narasimhaswamy
-
యాదగిరీషుని సన్నిధిలో భక్తజన సందోహం
-
తిరుక్కడిగై
నమో భక్తవత్సలా... నమో యోగాంజనేయా! సాధారణంగా నరసింహస్వామి అనగానే ఆయన ఉగ్రరూపమే కన్నులముందు కదలాడుతుంది. ఆయన ప్రసన్నవదనంతో కనిపించే ఆలయాలు ఉన్నప్పటికీ యోగభంగిమ లో కనిపించే ఆలయాలు మాత్రం అరుదు. అలా ఆ స్వామి యోగభంగిమలో సాక్షాత్కరించే క్షేత్రమే తిరుక్కడిగై. తమిళనాడులోని తిరుత్తణికి కొద్దిదూరంలో ఉండే తిరుక్కడిగై 108 వైష్ణవదివ్యదేశాలలో ఒకటి. దీనికే చోళంగిపురం, చోళసింహపురం, షోలింగూర్ అనే పేర్లున్నాయి. ఇది అత్యంత మహిమాన్విత క్షేత్రంగా ప్రసిద్ధికెక్కింది. స్వామివారిని ఇక్కడి వారు అక్కారప్పన్ అని పిలుచుకుంటారు. ఇక్కడి తీర్థానికి అమృత తీర్థమని పేరు. అమ్మవారు అమృతవల్లి తాయారు అనే పేరుతో పూజలు అందుకుంటున్నారు. స్వామివారి ఉత్సవమూర్తికి భక్తవత్సలన్ అని పేరు. ఈ స్వామి సన్నిధికి వెనక ఆదికేశవర్ అంటే ఆదికేశవ స్వామి భక్తులను అనుగ్రహిస్తుంటారు. ఇక్కడికి సమీపంలోనే గల చిన్న కొండపైన యోగాంజనేయస్వామి ఆలయం ఉంది. ఆంజనేయుడు కూడా యోగముద్రలో చతుర్భుజాలతో శంఖచక్రగదాభయ హస్తాలతో దర్శనమిస్తాడు. ఆంజనేయుని సన్నిధికి తిరుక్కోవిల్ అని పేరు. ప్రతివారం వేలాదిగా భక్తులు విచ్చేసి, స్వామివార్లకు పూజలు, అర్చనలు, అభిషేకాలు చేయించుకుని తమ సమస్యల నుంచి ఉపశమనం పొందుతుంటారు. ముఖ్యంగా దీర్ఘరోగులు, మానసిక రోగులు, నరాల బలహీనతలు ఉన్నవారు, మూర్ఛవ్యాధి ఉన్నవారు, రక్తహీనతతో బాధపడేవారు, పిశాచ భ్రమలు ఉన్నవారు ఈ రెండు ఆలయాలలోనూ పూజలు చేయించుకుంటారు. ఈ క్షేత్రానికి పాద శ్రీరంగమని, పుష్కరిణికి తిరుక్కావేరి అనీ పేర్లున్నాయి. స్థలపురాణం: హిరణ్యకశిపుని సంహరించడం కోసం శ్రీ మహావిష్ణువు నారసింహావతారం ధరిస్తాడని తెలిసిన సప్తరుషులు స్వామిని దర్శించుకునేందుకుగాను ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. మహావిష్ణువు తన అవతార ధారణకు తగిన సమయం కోసం వేచి ఉన్నాడు. అదే సమయంలో హిరణ్యకశిపుడు ‘‘ఏడీ, ఈ స్తంభంలో ఉన్నాడా ఆ శ్రీహరి? అంటూ మదాంధకారంతో స్తంభాన్ని ఒక్క తాపు తన్నడంతో మహావిష్ణువు ఉగ్రనరసింహావతారం ధరించి ఆ స్తంభం నుంచి వెలుపలికి వచ్చి దుష్టదానవుడిని చీల్చి చెండాడిన విషయం తెలిసిందే. ఈలోగా సప్తర్షులు తన ఆగమనం కోసం వేచి