నన్ను నటించొద్దు అనడానికి నీవెవరు
నన్ను నటించవద్దు అనడానికి నువ్వెవరివి అంటూ ఫెప్సీ అధ్యక్షుడు శివను నటుడు మన్సూర్ అలీఖాన్ ప్రశ్నిస్తున్నారు. ఈయన ఫెప్సీ ( దక్షిణ భారత సినీ కార్మిక సమాఖ్య)కు పోటీగా టాప్సీ సమాఖ్యను నెలకొల్పారు. దీంతో ఫెప్సీకి మన్సూర్ అలీఖాన్‌కు మధ్య మాటల యుద్ధం నెలకొంది. ఇలాంటి పరిస్థితిలో నటుడు మన్సూర్ అలీఖాన్ నటించే చిత్రాలకు తాము సహకరించబోమని ఫెప్సీ నిర్వాహకులు కొందరు ప్రకటించారు. దీనికి స్పందించిన మన్సూర్ అలీఖాన్ ఒకరి కడుపును మరొకరు కొట్టడం న్యాయమా? నేను నెలకొల్పిన టాప్సీ సమాఖ్యను తొక్కేయడానికి, నా వ్యక్తిగత విజయాన్ని అడ్డుకోలేక ఇలా నేను నటించే చిత్రాలకు సహకరించం అంటున్నారు. అలా సహకరించకపోతే టాప్సీ సహకరిస్తుంది. మీరు తప్పుకోండి. టాప్సీ నుంచి వందమంది కావాలా, 200 మంది కావాలా నేను పంపిస్తాను. టాప్సీలో మొత్తం 400 మంది సభ్యులు ఉన్నారు.
అందులో డ్యాన్సర్లు, స్టంట్ కళాకారులు అంటూ పలు శాఖలకు చెందిన వారు ఉన్నారు. అయినా మన్సూర్ అలీఖాన్ నటించొద్దు అనడానికి మీరెవ్వరు. అది దర్శక నిర్మాతలు ఇష్టాఇష్టాలపై ఆధారపడి ఉంటుంది. నేనెన్నో సమస్యలను ఎదుర్కొంటున్నాను. అలాంటిది కొందరు టాప్సీని నిర్మూలించాలనుకుంటున్నారు. నిజానికి నాకు ఫెప్సీ సభ్యులతో ఎలాంటి సమస్య లేదు. వారంతా హాలీవుడ్ కళాకారులకు ధీటుగా నైపుణ్యం కలవారు. సమస్య అంతా అక్రమాలకు పాల్పడుతూ పనీ పాట లేకుండా బతికేస్తున్న కొందరు నీతిమాలిన వారి చర్యల్నే ఖండిస్తున్నాను. ఈ విషయమై నేను న్యాయస్థానాన్ని ఆశ్రయించి నటించడానికి అభ్యంతరం లేకుండా ఉత్తర్వులు పొందానని మన్సూర్ అలీఖాన్ తెలిపారు.