చింతామణి, న్యూస్‌లైన్ : నిధి కోసం సొంత మనుమరాలిని బలికి సిద్ధం చేసిన కిరాతక సంఘటన తాలూకాలోని ఎర్రయ్యగారిపల్లిలో వెలుగు చూసింది. స్థానికుల కథనం మేరకు... ఎర్రయ్యగారిపలికి చెందిన వెంకటరమణకు ఇద్దరు కూతుర్లు. తనపెద్ద కూతురు నాగమణిని చింతామణికి చెందిన జనార్ధనకు ఇచ్చి 12 సంవత్సరాల క్రితం వివాహం జరిపించాడు. వీరికి అనిచేతన(8) అనే కూతురు ఉంది. ఇటీవల వెంకరమణకు మేకపోతులపల్లికి చెందిన మంత్రగాడు బాషాతో పరిచయమైంది.
ఈ నేపథ్యంలోనే ఎర్రయ్యగారిపల్లిని వెంకరమణప్ప ఇంటి పక్కన ఉన్న పుట్ట కింద అపారమైన నిధి ఉందని, అమావాస్య నాడు జన్మించిన బిడ్డను బలిఇస్తే నిధిని సొంతం చేసుకోవచ్చంటూ వెంకటరమణప్పను బాషా నమ్మించాడు. దీంతో అమావాస్య నాడు జన్మించిన అనిచేతనపై వెంకరమణప్ప కన్ను పడింది. ఇదే విషయాన్ని బాషాకు చెప్పి బలికి అవసరమైన ఏర్పాటు చేయాలని సూచించాడు. ఇందుకు మంగళవారం రాత్రికి ముహూర్తం నిర్ణయించడంతో ఆ రోజు ఉదయమే అనిచేతనను పిలుచుకురమ్మని తన చిన్న కూతురు కళావతిని చింతామణికి పంపాడు. ఆమె వెళ్లి అనిచేతనను పిలుచుకుని వచ్చింది.
ఉదయం నుంచి ఇంటిలో క్షుద్రపూజలు చేస్తూ వచ్చారు. అక్కడ జరుగుతున్న హంగామా చూసి బాలిక భయపడింది. అనంతరం తనను బలి ఇవ్వబోతున్నట్లు తెలుసుకున్న అనిచేతన అక్కడి నుంచి తప్పించుకుని బస్సెక్కి చింతామణికి చేరుకుంది. ఇంటికి చేరుకున్న ఆమెకు భయంతో మాటలు రాలేదు. రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో కొద్దిగా స్థిమిత పడిన ఆమె అసలు విషయం తెలపడంతో స్థానికులతో కలిసి జనార్ధన వెళ్లి బాషాను పట్టుకుని చింతామణికి చేరుకున్నాడు. అనంతరం అందరి సమక్షంలో అతడికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. సంఘటనకు సంబంధించి బాషాను పోలీసులు విచారణ చేస్తున్నారు.
నరబలికి యత్నం
Published Thu, Dec 5 2013 3:14 AM | Last Updated on Sat, Sep 2 2017 1:15 AM
Advertisement
Advertisement