ఉన్నారని గ్రహించిన విష్ణుమూర్తి వారికోసం క్షణకాలం ఈ ప్రదేశంలో వారికి యోగముద్రలో కనిపిస్తాడు. అదే రూపంలో పెరియమలై అనే కొండపైన Ðð లిశాడు. అదే తిరుక్కడిగై. కడిగై అంటే క్షణకాలం అని అర్థం. రాక్షస సంహారం అనంతరం కూడా నరసింహస్వామి ఉగ్రరూపం వీడకపోవడంతో ఆయనను శాంతపరచడం కోసం హనుమంతుడు ఇక్కడి చిన్నమలై అనే కొండపైన ఆయనకు అభిముఖంగా ఉండి ప్రార్థిస్తాడు. తిరుక్కడిగై అంటే పరమ పవిత్రమైన సమయం లేదా ప్రదేశం అని అర్థం చెప్పుకోవచ్చు. విశ్వామిత్రుడు ఈ స్వామివారిని అర్చించి బ్రహ్మజ్ఞానం పొందాడని, నవగ్రహాలలో ఒకరైన బుధుడు ఈ స్వామిని సేవించి తనకు దుర్వాసుడు ఇచ్చిన శాపాన్ని పోగొట్టుకున్నాడని స్థలమహాత్మ్యం తెలుపుతోంది. ఆలయానికి చేరువలోగల బ్రహ్మపుష్కరిణిలో స్నానం చేస్తే దీర్ఘవ్యాధులు నయమవుతాయని, సింహకోష్టాకృతిలో గల ఆలయ విమాన గోపురాన్ని సందర్శిస్తే సర్వపాపాలూ పటాపంచలవుతాయనీ ప్రతీతి. తిరుత్తణిలోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయం, శ్రీపురం శ్రీ మహాలక్ష్మీ అమ్మవారి ఆలయం, ఏకాంబరేశ్వర స్వామి ఆలయం, అరుల్మిగు లక్ష్మీనరసింహస్వామి ఆలయం ఇక్కడికి దగ్గరలోని ఇతర చూడదగ్గ పుణ్యస్థలాలు. ఎక్కడ ఉంది? ఎలా వెళ్లాలి? తమిళనాడులోని వెల్లూరు జిల్లాలోని షోలింగూర్ అనే గ్రామంలో గల కొండపైన ఉందీ ఆలయం. ఎన్‌హెచ్ 4– ఎన్‌హెచ్ 46 జాతీయ రహదారిపై గల ఈ ప్రదేశానికి చేరుకోవాలంటే ముందుగా తిరుత్తణి లేదా వెల్లూరుకు వెళ్లాలి. అక్కడినుంచి షోలింగూర్‌కు బస్సులు, ప్రైవేటు వాహనాలు ఉన్నాయి. దేశంలోని అన్ని ప్రధాన నగరాలనుంచి వెల్లూరుకు రైళ్లున్నాయి. (కాట్పాడి) లేదా అరక్కోణం, జోలార్‌పేటైలకు చేరుకోగలిగితే అక్కడి నుంచి తిరుక్కడిగైకి వెళ్లచ్చు. – డి.వి.ఆర్. భాస్కర్ -
పెన్నహోబిలంలో ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు
ఉరవకొండ రూరల్ : పెన్నహోబిలం లక్ష్మీనారసింహుడి బ్రహోత్సవాలు ఆదివారం వైభవంగా ప్రారంభమయ్యాయి. మండలంలోని ఆమిద్యాల గ్రామం పెన్నబిళేసుడి ఆలయం నుంచి శ్రీవారి ఉత్సవమూర్తులను తీసుకోరావడానికి ప్రత్యేక పల్లకిను పెన్నహోబిలం నుంచి తీసుకెళ్లారు. ఈఓ రమేష్‌బాబు, ప్రధాన అర్చకుడు ద్వారాకానాథ్చార్యుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజల అనంతరం మేళతాళాల మధ్య శ్రీవారి ఉత్సవ మూర్తులను పెన్నహోబిళానికి తీసుకొచ్చారు. -
