దెయ్యం కట్టిన ఆలయం!
బొమ్మావరలో ఆకట్టుకుంటున్న సుందరేశ్వరదేవాలయం
రాష్ట్రంలోనే ఎత్తై శివలింగం
600 సంవత్సరాల చరిత్ర
దొడ్డబళ్లాపురం: దెయ్యాలు ఆలయాన్ని నిర్మించాయా? అంటే అవునంటున్నారు కర్ణాటక రాష్ట్రంలోని బొమ్మావర వాసులు. ఇది నిజమో, అబద్దమోకానీ ఈ ఆలయాన్ని చూడాలంటే దొడ్డబళాపురం-దేవనహళ్ళి మార్గం మధ్యలో వచ్చే బొమ్మావర వెళ్లాల్సిందే. ఈ గ్రామంలోనే ఉంది దెయ్యాలు కట్టిన సుందరేశ్వర దేవాలయం. మామూలుగా అన్ని దేవాలయాలపై మనకు కనిపించేది దేవుళ్ళ రాతి శిల్పాలు, కామసూత్ర భంగిమలు లాంటివి. అయితే ఈ దేవాలయంపై దెయ్యాల ప్రతిమలు కనిపిస్తాయి. రాక్షసుల నమూనాలు చెక్కబడి ఉన్నాయి. దేవాలయానికి సంబంధించి గ్రామంలోని వృద్ధులను కదిలిస్తే ఆసక్తికర సంగతులు తెలుస్తాయి. ఈ దేవాలయం సుమారు 600 సంవత్సరాల క్రితం నిర్మించిందట. ఆ కాలంలో మహా మాంత్రికుడిగా పేరుగాంచిన దెయ్యాలబుచ్చయ్య ఈ గ్రామంలో దేవాలయం నిర్మించాలని తీర్మానించి నిర్మాణ పనులు చేపట్టారు.
అయితే గ్రామంలో అప్పుడు దెయ్యాలు ఎక్కువగా సంచరించేవట. పగలు కట్టిన దేవాలయాన్ని రాత్రికి రాత్రి అల్లరి చేసి కూలదోసేవట. దీంతో ఆగ్రహించిన బుచ్చయ్య దెయ్యాలను బంధించి వాటి వెంట్రుకలను కోసి రోకలికి కట్టి దగ్గర పెట్టుకున్నాడట. తమ వెంట్రుకలు ఇవ్వాలని దెయ్యాలు బుచ్చయ్యను బ్రతిమాలుకోగా కూలదోసిన దేవాలయాన్ని తిరిగి కట్టివ్వాలని బుచ్చయ్య దెయ్యాలను ఆదేశించాడట. దీంతో దిగివచ్చిన దెయ్యాలు ఒకే రాత్రిలో దేవాలయాన్ని నిర్మించి ఇచ్చాయట. ఆనాటి నుంచి ఈ దేవాలయాన్ని దెయ్యాలు కట్టిన దేవాలయంగా జనం పిలవనారంభించారు. దెయ్యాలు కట్టినది కాబట్టే దేవాలయంపై దెయ్యాల ప్రతిమలున్నాయంటారు గ్రామస్తులు. అయితే ఈ దేవాలయం గర్భగుడిలో దేవుడిని ప్రతిష్టించలేదు.
50 సంవత్సరాల క్రితం గ్రామ శివారులో ఉన్న తాగునీటి చెరువు లో తవ్వుతండగా 8 అడుగుల శివలింగం లభించిందట. ఆ లింగాన్ని తీసుకువచ్చి ఖాళీగా ఉన్న దేవాలయంలో ప్రతిష్టించి సుందరేశ్వర దేవాలయంగా నామకరణం చేసారు. ఇంత ఎత్తైన లింగం రాష్ట్రంలోనే ఎక్కడా లేదని, దేశంలో ఐదు చోట్ల మాత్రమే ఇంత ఎత్తైన లింగాలు ఉన్నాయని గ్రామస్తులు అంటున్నారు. దెయ్యాల బాధ ఉన్నవారు ఈ దేవాలయాన్ని దర్శిస్తారట.