కాళేశ్వరం భూసేకరణకు తొలగిన అడ్డంకులు
హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణాన్ని నిలిపివేయాలంటూ దాఖలైన రిట్ పిటిషన్‌ను వెకేషన్ హైకోర్టు శనివారం కొట్టివేసింది. ఈ ప్రాజెక్టు పనులను నిలిపివేస్తూ స్టే ఇవ్వాలన్న అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చింది. సుందిల్ల బ్యారేజీ నిర్మాణం కొరకు ప్రభుత్వం 2013 చట్ట ప్రకారం 240 ఎకరాలు సేకరించింది. రైతుల నుంచి బలవంతంగా సేకరించిన భూములను తిరిగి వారికి ఇవ్వాలని కోరుతూ వెంకటరెడ్డి అనే వ్యక్తి దాఖలు చేసిన పిటీషన్‌ను ఈ రోజు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అఖ్తర్ కొట్టివేశారు.
భూ నిర్వాసితులు నష్ట పరిహారం, పునరావాస చర్యలకు సంబంధించి తమ ఫిర్యాదులను ఆర్ అండ్ ఆర్ అథారిటీ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకోవాలని పిటిషనర్‌ను కోర్టు ఆదేశించింది. సుందిళ్ళ బ్యారేజీ పరిధిలోని గోలివాడ గ్రామానికి చెందిన భూములను 2013 చట్ట ప్రకారం ప్రభుత్వం సేకరించింది. ఇందుకు గాను 19 కోట్ల రూపాయలను ప్రభుత్వం డిపాజిట్ చేసినట్లు అదనపు అడ్వకేట్ జనరల్ రామచంద్రరావు కోర్టుకు తెలిపారు