దొడ్డబళ్లాపురం, న్యూస్‌లైన్ : రాష్ట్రంలో రెండవ అతి పెద్ద మర్రి చెట్టుగా ఖ్యాతి కెక్కిన తాలూకా పరిధిలోని సున్నఘట్టనహళ్లి గ్రామంలోని దొడ్డాలదమర, దేవుడి చెట్టుగా పిలవబడే భారీ మర్రి చెట్టు సోమవారం ఉదయం అనూహ్యంగా నేలకూలింది. గతంలో భారీ కొమ్మలు మాత్రం పెనుగాలులకు, భారీ వర్షాలకు విరిగిపడినా చెట్టుకు ఎటువంటి హానీ జరిగేదికాదు. అయితే సోమవారం చెట్టు మొదలుతో పాటు వేళ్లతో పెకలివచ్చి మరీ కుప్పకూలింది. చెట్టు మొదలు వద్ద పెద్ద గ్రనేడ్ పేలిన చందాన లోతైన గొయ్యి ఏర్పడింది.
చెట్టు చరిత్ర : సుమారు 300 సంవత్సరాల క్రితం హుచ్చప్ప అనే వ్యక్తి తన స్థలంలో నాటిన చిన్న మర్రి చెట్టు మొక్క అనతి కాలంలోనే బృహదాకారంగా పెరిగింది. ఊడలను నేలలోకి దింపుతూ వాటి ఆధారంతో మూడు ఎకరాలకు విస్తరించి పోయింది. దీన్ని చూసి పరవ శించిపోయిన స్థానికులు చెట్టు విస్తరించిన స్థలాన్ని వదిలేసారు. దీంతోపాటు దేవుడిచెట్టుగా నామకరణం చేసి చెట్టుకింద మునేశ్వర స్వామి దేవాలయాన్ని కట్టి నిత్యం పూజలు చేయనారంభించారు. అంతేకాకుండా ప్రతీ ఏడాది ఇక్కడ జాతర కూడా నిర్వహిస్తారు.
ఈ చెట్టుకున్న మరో ప్రత్యేకత ఏంటంటే వివిధ జాతుల పక్షులు అనేకం ఈ చెట్టుపై గూడు కట్టుకుని జీవిస్తున్నాయి. ఇక గబ్బిలాలు అయితే చెట్టు ఆకులు కూడా కనబడన ంతగా కొమ్మలకు వేలాడుతుంటాయి. వేలసంఖ్యలో తేనెతుట్టెలు కట్టబడి ఉన్నాయి. కోతులు వందల సంఖ్యలో జీవిస్తున్నాయి. ఇటీవల కాలంలో దొడ్డాలదమర ఒక పర్యాటక కేంద్రంగా తయారైంది. ప్రసిద్ధ పర్యాటక కేంద్రం నంది కొండకు వచ్చే, చాలా మంది యాత్రీకులు ఇక్కడకు వచ్చి కాసేపు సేదతీరివెళ్లేవారు.
రాష్ట్రం నలు మూలల నుండి కూడా ఈ చెట్టును చూడడానికి వచ్చేవారు. ఈ చెట్టుతో అనుబంధాన్ని చుట్టుపక్కల గ్రామాలలోని వృద్ధులను కదిలిస్తే ఎంతో సంబరంగా కబుర్లు చెబుతారు. తమ జీవిత కాలంలో ఎక్కువ సమయాన్ని ఈ చెట్టువద్దే ఆడుతూపాడుతూ గడిపామని, అలాంటి చెట్టు ఇలా కుప్పకూలడం ఎంతో బాధకలిగిస్తోందని కన్నీళ్లు పెట్టుకున్నారు. చెట్టు నేలకూలడంతో వేల సంఖ్యలో పక్షులు ఆకాశంలో అరుస్తూ గిరికీలు కొట్టడం చూపరులను కంటతడి పెట్టించింది. తేనె తుట్టెలు చెదిరి తేనెటీగలు ఆ ప్రాంతంలో ముసురుకున్నాయి. ఈ చెట్టును సంరక్షించడం పట్ల ప్రభుత్వాలు నిర్లక్ష్యం చూపడం కూడా ఈ దుర్ఘటనకు కారణమని స్థానికులు ఆరోపించారు.
నేలకూలిన దొడ్డాలద మర
Published Tue, Sep 24 2013 4:09 AM | Last Updated on Fri, Sep 1 2017 10:59 PM
Advertisement
Advertisement