యువతకు వీర జవాన్ హనుమంతప్ప భార్య విన్నపం
నాగ్పూర్: ఇటీవల దేశ వ్యతిరేక కార్యకలాపాలు చోటుచేసుకోవడం తనను బాధించిందని వీర జవాన్ లాన్స్ నాయక్ హనుమంతప్ప భార్య మహాదేవి ఆవేదన వ్యక్తం చేశారు. నాగ్పూర్లో జరిగిన ఓ కార్యక్రమంలో మహాదేవి మాట్లాడుతూ.. దేశ వ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని యువతకు విన్నవించారు.
'నా భర్త హనుమంతప్పకు ఆర్మీలో చేరాలన్నది ఆశయం. ఆయన పోలీస్ ఉద్యోగానికి ఎంపికైనా, ఆర్మీలో చేరారు. ఇటీవల మన దేశంలో దేశ వ్యతిరేక కార్యకాలాపాలు చోటు చేసుకోవడం నాకు బాధ కలిగించింది. మనం భారత్లో జన్మించాం. మనం జీవించడానికి భరతమాత ఈ దేశాన్ని ఇచ్చింది. మనం దీన్ని దుర్వినియోగం చేస్తున్నాం. దేశం కోసం జీవితాన్ని అంకితం చేసేందుకు మనం సిద్ధంగా ఉండాలి. నాకు కొడుకు లేడు. దేశానికి సేవ చేయడానికి నా కుమార్తెను పంపిస్తా. ఆమెను ఆర్మీలో చేరుస్తా' అని మహాదేవి చెప్పారు. సియాచిన్ మంచుకొండల్లో చిక్కుకుని, ఆరు రోజుల మృత్యువుతో పోరాడి లాన్స్‌నాయక్ హనుమంతప్ప వీరమరణం పొందిన సంగతి తెలిసిందే.