చంద్రబాబు పాలనంతా రైతు వ్యతిరేకమే
మంగళగిరి
చంద్రబాబు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా రైతు వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటారని మరోసారి రుజువైందని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) అన్నారు. తాడేపల్లి మండలంలోని ఉండవల్లి గుహల వద్ద పంట పొలాల్లో మంగళవారం రైతులు ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్న పలువురు ప్రజాప్రతినిధులు, రైతు సంఘ నాయకులు, రైతులు రాజధాని భూ సేకరణపై తీవ్ర స్థాయిలో ప్రభుత్వంపై మండిపడ్డారు.
ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే మాట్లాడుతూ రాజధాని కోసం చందాలు అడుగుతున్న ముఖ్యమంత్రి రైతుల వద్ద భూములు సేకరిస్తే వారికి ఏ విధంగా డబ్బులు చెల్లిస్తారని ప్రశ్నించారు. పులిచింతల నిర్వాసితులతో పాటు నియోజకవర్గంలో రింగ్‌రోడ్డు కోసం భూములు తీసుకున్న రైతులకు ఇప్పటి వరకు నగదు చెల్లించలేదన్నారు. ప్రభుత్వం భూములను తీసుకుంటే ఆ రైతులు కూలీలుగా మారడం ఖాయమన్నారు. రైతుల పొట్టలు కొట్టి రాజధాని నిర్మాణం చేసి తనకు ధనార్జన చేసే రియల్ ఎస్టేట్, హోటళ్లు, వ్యాపారాల కోసమే రైతుల వద్ద నుంచి భూములు లాక్కోవడం జరుగుతుందన్నారు.
ఎంపీపీ కత్తిక రాజ్యలక్ష్మి మాట్లాడుతూ రైతులంతా సంఘటితంగా పోరాడి భూములు కాపాడుకోవాలన్నారు. మాజీ ఎంపీపీ దొంతిరెడ్డి వేమారెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా రైతులను కష్టాలలోకి నెట్టే నిర్ణయాలు తీసుకోవడం గతంలో చూశామని, ఇప్పుడు మరలా అదే పరిస్థితి తలెత్తి రైతు కుటుంబాలు ఆందోళనకు గురి అవుతున్నాయన్నారు. సంవత్సరానికి మూడు పంటలు పండి వాటిమీదనే బతికే రైతు ఆ భూములు కాస్తా ప్రభుత్వం తీసుకుంటే వారి బ్రతుకు ఎలా సాధ్యమని ప్రశ్నించారు.
తల్లీ బిడ్డను వేరుచేస్తారా..?
రైతు సంఘం నాయకులు జొన్నా శివశంకర్ మాట్లాడుతూ రైతుకు భూమిని వేరు చేస్తే తల్లికి బిడ్డను వేరు చేసినట్లేనన్నారు. శివరామకృష్ణ కమిటీ సూచనలు పరిగణనలోకి తీసుకోకుండా వేల ఎకరాలు రాజధాని పేరుతో సేకరించి కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టేందుకు కుట్ర జరుగుతుందని ఆయన విమర్శించారు. రైతులు మాట్లాడుతూ చంద్రబాబు అధికారంలోకి వస్తే రైతు రుణమాఫీ చేస్తాడని ఓట్లేస్తే అధికారంలోకి వచ్చిన తరువాత రుణమాఫీ చేయకపోగా ఉన్న భూములను లాక్కొని రాజధాని నిర్మాణాలు చేసుకుంటే తాము ఎలా బతకాలని ఆవేదన వ్యక్తం చేశారు.
కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యులు పాటిబండ్ల కృష్ణమూర్తి, బురదగుంట కనకవల్లి, పెనుమాక సొసైటీ అద్యక్షుడు మేకా శివారెడ్డి, రైతులు దంటు గోవర్థనరెడ్డి, గోపాలం ప్రభాకరరావు, బోస్రెడ్డి, కళ్లం వెంకటరెడ్డి, కళ్లం శివారెడ్డి, కళ్లం సంజీవరెడ్డి, దంటు బాలాజీ రెడ్డి, కళ్లం చంద్రశేఖరరెడ్డి, రైతు సంఘాల నాయకులు దొంతిరెడ్డి వెంకటరెడ్డి, మోదుగుల శ్రీనివాసరెడ్డి, కాజ వెంకటేశ్వరరావు, కాంగ్రెస్ నాయకులు జంగాల సాంబశివరావు, పెనుమాక, ఉండవల్లి గ్రామాలకు చెందిన రైతులు పాల్గొన్నారు.