ద్రాక్ష, పుచ్చకాయల రైతులను మార్కెటింగ్ సౌకర్యాన్ని కల్పించడంతో పాటు నగర వాసులకు తక్కువ ధరకే నాణ్యమైన పండ్లను అందుబాటులోకి తీసుకొచ్చే లక్ష్యంతో...
సాక్షి, బెంగళూరు : ద్రాక్ష, పుచ్చకాయల రైతులను మార్కెటింగ్ సౌకర్యాన్ని కల్పించడంతో పాటు నగర వాసులకు తక్కువ ధరకే నాణ్యమైన పండ్లను అందుబాటులోకి తీసుకొచ్చే లక్ష్యంతో హాప్‌కామ్స్‌లో బుధవారం ‘ద్రాక్ష, పుచ్చకాయల’మేళా ప్రారంభమైంది. నగరంలోని అన్ని హాప్‌కామ్స్ స్టోర్లలోనూ ఈ మేళా రెండున్నర నెలల పాటు కొనసాగనుంది. నగరంలోని హడ్సన్ సర్కిల్‌లోని హాప్‌కామ్స్ స్టోర్‌లో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రామలింగారెడ్డి ఈ మేళాను లాంఛనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా రామలింగారెడ్డి మాట్లాడుతూ... ఇటీవలి కాలంలో భూగర్భ జలాల లభ్యత తీవ్రంగా తగ్గిపోవడంతో అన్ని రకాల పంటలు నాణ్యతను కోల్పోతున్నాయని అన్నారు. భూగర్భ జలాల లభ్యత పెరిగితే పంటల నాణ్యత, దిగుబడి కూడా పెరుగుతుందని తెలిపారు. అందుకే రాష్ట్ర ప్రభుత్వం ఎత్తినహొళె తరహా పథకాలను అమలు చేసేందుకు ముందుకు వచ్చిందని పేర్కొన్నారు. అనంతరం హాప్‌కామ్స్ అధ్యక్షుడు హెచ్.కె.నాణవేణి చంద్రశేఖర రెడ్డి మాట్లాడుతూ... గుల్బర్గా, బిజాపుర, కోలార్, బెంగళూరు గ్రామీణ తదితర జిల్లాలోని రైతుల పొలాల నుండి నేరుగా ద్రాక్ష, పుచ్చకాయలను తీసుకువచ్చి హాప్‌కామ్స్‌లో విక్రయిస్తున్నట్లు చెప్పారు.
మార్కెట్ ధరతో పోలిస్తే దాదాపు 10 శాతం రాయితీ ధరకు ద్రాక్ష, పుచ్చకాయలను విక్రయించనున్నట్లు పేర్కొన్నారు. ఈ ఏడాది దాదాపు 800 నుంచి 1,000 మెట్రిక్ టన్నుల ద్రాక్షను విక్రయించడమే లక్ష్యంగా నిర్ణయించినట్లు తెలిపారు. ఈ మేళాలో నీలి, తామ్సన్ సీడ్‌లెస్, సూనాటౌ, శరద్, కృష్ణా శరద్, క్రిమ్‌సన్స్, ఇండియన్ రెడ్ గ్లోబ్ తదితర ద్రాక్ష రకాలను అందుబాటులో ఉంచినట్లు వెల్లడించారు.