
న్యూఢిల్లీ: క్రాస్ లైన్ ఆఫ్ కంట్రోల్ (ఎల్ఓసి) సరిహద్దుల్లో వాణిజ్య వ్యాపారులపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) మంగళవారం దాడులు చేసింది. పుల్వామా, శ్రీనగర్ జిల్లాల్లో ఎన్‌ఐఏ అధికారులు ఈ దాడులు నిర్వహించారు. కెల్లర్ ప్రాంతంలోని వ్యాపారి గులాం అహ్మద్ వానీ ఇంటిపై ఎన్‌ఐఏ అధికారులు, జమ్మూ కాశ్మీర్ పోలీసుల సంయుక్త బృందం కలసి దాడులు చేసినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. పుల్వామాలో సీఆర్‌పీఎఫ్ సిబ్బందిపై 2019 ఫిబ్రవరి 14 న ఉగ్రదాడి జరగక ముందే అహ్మద్ వానీ క్రాస్ ఎల్‌ఓసి వాణిజ్యంలో పాల్గొన్నట్లు ఎన్‌ఐఏ పేర్కొంది.
ఉగ్రవాదలకు అందుతున్న నిధులపై ఎన్‌ఓఏ ప్రారంభించిన దర్యాప్తులో భాగంగా ఈ దాడులు జరిగాయి. ఈ కేసుకు సంబంధించి ఇప్పటివరకు ప్రసిద్ధ కాశ్మీరీ వ్యాపారవేత్త జహూర్ వతాలీ, షబ్బీర్ షా, ఆసియా ఆండ్రాబీ, మసారత్ ఆలం సహా కీలకమైన వేర్పాటువాద నాయకులను ఎన్‌ఐఏ ఇప్పటికే అరెస్టు చేసింది. కాశ్మీర్‌లో ఉగ్రవాద కార్యకలాపాలను ప్రోత్సహించడానికి పాకిస్తాన్ నుంచి నిధులు అందుకున్నారన్న ఆరోపణలపై వతాలీని 2017లో ఎన్‌ఐఏ అరెస్టు చేసింది. అతడిని వేర్పాటువాద నాయకుడు సయ్యద్ అలీ షా గీలానీకి సన్నిహితుడిగా పేర్కొంటారు.
ఎన్‌ఐఏ దర్యాప్తులో వతాలీకి కోట్ల రూపాయల విలువైన ఆస్తులు ఉన్నట్లు తేలింది. బ్రిటన్, దుబాయ్‌లలో వతాలీకి అనేక ఆస్తులు ఉన్నట్లు గుర్తించారు. ఉగ్రవాద నిధుల కేసుకు సంబంధించి అరెస్టయిన వేర్పాటువాదులందరూ ప్రస్తుతం ఢిల్లీ తీహార్ జైలులో ఉన్నారు. జమ్మూ కాశ్మీర్‌లో నిరసన కార్యక్రమాలు నిర్వహించడానికి విదేశాల నుంచి నిధులు, విరాళాలు సేకరిస్తున్నట్లు దుఖ్తరన్-ఎ-మిల్లతాద్ సంస్థ చీఫ్ ఆసియా ఆండ్రాబీ, మసారత్ ఆలం విచారణలో అంగీకరించినట్లు ఎన్‌ఐఏ పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment