మండుతున్న ఉద్యాననగరి
35.5 డిగ్రీల సెల్సియస్ నమోదు
కలబుర్గిలో 40డిగ్రీలు
బెంగళూరు: సూర్యతాపం రాష్ట్రాన్ని వేడెక్కిస్తోంది. మార్చి రాకనే ఎండలు మండిపోతున్నాయి. ముఖ్యంగా ఉద్యాననగరిగా పేరుగాంచిన బెంగళూరుతో సహా పలు పట్టణాల్లో గత పదేళ్లలో ఎప్పుడూ లేనంత ఎక్కువగా పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాత్రి ఉష్ణోగ్రతల్లో కూడా స్వల్ప పెరుగుదల కనిపిస్తోంది. బెంగళూరులో సాధారణ ఉష్ణోగ్రత 31.5 డిగ్రీల సెల్సియస్ కాగా, గత సోమవారం ఉష్ణోగ్రతలో నాలుగుడిగ్రీల పెరుగుదల నమోదు చేసుకుని 35.5 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. ఫిబ్రవరి నెలకు సంబంధించి గత పదేళ్లలో ఇదే అతి ఎక్కువ పగటి ఉష్ణోగ్రత. అంతకు ముందు 2005లో ఫిబ్రవరి నెలలో 35.9 డిగ్రీల సెన్సియస్ ఉష్ణోగ్రత నమోదు కావడమే ఇప్పటి వరకూ ఉన్న రికార్డు. ఒక్క బెంగళూరే కాక రాష్ట్రంలోని పలు చోట్ల రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లు వాతావరణ శాఖ చెబుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా హైదరాబాద్-కర్ణాటక ప్రాంతాల్లోని జిల్లాల్లో ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
బిసిలునాడు (వేసవి ప్రాంతం)గా పేరుగాంచిన కలబుర్గీలోలో సాధారణ ఉష్ణోగ్రత 35 డిగ్రీలు కాగా ప్రస్తుతం నలభై డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యింది. ఇప్పటి వరకూ ఇదే అత్యంత ఎక్కువ ఉష్ణోగ్రత. అంతకు ముందు అత్యధికంగా 39.4 డిగ్రీల ఉష్ణోగ్రత రెండేళ్లక్రితం నమోదైంది. మిగిలిన ప్రాంతాల్లో కూడా ఇదే పరిస్థితి ఉంది. ఈ విషయమై భారత వాతావరణ శాఖ బెంగళూరు విభాగం అధిపతి గీతా అగ్నిహోత్రి మాట్లాడుతూ.... ‘ఖరీఫ్, రబీల్లో సరైన వర్షాలు కురవక పోవడంతో వాతావరణంలో తేమశాతం దారుణంగా పడిపోయింది. దీంతో వేసవి ప్రారంభంలోనే ఇటువంటి ఎండలను చవిచూడాల్సి వస్తోంది. రానున్న కాలంలో ఎండలు మరింత మండిపోయే అవకాశం ఉంది. మా అంచనా ప్రకారం 2000 ఏడాదికి ముందు ఉన్న ఉష్ణోగ్రతలు నమోదు కావచ్చు.’ అని అభిప్రాయపడ్డారు.
ప్రతాపం
Published Thu, Feb 25 2016 1:54 AM | Last Updated on Sun, Sep 3 2017 6:20 PM
Advertisement