Terrorist arrest
-
22 మంది అనుమానిత ఉగ్రవాదులు అరెస్టు
లాహోర్: పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రావిన్సులో భారీ ఉగ్ర కుట్రను పోలీసులు భగ్నం చేశారు. సుమారు 22 మంది అనుమానిత ఉగ్రవాదులను అరెస్టు చేశారు. పట్టుబడిన ఉగ్రవాదులు ఐఎస్ఐఎస్, టీటీపీతో పాటు ఇతర నిషేధిత సంస్థలకు చెందినట్లు గుర్తించారు.కౌంటర్ టెర్రరిజం డిపార్ట్మెంట్ ప్రతినిధి దీనిపై మాట్లాడుతూ.. ఇంటెలిజెన్స్ శాఖ ఇచ్చిన సమాచారం ఆధారంగా పంజాబ్‌లోని వేర్వేరు జిల్లాల్లో సుమారు 152 ప్రదేశాల్లో తనిఖీలు నిర్వహించామని తెలిపారు. ఐఎస్ఐఎస్, తెహ్రీక్ ఏ తాలిబన్ పాకిస్థాన్, బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ, లష్కరే ఈ జాంగ్వీ గ్రూపులకు చెందిన 22 మంది అనుమానిత ఉగ్రవాదులను అరెస్టు చేసినట్లు చెప్పారు.లాహోర్, అటాక్, షేక్‌పురా, ముజాఫర్ఘర్, నాన్కానా సాహిబ్, బవల్పుర్, డీజీ ఖాన్, ఫైసలాబాద్, ముల్తాన్, భవాల్నగర్, రావల్పిండి నుంచి వాళ్లను అదుపులోకి తీసుకున్నారు. ఉగ్రవాదుల వద్ద నుంచి 1645 గ్రామాలు పేలుడు పదార్థాలు, మూడు హ్యాండ్ గ్రానేడ్లు, ఒక ఐఈడీ బాంబు, 12 డెటోనేటర్లు, పిస్తోల్, నిషేధిత సాహిత్యాన్ని సీజ్ చేశారు. అనుమానిత ఉగ్రవాదులు పంజాబ్‌లో అఘాయిత్యానికి ప్లాన్ వేశారు, రాష్ట్రంలో ఉన్న కీలక ప్రదేశాలను, వ్యక్తులను టార్గెట్ చేయాలని భావించారు.1,645 గ్రాముల బరువున్న పేలుడు పదార్థాలు, మూడు హ్యాండ్ గ్రెనేడ్లు, ఒక ఐఈడీ బాంబు, 12 డిటోనేటర్లు, 32 అడుగుల సేఫ్టీ ఫ్యూజ్ వైర్, ఒక పిస్టల్, నిషేధిత సాహిత్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. -
ఆరో ఉగ్రవాది దొరికాడు! జవహర్‌నగర్‌లో ఎస్కేప్.. రాజేంద్రనగర్‌లో అరెస్టు!
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్, భోపాల్ సహా అనేక నగరాల్లో విధ్వంసానికి కుట్ర పన్నిన హిజ్బ్ ఉత్ తెహ్రీర్ (హెచ్‌యూటీ) ఉగ్రవాద సంస్థకు చెందిన మరో ఉగ్రవాది సల్మాన్‌ని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారులు మంగళవారం అరెస్టు చేశారు. ఈ మాడ్యుల్‌కు చెందిన ఐదుగురిని భోపాల్ ఏటీఎస్ పోలీసులు ఈ ఏడాది మే రెండో వారంలో పట్టుకుని తీసుకువెళ్లారు. ఆపై ఈ కేసు దర్యాప్తు నిమిత్తం ఎన్ఐఏకు బదిలీ అయింది. అప్పట్లో తప్పించుకున్న జవహర్‌నగర్ వాసి మహ్మద్ సల్మాన్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. ఇతడి కోసం సుదీర్ఘ కాలం నిఘా ఉంచిన ఎన్ఐఏ ప్రత్యేక బృందం ఎట్టకేలకు రాజేంద్రనగర్ ప్రాంతంలో అరెస్టు చేసింది. దీంతో మధ్యప్రదేశ్, హైదరాబాద్‌లో కలిపి ఈ కేసులో ఇప్పటివరకు పట్టుబడిన ఉగ్రవాదుల సంఖ్య 17కు చేరింది. టెర్రర్ మాడ్యుల్లో ఓ కళాశాలలో హెచ్ఓడీగా పని చేసిన ఫార్మాస్యూటికల్ బయోకెమిస్ట్రీ ప్రొఫెసర్ మహ్మద్ సలీం కీలకమని నిర్ధారించిన విషయం విదితమే. గోల్కొండలోని ఓ ప్రార్థన స్థలంలో సలీంకు దినసరి కూలి మహ్మద్ హమీద్‌తో పరిచయమైంది. ఇతడిని ఉగ్రవాద బాట పట్టించిన సలీం మరికొందరిని తన మాడ్యుల్లో చేర్చుకోవాలని భావించాడు. ఈ విషయం హమీద్‌కు చెప్పగా... అతడు తన చిన్ననాటి స్నేహితుడైన జవహర్‌నగర్‌కు చెందిన మహ్మద్ సల్మాన్‌ను తీసుకువచ్చి పరిచయం చేశాడు. వీరితో పాటు మొత్తం ఐదుగురితో సలీం మాడ్యుల్ ఏర్పాటు చేశాడు. ఈ ముష్కరులను పట్టుకోవడానికి మధ్యప్రదేశ్ ఏటీఎస్, రాష్ట్ర నిఘా వర్గాలు నగరంలోని వివిధ ప్రాంతాలతో పాటు భోపాల్‌లోనూ ఏకకాల దాడులు చేశాయి. ఫలితంగా అక్కడ 11 మంది, నగరంలోని గోల్కొండ, హఫీజ్‌బాబానగర్, జగద్గిరిగుట్టల్లో సలీం, హమీద్ సహా ఐదుగురు చిక్కారు. జవహర్‌నగర్‌లోని శివాజీనగర్‌కు చెందిన మహ్మద్ సల్మాన్ పోలీసులు దాడి చేసే సమయంలో ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. పోలీసులు వచ్చిన విషయం తెలిసిన సల్మాన్ పక్కింటి వాళ్లు అతడికి ఫోన్ చేసి చెప్పడంతో అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. అప్పటి నుంచి పరారీలో ఉన్న సల్మాన్ కోసం ముమ్మరంగా గాలించిన ఎన్ఐఏ రాజేంద్రనగర్ ప్రాంతంలో పట్టుకుంది. ఇతడి నుంచి నిషేధిత సాహిత్యం సీజ్ చేసింది. కోర్టులో హాజరుపరిచిన అధికారులు భోపాల్ తరలించడానికి ట్రాన్సిట్ వారెంట్ తీసుకున్నారు. బుధవారం అక్కడకు తరలించిన తర్వాత న్యాయస్థానం అనుమతితో తమ కస్టడీలోకి తీసుకుని విచారించనున్నారు. -
హైదరాబాద్ పేలుళ్ల కుట్రకోణంలో కొత్త మలుపు
సాక్షి, హైదరాబాద్: హ్యాండ్ గ్రెనేడ్లతో దసరా వేడుకల్లో హైదరాబాద్‌లో భారీ విధ్వంసాన్ని సృష్టించాలని పథకం వేసి నగర పోలీసులకు చిక్కిన ముగ్గురు ఉగ్రవాదులకు గతంలో నగదు సమకూర్చిన ఫైనాన్షియర్ తాజాగా పోలీసులకు పట్టుబడ్డాడు. హవాలా రూపంలో వచ్చిన ఈ నగదు సరఫరాలో కీలక పాత్ర పోషించిన ఆపరేటర్ల కోసం సిట్ ముమ్మరంగా దర్యాప్తు చేసింది. ఈ నగదు సమకూర్చిన వారిలో కీలక నిందితుడు, పాతబస్తీకి చెందిన హవాలా ఆపరేటర్ మహ్మద్ అబ్దుల్ ఖలీమ్‌ను సీసీఎస్ నేతృత్వంలోని సిట్ గురువారం అరెస్ట్ చేసింది. ఉగ్ర కుట్ర అమలుకు రూ.40లక్షలు గత ఏడాది దసరా ఉత్సవాల సందర్భంగా బాంబులు పేల్చి భారీ ప్రాణనష్టం కల్పించి, తద్వారా హైదరాబాద్‌లో మతకలహాలు సృష్టించి అశాంతిని రేకిత్తించేందుకు భారీ కుట్ర జరిగింది. ఈ కేసులో గత ఏడాది అక్టోబర్ 2వ తేదీన హైదరాబాద్ పోలీసులు లష్కరే తోయిబా ఉగ్రవాదులైన అబ్దుల్ జాహెద్, మహ్మద్ సమీయుద్దీన్, మాజ్ హసన్ ఫారూఖ్‌లను అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి నాలుగు హ్యాండ్ గ్రెనేడ్లను స్వా«దీనం చేసుకున్నారు. చైనాలో తయారైన హ్యాండ్ గ్రెనేడ్లు జమ్మూ కశీ్మర్ సరిహద్దుల ద్వారా మన దేశంలోకి వచ్చాయి. పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాదులు ఫర్హతుల్లా ఘోరీ, సిద్దిఖ్ బిన్ ఉస్మాన్, అబ్దుల్ మాజిద్‌లు ఇచ్చిన ఆదేశాలతో ఆ ముగ్గురూ ఉగ్రకుట్ర ప్రణాళికలు సిద్ధం చేశారు. అయితే ఉగ్రకుట్రను విజయంతం చేయడానికి కావాల్సిన ఆర్థిక సహాయం హైదరాబాద్‌లో ఉన్న నిందితులకు హవాలా ద్వారా అందింది. హవాలా మార్గంలో రూ.40 లక్షలు ఇచ్చేందుకు పాతబస్తీకి చెందిన మహ్మద్ అబ్దుల్ ఖలీమ్ సహకరించినట్లు తేలడంతో తాజాగా సిట్ అరెస్ట్ చేసింది. అరెస్టయి జైల్లో ఉన్న ముగ్గురు ఉగ్రవాదులకు సహకరించిన మరో 8 మందిని కూడా పోలీసులు మొదట్లోనే విచారించారు. అందులో కొందరు తెలిసి, మరికొందరు తెలియకుండా వారికి సహకరించినట్లు పోలీసులు ఆధారాలు సేకరించారు. ఉగ్రవాదులకు సాయం చేసిన వారిపై సిట్ కన్ను దర్యాప్తులో ఉగ్రవాదులకు సహాయ సహకారాలు అందించిన వారిపై ఇప్పుడు సిట్ దృష్టి పెట్టింది. ఇందులో భాగంగానే హవాల మార్గంలో డబ్బు పంపించాలని ఎవరు ఆదేశించారు, డబ్బు ఎవరు ఇచ్చారు, ఎన్నిసార్లు ఆ డబ్బును ఖలీమ్ సమకూర్చాడు అనే విషయాలపై ఇప్పుడు సిట్ దృష్టి పెట్టింది. ఇదిలాఉండగా వచ్చిన డబ్బుతో ముగ్గురు ఉగ్రవాదులు రెండు ఇన్ఫీల్డ్ బైక్‌లు కొనడంతో పాటు ఒక కారును కూడా కొన్నారు. హైదరాబాద్‌లో దసరా వేడుకలలో నరమేధం సృష్టించేందుకు బైక్‌లు, కార్లలో వెళ్లి గ్రెనేడ్లను పేల్చాలని ఉగ్రవాదులు ప్లాన్ చేశారు. పోలీసుల నిఘాలో ఈ కుట్ర బయటపడడంతో ముగ్గురు ఉగ్రవాదులను పోలీసులు అరెస్ట్ చేశారు, ఈ నేపధ్యంలో అరెస్టైయిన ఉగ్రవాదులకు ఖలీమ్‌తో ఎన్నాళ్లుగా సంబంధాలున్నాయనే విషయంలో లోతైన దర్యాప్తు జరిపేందుకు నిందితుడిని కస్టడీలోకి తీసుకోనున్నారు. కాగా ఈ ఘటనపై ఎన్ఐఏ కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన విషయం తెలిసిందే. చదవండి: ఢిల్లీ లిక్కర్ స్కాం నిందితులకు బెయిల్ నిరాకరణ -
అనుమానిత ఉగ్రవాది బెంగళూరులో అరెస్టు
సాక్షి, బెంగళూరు: అంతర్జాతీయ ఉగ్ర సంస్థలతో సంబంధం ఉన్న ఓ వ్యక్తి బెంగళూరులో అరెస్టయ్యాడు. జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ), బెంగళూరు పోలీసులు కలిసి చేపట్టిన ఆపరేషన్‌లో ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్‌కు చెందిన మహ్మద్ ఆరీఫ్ అనే వ్యక్తి పట్టుబడ్డాడు. శనివారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో థణిసంద్రలోని ఓఇంట్లో ఉన్న ఇతడిని అరెస్ట్ చేశారు. ప్రైవేటు కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పని చేస్తున్న అరీఫ్‌కు భార్య, ఇద్దరు పిల్లలున్నారు. రెండేళ్లుగా ఉగ్ర సంస్థ అల్‌ఖైదాతో టెలీగ్రాం, డార్క్‌నెట్ ద్వారా సంబంధాలు నెరుపుతున్నట్లు తెలిసింది. ఇతడి కదలికలపై ఎన్ఐఏ కొన్ని రోజులుగా నిఘా ఉంచింది. సిరియా వెళ్లే ప్రయత్నాల్లో ఉన్న ఆరీఫ్‌ను పట్టుకుని, ఒక లాప్టాప్, రెండు హార్డ్ డిస్కులను స్వాధీనం చేసుకుంది. ఈ నెల 13న బెంగళూరులోని ఇంటిని ఖాళీ చేసి యూపీకి వెళ్తున్నట్టు ఇతడు ఇంటి యజమానికి చెప్పాడని పోలీసులు వివరించారు. గత నవంబర్‌లో శివమొగ్గలో ఐఎస్ ప్రేరేపిత ఉగ్ర మాడ్యూల్‌ను పోలీసులు పట్టుకున్న విషయం తెలిసిందే. -
బెంగళూరులో అనుమానిత ఉగ్రవాది అరెస్ట్
సాక్షి, బెంగళూరు: అనుమానిత ఉగ్రవాది ఒకరిని బెంగళూరు పోలీసులు అరెస్టు చేశారు. ఆదివారం రాత్రి తిలక్‌నగరలో ఉంటున్న అస్సాంకు చెందిన అఖ్తర్ హుస్సేన్ లష్కర్‌ను అదుపులోకి తీసుకున్నట్లు పోలీస్ కమిషనర్ ప్రతాప్ రెడ్డి తెలిపారు. పదో తరగతి వరకు చదువుకున్న అఖ్తర్ యువతకు ఉగ్రవాద సంస్థలతో గల సంబంధాలపై విచారణ జరుపుతున్నట్లు తెలిపారు. ఫుడ్ డెలివరీ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తున్న ఇతడి నుంచి ల్యాప్‌ట్యాప్, మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. కాగా, సోమవారం మరో అనుమానిత ఉగ్రవాదిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు చెప్పారు. -
కశ్మీర్ లోయలో వరుస హత్యలు.. హిజ్బుల్ ఉగ్రవాది అరెస్ట్
బెంగళూరు: ఉగ్రవాద సంస్థ హిజ్బుల్ ముజాహిదీన్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈ సంస్థ టాప్ కమాండర్, టెర్రరిస్ట్ తాలిబ్ హుస్సేన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. జమ్మూ కశ్మీర్ లోయలో హిందువులను లక్ష్యంగా చేసుకుని హత్య చేసిన కేసులో జమ్మూకశ్మీర్ పోలీసులు బెంగుళూరులో ఇతడిని అదుపులోకి తీసుకున్నారు. బెంగుళూరులో ఉగ్రవాది అరెస్టుపై ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై స్పందించారు. ప్రజల కదలికలపై పోలీసుల నిఘా నిరంతరం ఉంటుందన్నారు. ఉగ్రవాదిని అరెస్ట్ చేయడంలో తమ పోలీసులు పూర్తి సహాయం అందించారన్నారు. బెంగుళూరులో తాలిబ్ హుస్సేన్‌ను జమ్మూ కశ్మీర్ పోలీసులు అరెస్టు చేయడంలో తాము సాయం చేసినట్లు వెల్లడించారు. కశ్మీర్ పోలీసు ఇన్స్పెక్టర్ జనరల్ మాట్లాడుతూ.. రాహుల్ భట్ హత్యలో ఇద్దరు ఉగ్రవాదులు ప్రమేయం ఉండగా ఒకరిని అంతమొందించినట్లు తెలిపారు. అమ్రీన్ భట్ హత్య కేసులో, ఇద్దరు ఉగ్రవాదులను గుర్తించి మట్టుబెట్టారు. ఇక విజయ్ కుమార్ హత్యలో కేసులో ఉగ్రవాదులు గుర్తించామని వారిని త్వరలో అరెస్టు చేస్తామన్నారు. కాగా జూన్ 2న జమ్మూకశ్మీర్‌లోని కుల్గామ్‌లో ఎలాహి దేహతి బ్యాంక్ మేనేజర్‌ను ఉగ్రవాదులు కాల్చిచంపిన విషయం తెలిసిందే. మేనేజర్ క్యాబిన్లో ఉన్న విజయ్ కుమార్‌ను ఓ ఉగ్రవాది తన చేతుల్లోని తుపాకీతో కాల్చేశాడు. రెండు రౌండ్ల కాల్పులు జరపడంతో మేనేజర్ అక్కడే కుప్పకూలిపోయాడు. చదవండి: బీజేపీకి సంకటం.. దేశ ప్రతిష్టకు భంగపాటు -
కశ్మీర్లో ఆపరేషన్ సక్సెస్: ప్రధాన ఉగ్రవాది అరెస్ట్
కశ్మీర్: ఉగ్రదాడులను ప్రోత్సహిస్తున్న లష్కరే -ఈ -ముస్తఫా వ్యవస్థాపకుడు హిదాయతుల్లా మాలిక్ ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. కశ్మీర్లో జరిపిన దాడుల్లో ఈ కీలకమైన ఉగ్రవాది ఆచూకీ లభించింది. అదుపులోకి తీసుకునే క్రమంలో అతడు ఎదురుదాడికి దిగాడు. దీంతో పోలీసులు అప్రమత్తమై అతి కష్టమ్మీద హిదాయతుల్లాను అదుపులోకి తీసుకున్నారు. జమ్మూ నుంచి కశ్మీర్ వెళ్తుండగా అతడిని అరెస్ట్ చేశారు. జమ్మూ, అనంత్‌నాగ్ పోలీసులు సంయుక్తంగా శనివారం ఆపరేషన్ చేపట్టగా కుంజువాణి ప్రాంతంలో హిదాయతుల్లా కనిపించాడు. వాహనాల తనిఖీ సమయంలో కనిపించిన అతడి వివరాలు అడగడానికి ప్రయత్నించగా పోలీసులపై తుపాకీతో ఎదురు దాడి దిగాడు. దీంతో పోలీసులు అతడిని చుట్టుముట్టేసి అదుపులోకి తీసుకున్నారు. అతడి నుంచి పిస్టోల్, ఓ గ్రనేడ్‌ను స్వాధీనం చేసుకున్నట్లు జమ్మూ సీనియర్ ఎస్పీ శ్రీధర్ పాటిల్ తెలిపారు. కశ్మీర్ లోయలో జైషే- ఈ- మహ్మద్ అనే సంస్థను నిర్వహిస్తున్నాడని వివరించారు. దీనికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియ్సాలి ఉంది. -
అసెంబ్లీ ఎన్నికలు.. విధ్వంసానికి ఆల్‌ఖైదా ప్లాన్!
సాక్షి, న్యూఢిల్లీ : పలు రాష్ట్రాల్లో జరగుతున్న అసెంబ్లీ ఎన్నికలపై ఉగ్రవాద సంస్థ ఆల్ ఖైదా కన్నేసిందే. ఎన్నికల్లో విధ్వంసం సృష్టించేందుకు ప్రణాళికలు ఆల్ ఖైదా రచిస్తోందని ఇంటిలిజెన్స్ అనుమానం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో ఆల్ ఖైదా కమాండర్ జాకీర్ ముసాను పంజాబ్ సరిహద్దుల్లో భద్రతా దళాలు అరెస్ట్ చేశాయి. పంజాబ్- పాకిస్తాన్ సరిహద్దు నుంచి భారత్‌లోకి ప్రవేశించిన ఉగ్రవాది జాకీర్ ముసాను శనివారం బీఎస్ఎఫ్ సిబ్బంది అదుపులోకి తీసుకుని విచారిస్తోంది. డిసెంబర్ 7న జరిగే రాజస్తాన్ అసెంబ్లీ ఎన్నికల్లో అలర్లు సృష్టించేందుకు జాకీర్‌ను ఆల్ ఖైదా పంపిణి దూతగా నిఘా వర్గాలు అనుమానం వ్యక్తం చేశాయి. ఎన్నికలు జరగుతున్న నేపథ్యంలో ఉగ్రవాదుల నుంచి ప్రమాదం పొంచి ఉందని పంజాబ్, రాజస్తాన్ సరిహద్దుల్లో రక్షణ దళాన్ని అలర్ట్ చేసిన విషయం తెలిసిందే. కాగా సరిహద్దు రాష్ట్రాలైన రాజస్తాన్, పంజాబ్‌లు పాకిస్తాన్‌తో 1090 కి.మీ మెర సరిహద్దును పంచుకుంటున్నాయి. దీంతో సరిహద్దుల్లో హైలర్ట్ ప్రకటించినట్లు రక్షణ శాఖ అధికారులు ప్రకటించారు. -
పట్టుకోవడానికి పదహారేళ్లు!
సాక్షి, హైదరాబాద్: పదహారేళ్ల క్రితం ముంబై సబర్బన్ ప్రాంతమైన ఘట్కోపర్లో జరిగిన పేలుడు కేసులో నిందితుడు యహ్యా అబ్దుల్ రెహ్మాన్ పోలీసులకు ఇప్పటికి చిక్కాడు. అప్పట్లో దుబాయ్ పారిపోయిన ఇతగాడు అక్కడే ఉద్యోగం చేస్తున్నాడు. ఇక తనపై పోలీసు నిఘా ఉండదనే ఉద్దేశంతో తిరిగి రావాలనుకున్నాడు. మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో ఉన్న కుటుంబాన్ని కలిసేందుకు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నాడు. రెహ్మాన్‌ను పట్టుకునేందుకు అదనుగా భావించిన గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్(ఏటీఎస్) రెహ్మాన్‌ను మాటు వేసి పట్టుకుంది. అనంతరం రెహ్మాన్‌ను ముంబై పోలీసులకు అప్పగించారు. వారం క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇదే ఘట్కోపర్ కేసులో నగరానికి చెందిన మరో ఇద్దరు నిందితులుగా ఉండి, నిర్దోషులుగా బయటపడ్డారు. ఇద్దరిని బలిగొన్న బాంబు పేలుడు ఐఎస్ఐ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ లష్కరేతొయిబా 2002 డిసెంబర్ 2న ఘట్కోపర్ ప్రాంతంలో బెస్ట్ (బృహన్ ముంబై ఎలక్ట్రిక్ సప్లయ్ అండ్ ట్రాన్స్పోర్ట్) విభాగానికి చెందిన బస్సు సీటు కింద ఏర్పాటు చేసిన బాంబు పేలి ఇద్దరు చనిపోయారు. దాదాపు 70 మంది క్షతగాత్రులయ్యారు. ఈ కేసులో మొత్తం 19 మందిని నిందితులుగా ముంబై పోలీసులు గుర్తించారు. మరో తొమ్మిది మంది ఉగ్రవాద అనుమానితుల్ని అరెస్టు చేశారు. అయితే వీరిపై కేసు వీగిపోగా మిగిలిన వారిపై విచారణ జరగాల్సి ఉంది. ఇక్కడి వారు ఇద్దరూ మృతి ఘట్కోపర్ పేలుడు కేసులో నగరానికి చెందిన ఇద్దరు నిందితులుగా అరెస్టు అయ్యారు. వీరిలో ఒకరైన రజాక్ 2012లో హుమాయున్‌నగర్ పరిధిలో ఆత్మహత్య చేసుకోగా, సలావుద్దీన్ 2014లో నల్లగొండ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కన్నుమూశాడు. నిజామాబాద్ జిల్లాకు చెందిన మల్లేపల్లికి చెందిన మహ్మద్ అబ్దుల్ రజాక్ మసూర్ 1997–98ల్లో దుబాయ్ వెళ్ళి ఎల్ఈటీతో సంబంధాలు ఏర్పాటు చేసుకున్నాడు. పాక్‌లో శిక్షణ అనంతరం 2002లో రజాక్ ఎల్ఈటీ భారత్‌లో చేసే ఆపరేషన్లకు కో–ఆర్డినేటర్‌గా వ్యవహరించాడు. అక్కడే ఉంటూ 2002 నవంబర్ 21న జరిగిన దిల్సుఖ్నగర్ సాయిబాబా దేవాలయం వద్ద పేలుడు, ఘట్కోపర్ బ్లాస్ట్ తదితరాలను పర్యవేక్షించాడు. 2005 ఆగస్టులో ఢిల్లీ స్పెషల్‌సెల్ పోలీసులకు అక్కడి జకీర్‌నగర్ ప్రాంతంలో పట్టుబడ్డాడు. విచారణలోనే ఘట్కోపర్ కేసు అంగీకరించడంతో అక్కడి పోలీసులూ అరెస్టు చేశారు. హుమాయున్‌నగర్‌లోని వెంకటాద్రి కాలనీలో ఉండే రజాక్ 2012 అక్టోబర్ 10న ఆత్మహత్య చేసుకున్నాడు. గత ఆదివారం జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారులు అరెస్టు చేసిన ఐసిస్ ఉగ్రవాద అనుమానితుడు అబ్దుల్లా బాసిత్ మేనమామ సలావుద్దీన్ సైతం ఘట్కోపర్ పేలుళ్ల కేసులో నిందితుడే. నల్లగొండకు చెందిన సలావుద్దీన్ స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా (సిమి) నార్త్రన్ రీజియన్ కమాండర్‌గా పని చేస్తూ మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటకల్లో సిమి కార్యకలాపాల్లో కీలక పాత్ర పోషించాడు. ఆపై రెండేళ్ల పాటు సిమికి ఆలిండియా చీఫ్‌గా వ్యవహరించాడు. 2001లో సిమిని కేంద్ర నిషేధించిన తరవాత సలావుద్దీన్ దుబాయ్‌కు మకాం మార్చాడు. అక్కడ ఉంటూనే ఘట్కోపర్ పేలుళ్లకు సహకరించాడు. 2011లో కేరళలో చిక్కిన ఇతడు జైలు నుంచి బయటకు వచ్చాడు. 2014 అక్టోబర్‌లో నల్లగొండ నుంచి వస్తూ రోడ్డు ప్రమాదంలో మరణించాడు. ఘట్కోపర్ పేలుళ్ల కేసుకు సంబంధించి రజాక్, సలావుద్దీన్‌పై ఉన్న అభియోగాలు వారు మరణించడానికి ముందే అక్కడి కోర్టులో వీగిపోయాయి. -
కోదాడలో ఉగ్రవాది అరెస్టు
కర్ణాటక బాంబు పేలుళ్ల కేసులో నిందితుడు సాక్షి ప్రతినిధి, నల్లగొండ/బెంగళూరు: పదహారేళ్ల క్రితం కర్ణాటకలో ఏక కాలంలో వివిధ చోట్ల బాంబు పేలుళ్లకు పాల్పడిన ఘటనలో ఉగ్రవాది షేక్ అమీర్ ఆలీ ఆ రాష్ట్ర సీఐడీ అధికారులకు పట్టుబడ్డాడు. కర్ణాటక రాష్ట్ర అదనపు డీజీపీ ప్రతాప్‌రెడ్డి నేతృత్వంలోని అధికారులు తెలంగాణ పోలీసుల సహకారంతో నల్లగొండ జిల్లా కోదాడలో సోమవారం రాత్రి అమీర్‌ను అరెస్టు చేశారు. దీన్దార్ అంజుమాన్ సంస్థ పేరుతో 2000 జూలైలో బెంగళూరులోని జేజే నగర్, హుబ్లీ, కలబుర్గీలో ఏక కాలంలో కొంతమంది బాంబు పేలుళ్లకు పాల్పడ్డారు. ఈ పేలుళ్ల వెనుక 29 మంది ఉన్నట్లు పోలీసు దర్యాప్తులో తేలింది. వీరిలో 23 మంది పట్టుబడి వివిధ జైళ్లలో శిక్ష అనుభవిస్తున్నారు. మిగిలిన ఏడుగురిలో ఐదుగురు పాకిస్తాన్‌కు చెందిన వారు. మిగిలిన ఇద్దరిలో అమీర్ తాజాగా పట్టుబడగా.. మరొకరు పరారీలో ఉన్నారు. అలీ ఏపీలోని కృష్ణా జిల్లాకు చెందినవాడు. అప్పట్లో అతనిపై నాన్‌బెయిలబుల్ వారెంట్ కూడా జారీ అయింది. అప్పటి నుంచి అజ్ఞాతంలోనే ఉంటున్నాడు. కాగా, అలీ ఐదేళ్లుగా కుటుంబ సభ్యులతో కలసి కోదాడలోనే నివాసం ఉన్నట్లు తెలిసింది. పట్టణంలోని రెహనాజ్ హెల్త్ సెంటర్ పేరిట క్లినిక్‌ను నిర్వహిస్తున్నారు.