రెండేళ్లలో ప్లాట్‌ఫాంల ఎత్తు పెంపు
Published Thu, Aug 22 2013 11:54 PM | Last Updated on Fri, Sep 1 2017 10:01 PM
సాక్షి, ముంబై: పశ్చిమరైల్వే చేపట్టిన ప్లాట్‌ఫాంల ఎత్తు పెంపు పనులు 2015నాటికి పూర్తవనున్నాయి. ఈ విషయాన్ని సంబంధిత అధికారి ఒకరు వెల్లడించారు. నగరంలోని కొన్ని రైల్వే స్టేషన్లలో లోకల్ రైలు-ప్లాట్‌ఫాంల మధ్య వ్యత్యాసం ఎక్కువగా ఉండడంతో రైలు ఎక్కే సమయంలో అనేకమంది ప్రయాణికులు కిందపడి గాయాలపాలవుతున్నారు. ఈ నేపథ్యంలో పశ్చిమ రైల్వే నెల రోజుల క్రితం ప్లాట్‌ఫాంల ఎత్తు పెంపు పనులను ప్రారంభించింది. ప్లాట్‌ఫాంల ఎత్తును 760 మిల్లీమీటర్ల నుంచి 920 మిల్లీమీటర్ల వరకు పెంచేందుకు రైల్వే డిజైన్ అండ్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్ అనుమతించింది. ప్రస్తుతం గ్రాంట్‌రోడ్‌లో ప్లాట్‌ఫాం ఎత్తు పెంపు పనులు కొనసాగుతున్నాయి.
త్వరలో చర్నిరోడ్, ఎల్ఫిస్టన్, లోయర్ పరేల్, విలేపార్లే, ఖార్ తదితర స్టేషన్లలో ప్లాట్‌ఫాంల ఎత్తు పెంపు పనులను ప్రారంభించనున్నారు. ఒక్క ప్లాట్‌ఫాం ఎత్తు పెంపు పనులు పూర్తి కావడానికి రెండు నెలల సమయం పడుతోంది. ఒక ప్లాట్‌ఫాం పనులు పూర్తయిన వెంటనే మరో ప్లాట్‌ఫాం పనులు చేపడుతున్నారు. ఇదిలా ఉండగా ప్లాట్‌ఫాంల ఎత్తును పెంచే ప్రక్రియ చాలా ఆలస్యంగా చేపట్టారని కొందరు సామాజిక కార్యకర్తలు ఆరోపించారు.కాగా 2004లోనే ప్లాట్‌ఫాంల ఎత్తును పెంచాలంటూ రైల్వేశాఖను హైకోర్టు ఆదేశించిందని, అయితే ఇప్పటికీ పనులను పూర్తికాలేదని ప్రయాణికుల సంఘం సభ్యుడు సమీర్ ఆరోపించారు.
Advertisement