నేడు తీర్థవాది ఉత్సవం
కదిరి : ఈ నెల 7న అంకురార్పణతో ప్రారంభమైన ఖాద్రీ లక్ష్మీ నారసింహుడి బ్రహ్మోత్సవాలు రెండు రోజుల్లో ముగియనున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారి తీర్థవాది ఉత్సవం సోమవారం భృగుతీర్థం (కోనేరు)లో భక్తుల కోలాహలం మధ్య జరగనుంది. ఉదయం ఆలయ ప్రాంగణంలో శ్రీదేవి, భూదేవి సమేతంగా స్వామి వారు వసంతోత్సవాలు జరుపుకుంటారు. భక్తులు సైతం హోలీ తరహాలో రంగులు చల్లుకొని, ఆనందోత్సాహాలతో వసంతాలు చల్లుకుంటారు. అనంతరం శ్రీవారు శ్రీదేవి, భూదేవిలతో కలిసి భృగుతీర్థంలోకి వెళ్లి, అక్కడ చక్ర స్నానం ఆచరిస్తారు. అనంతరం విశేషాలంకరణతో స్వామివారు తిరువీధుల గుండా కాకుండా కోనేరు నుంచి హిందూపురం కూడలి మీదుగా తిరిగి ఆలయ ప్రాంగణం చేరుకుంటారు. బ్రహ్మోత్సవాల ప్రారంభం నాడు ఆలయం ముందు ధ్వజస్తంభానికి కట్టిన కంకణాలు విప్పేస్తారు. దీంతో తీర్థవాది ఉత్సవం ముగుస్తుంది. అనంతరం శ్రీవారు మధ్యాహ్నం 2 గంటలకు ఆలయంలోకి ప్రవేశిస్తారు. బ్రహ్మోత్సవాలు ప్రారంభమైనప్పటి నుంచి స్వామివారు యాగశాలలోనే గడిపారు. నేటి మధ్యాహ్నం 2 గంటల నుంచి ఆలయం తలుపులు మూసివేస్తారు. అప్పటి నుంచి రోజంతా శ్రీవారి దర్శనం ఉండదు. తిరిగి మంగళవారం ఉదయం నుంచి స్వామివారు ఆలయంలో యధావిధిగా భక్తులకు దర్శనమిస్తారు. -
వైభవంగా భూతప్పల ఉత్సవం
రొళ్ల : మండల కేంద్రంలో వెలసిన శ్రీలక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా భూతప్పల ఉత్సవాలను అత్యంత వైభవంగా శుక్రవారం నిర్వహించారు. మారుతీకాలనీ సమీపంలో ముత్తురాయస్వామి ఆలయంలో భూతప్పలకు ప్రత్యేక పూజలు చేసి, మేళతాళాలతో పాదాలబండ వద్ద నుంచి భూతప్పలు నృత్యం చేసుకుంటూ ఆలయం వద్దకు వచ్చారు. తడివస్త్రాలతో మహిళలు పొర్లు దండాలు పెడుతుండగా భూతప్పలు నాట్యమాడుతూ వారిపై కాలుమోపుతూ ముందుకు సాగారు. అనంతరం లక్ష్మీనరసింహస్వామి, ఆంజనేయస్వామి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్సవాలకు కర్ణాటక, ఆంధ్ర, తమిళనాడు తదితర ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం మధ్యాహ్నం 2గంటలకు శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయానికి భూతప్పలు చేరుకొని ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. అనంతరం శ్రీలక్ష్మీనరసింహస్వామి, ఆంజనేయస్వామి ఆలయాల్లో పూజలు చేశారు. అనంతరం భూతప్పల ఆలయంలో పట్టం కూర్చోబెట్టారు. ఆలయ కమిటీ తరఫున అన్నదానం చేశారు. సీఐ దేవానంద్ ఆధ్వర్యంలో రొళ్ల, అగళి ఎస్ఐలు నాగన్న,రామ్‌బాబు పోలీసు గట్టి బందోబస్తు నిర్వహించారు. అనంతరం ఎం.రాయాపురం గ్రామస్తులు శ్రీరామ ఆలయం సమీపంలోని లక్ష్మీదేవి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి, భక్తులకుఅన్నదానం చేశారు. లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా భక్తులు సమర్పించిన వడిబియ్యం, బెల్లం తదితర వాటితో ప్రసాదాన్ని తయారు చేసి భూతప్ప ఆలయం ముందు ఉంచి పూజలు నిర్వహిస్తామన్నారు. అనంతరం బక్తులకు ప్రసాదం పంపిణీ చేశారు. -
నేడు శేషవాహన సేవ
కదిరి : ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం శేషవాహనంపై స్వామివారు భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. ఇప్పటి వరకు జరిగిన ఉత్సవాల్లో నారసింహుడు మాత్రమే తిరువీధుల్లో దర్శన మిచ్చారు. అయితే శేషవాహనంపై శ్రీదేవి, భూదేవిల సమేతంగా లక్ష్మీనారసింహుడు తిరు వీధుల్లో విహరించడం ఈ ఉత్సవ ప్రత్యేకత. నారసింహుని సేవ చేయడానికి ఆదిశేషుడే వాహనంగా మారతాడని ప్రధాన అర్చకులు నరసింహాచార్యులు, పార్థసారథి ఆచార్యులు చెప్పారు. ఉభయదారులుగా యాదాళం బాలాజీ, శ్రీనివాసులు కుటుంబ సభ్యులు వ్యవహరిస్తారని ఆలయ సహాయ కమిషనర్ వెంకటేశ్వరరెడ్డి, ఆలయ కమిటీ చైర్మన్ నరేంద్రబాబు తెలిపారు. -
వైభవోపేతం.. అహోబిలేశుడి బ్రహ్మోత్సవం
అహోబిలం(ఆళ్లగడ్డ): అహోబిలంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా దిగువ అహోబిలంలో ఐదో రోజు మంగళవారం ఉదయం ఉత్సవమూర్తులైన శ్రీ ప్రహ్లాదవరదస్వామి, శ్రీదేవి, భూదేవి అమ్మవారు శేషవాహనంపై కొలువై భక్తులకు దర్శనమిచ్చారు. అంతకు ముందు వేకవజామున నిత్య పూజల్లో భాగంగా సుప్రత సేవ అనంతరం స్వామి అమ్మవార్లకు అర్చనలు, నవకళశ స్థాపన, జలాఅభిషేకం నిర్వహించారు. అనంతరం పట్టువస్త్రాలు, మణి మానిక్యాలతో ప్రత్యేకంగా అలకంరించిన స్వామి అమ్మవార్లను శేషవాహనంలో ఉంచి మంగళ వాయిద్యాల మధ్య గ్రామోత్సవం నిర్వహించారు. రాత్రి శ్రీ ప్రహ్లాదరవదస్వామి చంద్రప్రభ వాహనంపై కొలువై భక్తులకు