ఈ కేసులో గత ఏడాది అక్టోబర్ 2వ తేదీన హైదరాబాద్ పోలీసులు లష్కరే తోయిబా ఉగ్రవాదులైన అబ్దుల్ జాహెద్, మహ్మద్ సమీయుద్దీన్, మాజ్ హసన్ ఫారూఖ్‌లను అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి నాలుగు హ్యాండ్ గ్రెనేడ్లను స్వా«దీనం చేసుకున్నారు. చైనాలో తయారైన హ్యాండ్ గ్రెనేడ్లు జమ్మూ కశీ్మర్ సరిహద్దుల ద్వారా మన దేశంలోకి వచ్చాయి.
పాకిస్తాన్‌లో ఉన్న ఉగ్రవాదులు ఫర్హతుల్లా ఘోరీ, సిద్దిఖ్ బిన్ ఉస్మాన్, అబ్దుల్ మాజిద్‌లు ఇచ్చిన ఆదేశాలతో ఆ ముగ్గురూ ఉగ్రకుట్ర ప్రణాళికలు సిద్ధం చేశారు. అయితే ఉగ్రకుట్రను విజయంతం చేయడానికి కావాల్సిన ఆర్థిక సహాయం హైదరాబాద్‌లో ఉన్న నిందితులకు హవాలా ద్వారా అందింది. హవాలా మార్గంలో రూ.40 లక్షలు ఇచ్చేందుకు పాతబస్తీకి చెందిన మహ్మద్ అబ్దుల్ ఖలీమ్ సహకరించినట్లు తేలడంతో తాజాగా సిట్ అరెస్ట్ చేసింది. అరెస్టయి జైల్లో ఉన్న ముగ్గురు ఉగ్రవాదులకు సహకరించిన మరో 8 మందిని కూడా పోలీసులు మొదట్లోనే విచారించారు. అందులో కొందరు తెలిసి, మరికొందరు తెలియకుండా వారికి సహకరించినట్లు పోలీసులు ఆధారాలు సేకరించారు.
ఉగ్రవాదులకు సాయం చేసిన వారిపై సిట్ కన్ను
దర్యాప్తులో ఉగ్రవాదులకు సహాయ సహకారాలు అందించిన వారిపై ఇప్పుడు సిట్ దృష్టి పెట్టింది. ఇందులో భాగంగానే హవాల మార్గంలో డబ్బు పంపించాలని ఎవరు ఆదేశించారు, డబ్బు ఎవరు ఇచ్చారు, ఎన్నిసార్లు ఆ డబ్బును ఖలీమ్ సమకూర్చాడు అనే విషయాలపై ఇప్పుడు సిట్ దృష్టి పెట్టింది. ఇదిలాఉండగా వచ్చిన డబ్బుతో ముగ్గురు ఉగ్రవాదులు రెండు ఇన్‌ఫీల్డ్ బైక్‌లు కొనడంతో పాటు ఒక కారును కూడా కొన్నారు. హైదరాబాద్‌లో దసరా వేడుకలలో నరమేధం సృష్టించేందుకు బైక్‌లు, కార్లలో వెళ్లి గ్రెనేడ్లను పేల్చాలని ఉగ్రవాదులు ప్లాన్ చేశారు.
పోలీసుల నిఘాలో ఈ కుట్ర బయటపడడంతో ముగ్గురు ఉగ్రవాదులను పోలీసులు అరెస్ట్ చేశారు, ఈ నేపధ్యంలో అరెస్టైయిన ఉగ్రవాదులకు ఖలీమ్‌తో ఎన్నాళ్లుగా సంబంధాలున్నాయనే విషయంలో లోతైన దర్యాప్తు జరిపేందుకు నిందితుడిని కస్టడీలోకి తీసుకోనున్నారు. కాగా ఈ ఘటనపై ఎన్‌ఐఏ కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన విషయం తెలిసిందే.
చదవండి: ఢిల్లీ లిక్కర్ స్కాం నిందితులకు బెయిల్ నిరాకరణ
Comments
Please login to add a commentAdd a comment