మురికి వాడల అభివృద్ధి మండలి మాజీ అధ్యక్షుడు జె.నరసింహస్వామి
ఎత్తినహొళె పేరుతో ఇంకా మోసం చేస్తున్న మొయిలీ
దొడ్డబళ్లాపురం : రాష్ర్టంలో ప్రజా వ్యతిరేక పాలన సాగుతోందంటూ మురికి వాడల అభివృద్ధి మండలి మాజీ అధ్యక్షుడు జె.నరసింహస్వామి విమర్శించారు. కాంగ్రెస్ పాలనపై ప్రజలు విసుగెత్తిపోయారని తెలిపారు. రాబోవు ఎన్నికల్లో ఆ పార్టీకి గుణపాఠం చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. స్థానిక బీజేపీ కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బయలు సీమ జిల్లాలకు శాశ్వత నీటి వనరులు కల్పించాలంటూ యువమోర్చా ఆధ్వర్యంలో చిక్కబళ్లాపురం నుంచి బెంగళూరుకు 300 మంది కార్యకర్తలు చేపట్టిన పాదయాత్రను ప్రభుత్వం నిర్ధయగా అణిచి వేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాష్ర్టంలో బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి సిద్ధరామయ్య చేపట్టిన పాదయాత్రను అప్పటి ప్రభుత్వం అడ్డుకోలేదని గుర్తు చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో సమస్యలపై నిలదీసేందుకు ప్రతి ఒక్కరికీ హక్కు ఉందని, ఈ విషయంపై కనీస పరిజ్ఞానం కూడా రాష్ర్ట ప్రభుత్వానికి లేకుండా పోయిందని మండిపడ్డారు. ఎత్తినహొళె పథకం పేరుతో ఇప్పటికీ బయలుసీమ ప్రజలను ఎంపీ వీరప్ప మొయిలీ మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పథకం పూర్తి అయ్యే అవకాశమే లేదన్నారు. అక్కడి నుండి నీరు తరలించడానికి దక్షిణ కన్నడ జిల్లా వాసులు అంగీకరించడం లేదని స్పష్టం చేశారు.
దమ్ముంటే రాజీనామా ఇవ్వండి
‘తాలూకాలో బెంగళూరు చెత్త డంపింగ్ చేయడానికి అనుమతులిచ్చింది బీజేపీ హయాంలో, నరసింహస్వామి ఎమ్మెల్యేగా ఉన్న కాలంలోనే, కావున పాపం ఆయనదే’ అంటూ స్థానిక ఎమ్మెల్యే వెంకటరమణయ్య ప్రకటనలివ్వడం పట్ల నరసింహస్వామి ఫైర్ అయ్యారు. తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తాలూకాలో బీబీఎంపీ బెంగళూరు చెత్త వేయడానికి స్థలాన్ని గుర్తిస్తే అప్పటి ముఖ్యమంత్రి జగదీష్ శెట్టర్‌కు రాజీనామా ఇచ్చి ఆ ప్రయత్నాన్ని అడ్డుకున్నానని గుర్తు చేశారు. ఇప్పటి ఎమ్మెల్యే వెంకటరమణయ్యకు తాలూకా ప్రజల సంక్షేమం పట్ల శ్రద్ధ ఉంటే తాను కూడా ముఖ్యమంత్రికి రాజీనామా ఇచ్చి అడ్డుకోవాలని సవాలు విసిరారు. పాత్రికేయుల సమావేశంలో జిల్లా బీజేపీ కమిటీ అధ్యక్షుడు బీసీ నారాయణస్వామితోపాటు పలువురు బీజేపీ నేతలు హాజరయ్యారు.
రాష్ర్టంలో ప్రజా వ్యతిరేక పాలన
Published Wed, Dec 24 2014 1:23 AM | Last Updated on Sat, Sep 2 2017 6:38 PM
Advertisement