ఒట్టిపోయాయి..
చెరువులన్నీ ఖాళీ
= 3,557 చిన్న తరహా చెరువుల్లో ఎనిమిదింటిలో మాత్రమే పూర్తిస్థాయిలో నీరు
= రాష్ట్రమంతటా వర్షాభావమే
= కోస్తాలో సాధారణం కంటే 50 శాతం తక్కువ
= అడుగంటుతున్న భూగర్భ జలాలు
= ఫ్లోరిన్ బారిన ప్రజానీకం
సాక్షి, బెంగళూరు : రాష్ట్రంలో తీవ్ర వర్షాభావం నెలకొంది. చెరువులన్నీ బీళ్లు వారాయి. నైరుతి రుతు పవనాలు కనుచూపు మేరలో కూడా లేకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం మేఘ మథనం దిశగా కూడా ఆలోచన సాగిస్తోంది. రాష్ట్ర విపత్తు నిర్వహణా కేంద్రం సమాచారం ప్రకారం... 3,557 చిన్న తరహా చెరువులు ఉండగా కేవలం ఎనిమిది మాత్రమే నిండాయి. 45 చెరువుల్లో మాత్రం సగానికి పైగా నీరు చేరింది. 2,345కు పైగా చెరువుల్లో చుక్క నీరు లేదు. 1.020 చెరువుల్లో 30 శాతం నీరుంది.
బెంగళూరులో రెండు, కోలారులో ఒకటి, చిత్రదుర్గలో ఐదు చెరువులు మాత్రమే నిండాయి. రాష్ట్రంలోని మొత్తం చెరువుల ఆయకట్టు సుమారు 4,22,566 ఎకరాలు. ఉత్తర కర్ణాటకలో హావేరి, ధార్వాడ, ఉత్తర కన్నడ, బెల్గాం బిజాపుర మినహా మిగిలిన జిల్లాలోని చెరువులన్నీ ఎండిపోయాయి. తుమకూరు, చిత్రదుర్గ, శివమొగ్గ, రామనగర, బెంగళూరు గ్రామీణ, బెంగళూరు నగర, హాసన జిల్లాల్లో చాలా చెరువులు 30 శాతం మాత్రమే నిండాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే తాగు నీటికి మనుషులతో పాటు జీవాలు కూడా అవస్థలు పడాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తమవుతోంది.
ఆశాభావం..
రాష్ర్టంలో ఈ నెల 11 నుంచి పది రోజుల పాటు బాగా వర్షాలు పడే అవకాశాలున్నాయని విపత్తు నిర్వహణా కేంద్రం డెరైక్టర్ వీఎస్. ప్రకాశ్ తెలిపారు. తర్వాత కూడా ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశాలున్నాయని చెప్పారు. గత రెండు రోజులుగా రాష్ట్రమంతటా ఆకాశం మేఘావృత్తమై ఉందని, మరో రెండు రోజుల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని ఆయన వివరించారు.
అంతటా కరువే..
భారత వాతావరణ శాఖ కర్ణాటక విభాగం గణాంకాల మేరకు ముంగారు ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకూ (జూన్ 1 నుంచి జులై 8 వరకూ) రాష్ట్రంలోని మూడు వాతావరణ రీజియన్‌ల్లోనూ వర్షా భావ (డెఫిషియంట్) పరిస్థితులు ఏర్పడ్డాయి. సౌత్ ఇంటీరియర్ కర్ణాటక ప్రాంతంలో 202 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదుకావాల్సి ఉంటే 134 మిల్లీమీటర్ల వర్షం (34%) మాత్రమే కురిసింది. ఇక నార్త్ ఇంటీరియర్ కర్ణాటకలో 135.5 గాను 83.2 మిల్లీమీటర్లు(39%), కోస్టల్ కర్ణాటకలో 1172.2 గాను 597.1 మిల్లీమీటర్ల (49%) వర్షపాతం నమోదైంది. ఇదిలా ఉండగా ఈ నెల 11 నుంచి దాదాపు వారం.. పది రోజుల పాటు రాష్ట్రంలో ఓ మోస్తారు వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.