సాక్షి, హైదరాబాద్: క్యాసినోవాలా చీకోటి ప్రవీణ్‌కుమార్‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కేసు దర్యాప్తులో కీలక పరిణామం చోటుచేసుకుంది. క్యాసినో వ్యవహారంలో హవాలా ద్వారా డబ్బును నేపాల్‌తోపాటు ఇండోనేసియా తదితర దేశాలకు తరలించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న చీకోటి ప్రవీణ్, మాధవరెడ్డి వాట్సాప్ చాట్‌లలో ప్రముఖుల జాబితా వెలుగులోకి రావడం సంచలనం రేపుతోంది.
ప్రవీణ్ మొబైల్ వాట్సాప్ మెసెంజర్‌లో తెలంగాణకు చెందిన ఓ మంత్రి, మరో ముగ్గురు ఎమ్మెల్యేలు క్యాసినో వ్యవహారంలో చేసిన చాటింగ్ కీలకంగా మారినట్లు ఈడీ అధికార వర్గాలు వెల్లడించాయి. జూన్ 10 నుంచి నేపాల్‌లో జరిగిన క్యాసినో వ్యవహారంలో ఎక్కడ, ఎవరికి ఎంత డబ్బు డిపాజిట్ చేయాలనే అంశాలకు సంబంధించి వారి మధ్య జరిగిన చాటింగ్ వివరాలను ఈడీ గుర్తించినట్లు తెలిసింది.
ఈ లావాదేవీల వ్యవహారం ఇప్పుడు మంత్రితోపాటు మరో ముగ్గురు ఎమ్మెల్యేల మెడకు చుట్టుకొనేలా కనిపిస్తోంది. ప్రవీణ్, ఆ నలుగురి మధ్య జరిగిన వాట్సాప్ చాట్‌లను రిట్రీవ్ చేసిన ఈడీ అధికారులు.. వాటిని తర్జుమా చేసి ఢిల్లీలోని ఈడీ కేంద్ర కార్యాలయానికి పంపినట్లు విశ్వసనీయంగా తెలిసింది. వారికి నోటీసులు ఇచ్చేందుకు కేంద్ర కార్యాలయం నుంచి అనుమతి లభిస్తే మంత్రి, ఎమ్మెల్యేలు, వారి సన్నిహితులకు నోటీసులు జారీ చేయనున్నట్లు ఈడీ వర్గాలు వెల్లడించాయి. ఒకవేళ సోమవారంలోగా అనుమతి వస్తే అదేరోజు లేదా మంగళవారం నుంచి ఈడీ ఎదుట హాజరుకావాలని నోటీసులు జారీ చేస్తామని ఈడీ వర్గాలు స్పష్టం చేశాయి.
ఓవరాక్షన్‌తో బట్టబయలు...
మంత్రితోపాటు ముగ్గురు ఎమ్మెల్యేల వ్యవహారం వారి ఓవరాక్షన్ వల్లే వెలుగులోకి వచ్చినట్లు తెలిసింది. చీకోటి ప్రవీణ్‌కుమార్‌తో ఫొటోలు, వీడియోలు తీసుకున్న ఆయా ప్రముఖులు వాటిని ఇన్‌స్ట్రాగామ్, ఫేస్‌బుక్, యూట్యూబ్‌లలో పోస్టు చేయడమే ఈడీకి అధారాలు చిక్కేలా చేసినట్లు తెలుస్తోంది. వీడియో ఫుటేజీల్లో చీకోటితో అత్యంత సన్నిహితంగా వ్యవహరించడం, పుట్టినరోజుతోపాటు ఇతర వేడుకల్లో ఆయనతో కలిసి నృత్యాల వంటి వ్యవహారాలే కొంపముంచినట్లు తెలిసింది. వారి ప్రొఫైళ్లను గుర్తించిన ఈడీ అధికారులు.. చీకోటి మొబైల్ వాట్సాప్ నుంచి డిలీట్ చేసిన డేటాను తిరిగి రిట్రీవ్ చేయడంతో చీకోటికి, ప్రముఖులకు మధ్య జరిగిన సందేశాలు ఏకంగా హవాలా లావాదేవీలను బయటపెట్టినట్లు తెలుస్తోంది.
రాజకీయంగా సంచలనమే...
ఓ మంత్రి, ముగ్గురు ఎమ్మెల్యేలకు ఈడీ నోటీసులు జారీ చేస్తే రాష్ట్రంలో పెను సంచనలమే అవుతుందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. చీకోటి వ్యవహారంలో ఇప్పటికే చాలా మంది రాజకీయ ప్రముఖులున్నారని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఓ మంత్రితోపాటు ముగ్గురు ఎమ్మెల్యేలకు నోటీసులు వస్తే ప్రభుత్వానికి ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుందనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. ఈడీ విచారణతో ఆ మంత్రి, ఎమ్మెల్యేలకు ఇబ్బందులు తప్పవన్న వాదన బలంగా వినిపిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment