పైప్‌లైన్ వ్యవస్థకు సర్కార్ నో!
⇒ కాళేశ్వరంలోని ప్యాకేజీ–21 కింద అమలులోకి రాని ప్రతిపాదన
⇒ వ్యయం పెరుగుతుందనే వెనక్కి!
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో పైప్ లైన్ ద్వారా నీటిని సరఫరా చేయాలన్న యోచనను రాష్ట్ర ప్రభుత్వం విరమించుకుంది. కాల్వల ద్వారా జరిగే నీటి సరఫరాతో పోలిస్తే పైప్‌లైన్ వ్యవస్థ ఖర్చు తక్కువగా ఉంటుందని, ఎక్కువ ఆయకట్టుకు నీరిచ్చే అవకాశాలుం టాయని మొదట సర్కార్ భావించింది. ఈ నేపథ్యంలో పైలట్ ప్రాజెక్టు కింద కాళేశ్వరం ప్రాజెక్టులోని ప్యాకేజీ 21లో ఈ విధానం అమల్లోకి తేవాలనుకుంది. పెట్టుబడి వ్యయం అధికంగా ఉంటుందన్న సాకుతో తాజాగా దాన్ని పక్కనపెట్టింది. వాస్తవానికి సాగునీటి ప్రాజెక్టుల్లో కాల్వల నిర్మాణానికి ఖర్చు ఎకరాకు రూ.25వేల వరకు ఉంటే, పైప్‌లైన్ ద్వారా రూ.23,500లే ఉంటుంది.కాల్వల ద్వారా టీఎంసీలకి 10వేల ఎకరాలకు మాత్రమే నీరిచ్చే అవకాశం ఉండగా, పైప్‌లైన్ వ్యవస్థలో 20వేల ఎకరాలకు నీరు అందించవచ్చు.
పైప్‌లైన్ నిర్మాణాలకు భూసేకరణ అవస రాలు తక్కువగా ఉండి, అన్ని ప్రాంతాలకు సమాన నీటిని పంపిణీ చేసే అవకాశముంటుంది. నిర్వహణ ఖర్చు భారీగా తగ్గుతుంది. ఈ విధానం ఇప్పటికే అమల్లో ఉన్న మధ్యప్రదేశ్ ఇండోర్‌లోని ఓంకారేశ్వర డ్యామ్‌ను రాష్ట్ర మంత్రులతోపాటు ఇంజనీర్ల బృందం పరిశీలించింది. రాష్ట్రంలో చేపడుతున్న పాలమూరు, డిండి, కాళేశ్వరంలో ఈ విధానం ప్రవేశపెట్టాలని సూచించింది. ఈ మూడు ప్రాజెక్టుల్లో 30లక్షల ఎకరాలకు నీరివ్వాలంటే పిల్ల కాల్వల నిర్మాణానికి 1.5 లక్షల ఎకరాల భూమి అవసరం ఉంటుంది. దీనికి రూ.7,500 కోట్ల మేర ఖర్చవుతుంది.
అదే పైప్‌లైన్ వ్యవస్థ ద్వారా అయితే రూ.6వేల కోట్లు మాత్రమే ఖర్చవుతుందని గుర్తించింది. ఈ ప్రయోజనాల దృష్ట్యానే పైప్‌లైన్ వ్యవస్థకు ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించి కాళేశ్వరం ప్యాకేజీ 21లో అమలు చేయాలని నిర్ణయించింది. రూ.1143 కోట్ల విలువైన ఈ ప్యాకేజీలో 1.70లక్షల ఎకరాలకు నీరివ్వాల్సి ఉంది. ఇందులో లక్ష ఎకరాలకు నీరివ్వాలంటే 4 వేల ఎకరాల భూసేకరణ అవసరమవుతుంది. ప్రస్తుతం ప్యాకేజీ 21 కింద నష్టపోతున్న భూమి ధర ఎకరాకు రూ.7 నుంచి రూ.8 లక్షల మధ్య పలుకుతోంది. ఈ లెక్కన భూ సేకరణ కే రూ.320కోట్లు అవసరం. అదే పైప్‌లైన్ వ్యవస్థ ద్వారా అయితే భూసేకరణ అవసరం ఉండదు. అయితే దీనిపై సమీక్షించిన ప్రభుత్వం ఈ తరహా నిర్మాణంతో భారీగా పెట్టుబడి వ్యయం అవుతుందని భావించింది.