
రజనీమురుగన్ విడుదలకు హీరో సాయం చేశారా?
రజనీమురుగన్ ఈ చిత్రం పేరు ప్రచార మాధ్యమాల్లో చాలా కాలంగానే నానుతోంది. కారణం ఆర్థిక సమస్యలన్నది అందరికీ తెలిసిందే. శివకార్తికేయన్, కీర్తీసురేశ్ జంటగా నటించిన చిత్రం రజనీమురుగన్. దర్శకుడు లింగుసామి సమర్పణలో తిరుపతి బ్రదర్స్ పతాకంపై సుభాష్ చంద్రబోస్ నిర్మించిన ఈ చిత్రానికి పొన్‌రామ్ దర్శకుడు. ఇంతకు ముందు శివకార్తికేయన్, పొన్‌రామ్ కాంబినేషన్‌లో రూపొందిన వరుత్తపడాద వాలిబర్‌సంఘం చిత్రం విశేష ప్రజాదరణ పొందింది .
దీంతో రజనీమురుగన్ చిత్రంపై చిత్ర పరిశ్రమలో మంచి అంచనాలు నెలకొన్నాయి. అయితే చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని విడుదల తేదీ వెల్లడై పలుమార్లు వాయిదా పడడంతో మీడియా మాధ్యమాల్లో రజనీమురుగన్ గురించి రకరకాల ప్రచారాలు హల్‌చల్ చేశాయి.అందుకు కారణం చిత్ర నిర్మాతల ఆర్థిక సమస్యలే కారణం అని సమాచారం. ఎట్టకేలకు రజనీమురుగన్ చిత్రాన్ని పొంగల్‌కు విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. అయితే ఇలా పలుమార్లు విడుదల తేదీని వెల్లడించి వాయిదా వేయడంతో ఈ సారైనా చిత్రం నిర్ణయించిన తేదీన విడుదల అవుతుందా? అన్న సందేహం పరిశ్రమలోని ఒక వర్గం వ్యక్తం చేయడం గమనార్హం. అయితే ఈ సారి రజనీమురుగన్ చిత్రం తెరపైకి రావడం గ్యారెంటీ అంటున్నారు చిత్ర వర్గాలు. అందుకు కారణం లేక పోలేదు.
రజనీ మురుగన్ చిత్రాన్ని చుట్టు ముట్టిన ఆర్థిక సమస్యలన్నీ పరిష్కారం అయ్యాయంటున్నారు. మరో విషయం ఏమిటంటే రజనీమురుగన్‌ను సమస్యల నుంచి బయట పడేయడానికి ఆ చిత్ర కథానాయకుడు శివకార్తికేయన్ ఏకంగా ఐదు కోట్లు ఇచ్చినట్లు ప్రచారం కోలీవుడ్‌లో హల్‌చల్ చేస్తోంది. అందువల్లే విడుదల సమయంలో ఏమైనా చిన్న చిన్న సమస్యలు తలెత్తినా ఆ డబ్బుతో పరిష్కరించవచ్చుననే ధీమాతో చిత్ర దర్శకనిర్మాతలు ఉన్నట్లు సినీవర్గాల టాక్. ఇందులో నిజమెంత అన్నది పక్కన పెడితే పొంగల్ చిత్రాల రేస్‌లో రజనీమురుగన్ ఉండబోతుండటం సంతోషకరమైన విషయం.