ఎన్‌ఐఏ అధికారులు, ఇన్‌సెట్లో సల్మాన్ నివాసం
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్, భోపాల్ సహా అనేక నగరాల్లో విధ్వంసానికి కుట్ర పన్నిన హిజ్బ్ ఉత్ తెహ్రీర్ (హెచ్‌యూటీ) ఉగ్రవాద సంస్థకు చెందిన మరో ఉగ్రవాది సల్మాన్‌ని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) అధికారులు మంగళవారం అరెస్టు చేశారు. ఈ మాడ్యుల్‌కు చెందిన ఐదుగురిని భోపాల్ ఏటీఎస్ పోలీసులు ఈ ఏడాది మే రెండో వారంలో పట్టుకుని తీసుకువెళ్లారు. ఆపై ఈ కేసు దర్యాప్తు నిమిత్తం ఎన్‌ఐఏకు బదిలీ అయింది.
అప్పట్లో తప్పించుకున్న జవహర్‌నగర్ వాసి మహ్మద్ సల్మాన్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. ఇతడి కోసం సుదీర్ఘ కాలం నిఘా ఉంచిన ఎన్‌ఐఏ ప్రత్యేక బృందం ఎట్టకేలకు రాజేంద్రనగర్ ప్రాంతంలో అరెస్టు చేసింది. దీంతో మధ్యప్రదేశ్, హైదరాబాద్‌లో కలిపి ఈ కేసులో ఇప్పటివరకు పట్టుబడిన ఉగ్రవాదుల సంఖ్య 17కు చేరింది. టెర్రర్ మాడ్యుల్‌లో ఓ కళాశాలలో హెచ్‌ఓడీగా పని చేసిన ఫార్మాస్యూటికల్ బయోకెమిస్ట్రీ ప్రొఫెసర్ మహ్మద్ సలీం కీలకమని నిర్ధారించిన విషయం విదితమే.
గోల్కొండలోని ఓ ప్రార్థన స్థలంలో సలీంకు దినసరి కూలి మహ్మద్ హమీద్‌తో పరిచయమైంది. ఇతడిని ఉగ్రవాద బాట పట్టించిన సలీం మరికొందరిని తన మాడ్యుల్‌లో చేర్చుకోవాలని భావించాడు. ఈ విషయం హమీద్‌కు చెప్పగా... అతడు తన చిన్ననాటి స్నేహితుడైన జవహర్‌నగర్‌కు చెందిన మహ్మద్ సల్మాన్‌ను తీసుకువచ్చి పరిచయం చేశాడు. వీరితో పాటు మొత్తం ఐదుగురితో సలీం మాడ్యుల్ ఏర్పాటు చేశాడు.
ఈ ముష్కరులను పట్టుకోవడానికి మధ్యప్రదేశ్ ఏటీఎస్, రాష్ట్ర నిఘా వర్గాలు నగరంలోని వివిధ ప్రాంతాలతో పాటు భోపాల్‌లోనూ ఏకకాల దాడులు చేశాయి. ఫలితంగా అక్కడ 11 మంది, నగరంలోని గోల్కొండ, హఫీజ్‌బాబానగర్, జగద్గిరిగుట్టల్లో సలీం, హమీద్ సహా ఐదుగురు చిక్కారు. జవహర్‌నగర్‌లోని శివాజీనగర్‌కు చెందిన మహ్మద్ సల్మాన్ పోలీసులు దాడి చేసే సమయంలో ఇంటి నుంచి బయటకు వెళ్లాడు.
పోలీసులు వచ్చిన విషయం తెలిసిన సల్మాన్ పక్కింటి వాళ్లు అతడికి ఫోన్ చేసి చెప్పడంతో అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. అప్పటి నుంచి పరారీలో ఉన్న సల్మాన్ కోసం ముమ్మరంగా గాలించిన ఎన్‌ఐఏ రాజేంద్రనగర్ ప్రాంతంలో పట్టుకుంది. ఇతడి నుంచి నిషేధిత సాహిత్యం సీజ్ చేసింది. కోర్టులో హాజరుపరిచిన అధికారులు భోపాల్ తరలించడానికి ట్రాన్సిట్ వారెంట్ తీసుకున్నారు. బుధవారం అక్కడకు తరలించిన తర్వాత న్యాయస్థానం అనుమతితో తమ కస్టడీలోకి తీసుకుని విచారించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment