ఈడీ కార్యాలయంలో చీకోటి
సాక్షి, హైదరాబాద్: క్యాసినోవాలా చీకోటి ప్రవీణ్ హవాలా మార్గంలో మళ్లించిన సొమ్మెవరిది? అంత మొత్తంలో నగదు ఏ దేశానికి తరలించారన్న వివరాలను రాబట్టేందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సోమవారం అతనితో పాటు మరికొందర్ని ప్రశ్నించింది. ఐదు రోజులక్రితం చీకోటితో పాటు, మాధవరెడ్డి నివాసాల్లో సోదాలు నిర్వహించిన ఈడీ కీలక ఆధారాలు సేకరించింది. విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో చీకోటితో పాటు మాధవరెడ్డి, బాబులాల్ అగర్వాల్, గౌరీశంకర్, సంపత్ బషీర్‌బాగ్‌లోని కార్యాలయంలో ఈడీ ఎదుట హాజరయ్యారు. ఉదయం 10 గంటలకు ప్రారంభమైన విచారణ అర్ధరాత్రి వరకు కొనసాగింది.
క్యాసినో కాకుండా..
విశ్వసనీయ సమాచారం మేరకు.. నేపాల్, ఇండోనేసియా, సింగపూర్, శ్రీలంక తదితర దేశాల్లో క్యాసినో ఆడిస్తూ చేసిన హవాలాతో పాటు మరికొన్ని లావాదేవీలపై చీకోటితో పాటు మాధవరెడ్డిని ఈడీ ప్రశ్నించింది. ఒకేసారి రూ.27 కోట్ల మేర జరిపిన లావాదేవీలు ఎవరికి సంబంధించినవి, అవి క్యాసినో వ్యవçహారంలోనివా? లేక విదేశాలకు తరలించేందుకు ఎవరైనా ఇచ్చిన డబ్బా? అన్న కోణంలో లోతుగా ప్రశ్నించింది. జనవరి నుంచి జూలై వరకు కస్టమర్లను తీసుకెళ్లి క్యాసినో ఆడించగా వచ్చిన డబ్బుతో పాటు ఇతర లావాదేవీలకు సంబంధించిన వివరాలు రాబట్టింది.
చిట్‌ఫండ్ డబ్బు ఎక్కడికెళ్లింది?
వరంగల్ జిల్లా కేంద్రానికి చెందిన ఓ చిట్‌ఫండ్ సంస్థకు సంబంధించిన డబ్బును హవాలా ద్వారా ఎక్కడికి మళ్లించారని అడిగింది. ఈ వ్యవహారంతో చిట్‌ఫండ్ యజమానితో పాటు ఉమ్మడి కరీంనగర్‌లోని ఓ నూతన జిల్లా జెడ్పీ చైర్మన్‌కున్న లింకులపై ఆరా తీసింది. ఆ జెడ్పీ చైర్మన్, చిట్‌ఫండ్ యజమాని ఈడీ సోదాలకు ఒక్కరోజు ముందు చీకోటితో ఆయన నివాసంలోనే భేటీ అయినట్టు ఈడీ గుర్తించింది. పెద్ద మొత్తంలో నగదును హైదరాబాద్ నుంచి దుబాయ్‌కి హవాలా ద్వారా మళ్లించినట్టు అనుమానిస్తోంది. ఆ చిట్‌ఫండ్ చాటున జరుగుతున్న చీకటి దందా ఏంటన్న దానిపై ఆరా తీసింది.
సంపత్‌తో డీల్స్ ఏంటి?
చీకోటి ప్రవీణ్, మాధవరెడ్డి మొబైల్స్‌లోని వాట్సాప్ మెసెంజర్లలో హవాలా లావాదేవీలకు సంబంధించి కోడ్ భాషల్లో జరిగిన వ్యవహారంపై ఈడీ ప్రధానంగా దృష్టి సారించింది. అందులో భాగంగా సంపత్ అనే వ్యక్తితో చాటింగ్‌ను గుర్తించింది. సంపత్, మాధవరెడ్డి, ప్రవీణ్ మధ్య నిత్యం డబ్బు లావాదేవీలకు సంబంధించిన సందేశాలున్నట్టు గుర్తించింది. ఈ నేపథ్యంలో సంపత్ ఎవరు? అతడితో జరుగుతున్న డీల్ ఏంటన్న దానిపై ఆరా తీసింది. హవాలా కోసం డబ్బును సంపత్‌కు అందించేవారా? లేక సంపత్ కేంద్రంగానే హవాలా జరిగిందా? అన్న వ్యవహారంపై మరింత క్లారిటీ కోసం ఈడీ ఈ ఇద్దరిని ప్రశ్నించినట్టు తెలుస్తోంది.
దేశాలు దాటిన మొత్తమెంత?
మరోవైపు చీకోటి, సంపత్‌ను ఎదురెదురుగా కూర్చోబెట్టి మరీ ఈడీ విచారించింది. రూ.27 కోట్ల వ్యవహారంతో పాటు క్యాసినోలకు సంబంధించిన డబ్బు ఎవరికిచ్చారు? ఎంత మొత్తంలో హవాలా ద్వారా దేశాలు దాటించారు? తదితర అంశాలపై ఈడీ జాయింట్ డైరెక్టర్ అభిషేక్ గోయల్
ప్రశ్నించినట్టు తెలిసింది. కాగా గౌరీ శంకర్‌ను మరో ఈడీ అధికారి ప్రశ్నించారు. చీకోటి వ్యవహారాలను దగ్గరుండి చూసుకునే గౌరీ శంకర్‌ను కూడా హవాలా వ్యవహారంపైనే ప్రశ్నించింది.
జిగ్రీదోస్త్ బాబులాల్ అగర్వాల్..
క్యాసినోల నిర్వహణతో పాటు పేకాట ఆడించడంలో చీకోటికి కీలక అనుచరుడిగా కొన్నాళ్ల పాటు కొనసాగిన అతని ఆప్తమిత్రుడు బాబులాల్ అగర్వాల్‌ను ఈడీ విచారించడం ఆసక్తికరంగా మారింది. 2017లో ట్యాంక్‌బండ్‌లోని మ్యారియట్ హోటల్లో పేకాట ఆడిస్తుండగా టాస్క్‌ఫోర్స్ పోలీసులు చీకోటితో పాటు బాబులాల్‌ను అరెస్ట్ చేశారు. ఆ తర్వాత బాబులాల్ ఎక్కడా పెద్దగా కనిపించలేదు. కాగా తాజా కేసులో వెలుగులోకి రావడం, ఈడీ ప్రశ్నించడంతో.. అగర్వాల్ పాత్ర ఉత్కంఠ రేపుతోంది. అగర్వాల్‌కు చాలామంది పారిశ్రామిక వేత్తలు, ప్రముఖులతో మంచి పరిచయాలున్నాయి. అతన్ని ఈడీ ప్రశ్నిస్తుండటంతో వీరందరిలో కలవరం మొదలైనట్టు తెలిసింది.
ప్రముఖులకు పారితోషికాలపై దృష్టి
చీకోటి, మాధవరెడ్డికి చెందిన 6 బ్యాంకు ఖాతాలను ఈడీ గుర్తించింది. వాటి స్టేట్‌మెంట్లతో పాటు లాకర్ల వ్యవహారంపై కూడా దృష్టి సారించింది. మంత్రులు, పలువురు ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, సినీ సెలబ్రిటీలకు చెల్లించిన పారితోషికాల వ్యవహారంపై కూడా దృష్టి సారించినట్టు తెలిసింది. చీకోటి మొబైల్ వాట్సాప్ సందేశాల ప్రకారం ప్రస్తుతం నలుగురు ప్రముఖులకు నోటీసులు జారీ చేయాలని ఈడీ నిర్ధారణకు వచ్చినట్టు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment