- సర్వశక్తులు ఒడ్డుతున్న సీఎం
- లోక్‌సభ ఎన్నికల్లో మెజారిటీ సీట్లే లక్ష్యం
సాక్షి, బెంగళూరు : రానున్న లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మెజారిటీ సీట్లు సాధించడానికి ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సర్వశక్తులు ఒడ్డుతున్నారు. అందులో భాగంగా అసంతృప్త ఎమ్మెల్యేలను దారికి తెచ్చుకోవడానికి నిధుల గాలం వేయనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఎన్నికల వేళ తమకు సహకరించే ఇతర పార్టీ నాయకులకు కూడా భారీ తాయిలాలు ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. మంత్రిమండలిలో స్థానం దక్కని కొంతమంది సీనియర్ నాయకులు సీఎంతో పాటు అధిష్టానంపై గుర్రుగా ఉన్న సంగతి తెలిసిందే. తమ నియోజక వర్గాల్లో అభివృద్ధి పనులు జరగకపోవడానికి ఇన్‌చార్జ్‌మంత్రుల నిర్లక్ష్యవైఖరే కారణమని మరికొందరు సీఎం కు బహిరంగ లేఖలు కూడా రాశారు.
ఈ విధంగా వివిధ కారణాలతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చాలా మంది పార్టీ కార్యక్రమాల్లో అంటిముట్టనట్లు వ్యవహరిస్తున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే రానున్న లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్ర కాంగ్రెస్‌కు తీరని నష్టం జరిగే ప్రమాదం ఉందని భావించి అసంతృప్త ఎమ్మెల్యేలను మచ్చిక చేసుకునేందుకు వారి నియోజక వర్గాల్లో అభివృద్ధి పనుల పేరుతో భారీగా నిధులు ఇవ్వాలని సీఎం నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
ఒక దెబ్బకు రెండు పిట్టలు...
నిధుల విడుదల వల్ల అసంతృప్త ఎమ్మెల్యేలను మచ్చిక చేసుకోవడంతో పాటు రాష్ట్ర ప్రజల దృష్టిని ఆకర్షిస్తే ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు పడే ఓట్లు కొంత వరకూ పెరిగే అవకాశం ఉందనేది సిద్ధరామయ్యతో పాటు కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నాయకుల ఆలోచన. దీనిని అమలు చేసేందుకు గ్రామీణ ప్రాంతాల్లో చేపట్టాల్సిన అభివృద్ధి పనులు, అవసరమయ్యే నిధులను నియోజకవర్గాల వారిగా ఓ నివేదిక తయారు చేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇప్పటికే కలెక్టర్లకు ఆదేశాలు అందాయి. ఎన్నికల కోడ్ అమల్లోకి రావ డానికి ముందే నిధుల విడుదల కార్యక్రమాన్ని ముగించాలని సిద్ధరామయ్య పట్టుదలతో ఉన్నట్లు సీఎం కార్యాలయ వర్గాలు చెబుతున్నాయి.
ఇతర పార్టీల నాయకులకు గాలం
ఇతర పార్టీ నాయకులను మచ్చిక చేసుకోవడానికి ఢిల్లీ పెద్దల అనుమతితో నిధుల గాలాన్ని సిద్ధరామయ్య ఉపయోగించబోతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా సమాజ్‌వాదీ పార్టీలో ఉన్న చెన్నపట్టణ ఎమ్మెల్యే యోగీశ్వర్‌ను తిరిగి కాంగ్రెస్‌లో చేర్చుకోవడానికి అటు రాష్ట్ర కాంగ్రెస్ నాయకులతో పాటు ఢిల్లీ పెద్దలు అంగీకరించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. యోగీశ్వర్ సహకారం లేనిదే బెంగళూరు గ్రామీణ పార్లమెంటు స్థానం గెలుచుకోవడం దాదాపు అసాధ్యమే. మొన్న జరిగిన లోక్‌సభ ఉప ఎన్నికల్లో కూడా యోగీశ్వర్ సహకారం వల్లే డీ.కే శివకుమార్ సోదరుడు డీ.కే సురేష్ బెంగళూరు గ్రామీణ పార్లమెంటు స్థానం నుంచి గెలుపొందారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఆయన కాంగ్రెస్ తీర్థం తీసుకోవడానికి అంగీకరిస్తే చెన్నపట్టణ నియోజకవర్గ అభివృద్ధికి పెద్దమొత్తంలో నిధులతో పాటు పార్టీలోనూ, ప్రభుత్వంలో మంచి స్థానం ఇచ్చే విషయం పై కూడా స్పష్టత ఇచ్చారని కాంగ్రెస్ నాయకులే చెబుతున్నారు.