దర్శనమిచ్చారు. ఎగువ అహోబిలంలో వెలసిన శ్రీజ్వాలనరసింహస్వామికి రాత్రి పట్టు వస్త్రాలతో, వజ్ర, వైడూర్యాలు పొదిగిన బంగారు ఆభరణాలతో స్వామి, అమ్మవార్లను ప్రత్యేకంగా అలంకరించి శరభ వాహనంపై కొలువుంచి గ్రామోత్సవం నిర్వహించారు. కార్యక్రమంలో కార్యనిర్వహణాధికారి మల్లికార్జున ప్రసాదు, మఠం ప్రతినిధి సంపత్, ప్రధానార్చకులు వేణుగోపాలన్ పాల్గొన్నారు. -
నేటి నుంచి నరసింహుని కల్యాణోత్సవాలు
కోరుకొండ (రాజానగరం) : రాష్ట్రంలో చారిత్రక ప్రసిద్ధి గాంచిన కోరుకొండ శ్రీలక్ష్మీనరసింహ స్వామివారి కల్యాణ మహోత్సవాలు బుధవారం నుంచి ఐదు రోజుల పాటు వైభవంగా జరగనున్నాయి. ఈ వేడుకలు అన్నవరం సత్యదేవుని దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. బుధవారం ఉదయాన్నే భక్తులు దేవుని కోనేరులో పుణ్యస్నానాలు ఆచరించి స్వామి వారిని దర్శించుకుంటారు. మధ్యాహ్నం 12 గంటలకు స్వామివారిని పెండ్లికుమారుడిగా, అమ్మవారిని పెండ్లికుమార్తెగా అలంకరించి రథంపై ఆసీనులు చేసి, 2 గంటలకు రథోత్సవం జరుగుతుంది. రాత్రి 9 గంటలకు ఆలయంలో పండితుల, అర్చకుల ఆధ్వర్యంలో స్వామివారి కల్యాణం నిర్వహిస్తారు. అన్నవరం ఈఓ కాకర్ల నాగేశ్వరరావు, కోరుకొండ ఆలయ అనువంశిక ధర్మకర్త ఎస్పీ, రంగరాజ భట్టార్ ఆధ్వర్యంలో మహోత్సవాలు జరుగుతున్నాయి. కోరుకొండ తీర్థానికి రాష్ట్రంలో పలు ప్రాంతాల నుంచే భక్తులు తరలివస్తారు. ముస్తాబైన రథం... స్వామివారి రథాన్ని ముస్తాబు చేశారు. రథోత్సవంలో వివిధ ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు, దేవతామూర్తుల వేషధారణలు నిర్వహిస్తున్నారు. కోరుకొండ ఉత్తర మండల డీఎస్పీ ఏవీఎల్ ప్రసన్నకుమార్ ఆధ్వర్యంలో సీఐలు, ఎస్సైలు సుమారు 80 మందితో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. గోకవరం, రాజమహేంద్రవరం డిపో నుంచి కోరుకొండ తీర్థానికి వచ్చే భక్తుల కోసం ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు. దేవుని కోనేరు వద్ద స్నానాలు ఆచరించిన తరువాత వస్త్రాలు మార్చుకొనేందుకు తాత్కాలిక గదులు ఏర్పాటు చేశారు. కోరుకొండ తీర్థం ఘనంగా జరిపేందుకు ప్రతిఒక్కరూ సహకరించాలని అన్నవరం దేవస్థానం ఈఓ నాగేశ్వరరావు, ఆలయ అనువంశిక ధర్మకర్త ఎస్పీ రంగరాజ భట్టార్ కోరారు. -
నాలుగు గోపురాల వాడా..నమో నారసింహ..
–7న ఖాద్రీ లక్ష్మీ నారసింహుని బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ –8న శ్రీవారి కల్యాణోత్సవం –18న బ్రహ్మ రథోత్సవం ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి కదిరిలో నిత్య పూజలతో వెలుగొందుతున్నారు. స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 7 నుంచి పక్షం (15) రోజుల పాటు అత్యంత వైభవంగా జరగనున్నాయి. ఇక్కడ నారసింహుని ఆలయం నాలుగు గోపురాల నడుమ వెలసింది. అందుకే ‘నాలుగు గోపురాల వాడా.. నమో నారసింహా’ అంటారు. తూర్పు రాజగోపురాన్ని విజయనగర రాజు హరిహరరాయలు నిర్మించారు. పడమర రాజగోపురాన్ని క్రీ.శ 1469లో నృసింహుని భక్తురాలు సాసవుల చిన్నమ్మ నిర్మించినట్లు తెలుస్తోంది. ఉత్తర రాజ గోపురాన్ని ముస్లిం పాలకులు నిర్మించారు. ప్రతియేటా ముక్కోటి ఏకాదశి నాడు మాత్రమే ఈ గోపురం తలుపులు తెరుచుకుంటాయి. దీన్ని వైకుంఠ ద్వారం అంటారు. దక్షిణ రాజుగోపురాన్ని క్రీ.శ.1386లో కొక్కంటి పాలేగాళ్లు వీర మల్లప్ప నాయుడు కుటుంబీకులు నిర్మించారు. ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో ప్రతిరోజూ వివిధ అవతారాల్లో కదిరి తిరువీధుల్లో తమ భక్తులకు కనువిందు చేస్తారు. స్వేద బిందువులు చూడొచ్చు.. ప్రతినెలా స్వాతి నక్షత్రం రోజు మాత్రమే ఇక్కడి మూలవిరాట్‌కు అభిషేకం చేస్తారు. అభిషేకానంతరం చిన్నపిల్లలకు స్నానం చేయించిన తర్వాత ఎలాగైతే స్వేదబిందువులు శరీరంనుండి వెలువడతాయో స్వామివారి మూలవిరాట్ నుంచి కూడా స్వేద బిందువులను అప్పుడు చూడచ్చు. దీన్ని భక్తులు మహిమాన్వితంగా భావిస్తారు. స్వాతి నక్షత్రం రోజు జరిగే అభిషేకం చూడాలనుకునే భక్తులు రూ.750 చెల్లిస్తే ఇద్దరిని అనుమతిస్తారు. ఆలయ చరిత్ర కదిరి - అనంతపురం రహదారిలోని 16 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాతిరేపల్లి(నేటి పట్నం) రంగనాయకుడికి ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి స్వప్నం(కల)లో కన్పించి పుట్టలో ఉన్న విగ్రహాన్ని వెలికితీసి తనకు ఆలయం నిర్మించాలని కోరినట్లు బ్రహ్మాండ పురాణం ద్వారా తెలుస్తోంది. దీంతో ఆయన ఆ విగ్రహాన్ని వెలికితీసి, ప్రతిష్టించి గర్భగుడిని కట్టించినట్లు స్థలపురాణం చెబుతోంది. ఆ తర్వాత క్రీ.శ 1274లో శ్రీవీర బుక్కరాయలు కాలంలో పూర్తి స్థాయిలో ఆలయం నిర్మించినట్లు చరిత్రకారులు చెబుతున్నారు. భృగుతీర్థ స్నానం..పాప విమోచనం ఖాద్రీ దివ్యక్షేత్రానికి పడమటి వైపున అర్జున నదీ (మద్దిలేరు) తీరం ఉంది. అక్కడ భృగు మహర్షి తపస్సు చేసి.. స్వామి వారిని స్మరణం చేసుకున్నారు. ఆ మహర్షి కోరిక మేరకు శ్రీ వారు స్వయంగా శ్రీదేవి, భూదేవి సమేత ఉత్సవ విగ్రహాలు అందించినట్లు బ్రహ్మాండ పురాణం చెబుతోంది. అప్పుడు స్వామివారే స్వయంగా అందించిన ఉత్సవ విగ్రహాలే ఇప్పుడు జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో తిరువీధుల్లో భక్తులకు దర్శనమిస్తున్న శ్రీదేవి,భూదేవి సమేత లక్ష్మీ నారసింహుడు. భృగు మహర్షి తపస్సు ఫలితంగా ఖాద్రీ క్షేత్రంలో శ్రీవారు స్వయంభువుగా వెలిశారు. భృగు తీర్థంలో స్నానం చేసి, స్వామి వారిని దర్శించుకుంటే పాప విమోచనం కలుగుతుందని స్థల పురాణం చెబుతోంది. దేశంలోనే 3వ అతి పెద్ద తేరు బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఖాద్రీ లక్ష్మీనారసింహుడు ఈ నెల 18న రథోత్సవం సందర్భంగా బ్రహ్మరథంపై దర్శనమిస్తారు. ఆ రోజు లక్షలాదిమంది భక్తులు స్వామివారిని దర్శించుకోవడానికి తెలుగు రాష్ట్రాల నుంచే కాక కర్ణాటక రాష్ట్రం నుంచి కూడా విచ్చేస్తారు. తమిళనాడులోని అండాల్ అమ్మవారి శ్రీవల్లి పుత్తూరు రథం, తంజావూరు జిల్లాలోని తిరువార్ రథం తర్వాత 3వ అతిపెద్దది ఈ ఖాద్రీ నృసింహుని రథం. కదిరి కొండపై శ్రీవారి పాదముద్రికలు స్వామి వారి పాదాలు తాకితే ఈ జన్మకు ఇక చాలని ఏ భక్తుడైనా కోరుకుంటాడు. ఖాద్రీ లక్ష్మీ నారసింహుని పాద పద్మములు తాకాలంటే కదిరి కొండకు వెళ్లాల్సిందే. హిరణ్య కశ్యపుడిని సంహరించేందుకు శ్రీ మహా విష్ణువు సగం మనిషి, సగం సింహం రూపంలో అంటే నరసింహావతారమెత్తారు. ఉగ్రరూపంతో స్తంభం నుంచి ఆవిర్భవించారు. హిరణ్య కశ్యపుడి సంహారం అనంతరం ఉగ్రరూపంలో ఉన్న నారసింహుని ఆ రూపాన్ని ఉపసంహరించుకోవాలని ప్రహ్లాదుడు, దేవ దేవతలు, శ్రీదేవి, భూదేవిలు కదిరి కొండపై నుంచి ప్రార్థించారట. నృసింహుని మెప్పించేందుకు అక్కడి నుంచి వారంతా స్తోత్రం చేయడంతో స్వామి వారు అక్కడ దర్శనమిస్తారు. దీంతో ఆ పర్వతానికి ‘స్తోత్రాద్రి’ అనే పేరు వచ్చింది. ఆ సమయంలో స్వామి వారు అక్కడ మోపిన పాదాల గుర్తులు ఇప్పటికీ చెరిగిపోలేదు. కదిరి మల్లెలకు ప్రత్యేకత ఉంది కదిరి ప్రాంతంలో పండించే కదిరి మల్లెలు మనసును మైమరిపించే సువాసనలు వెదజల్లుతాయని భక్తులతో పాటు ఇక్కడ మల్లెపూలు విక్రయించేవారు చెబుతారు. పక్షం రోజుల పాటు సాగే ఈ బ్రహ్మోత్సవాల్లో స్వామివారిని కదిరి మల్లెలతోనే అలంకరిస్తారు. కదిరి దవణం నారసింహుడికి ఎంతో ఇష్టం కదిరి దవణం కూడా ఇక్కడి ప్రత్యేకతల్లో ఒక భాగం. కదిరి దవణంతో సెంట్లు, అత్తరు తయారు చేస్తారు. ముంబై, బెంగళూరు వంటి నగరాలకు కదిరి దవణం ఎగుమతి చేస్తుంటారు. కదిరి దవణం నారసింహుడికి ఎంతో ఇష్టమని, అందుకే బ్రహ్మరథోత్సవం నాడు దవణం కొనుక్కొని తేరుపైకి భక్తులు విసురుతుంటారు. గుబాళించే కదిరి కుంకుమ ఇక కదిరి కుంకుమ విషయానికొస్తే హిందూ సంప్రదాయంలో ముత్తయిదువులు కుంకుమ, గాజులు, పూలు, మంగళసూత్రాలు, కాలి మెట్టెలు పవిత్రంగా భావిస్తారు. వీటిని ప్రధానంగా ముత్తయిదువులు ధరిస్తారు. కదిరి కుంకుమ దైవ పూజల్లో, శుభకార్యాల్లో ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. ముత్తయిదువులు నుదుటున కదిరి కుంకుమ పెట్టుకున్నట్లైతే ఆ పరిసర ప్రాంతాల్లో ఆ సువాసన అట్లే పసిగట్టవచ్చు. అందుకే బ్రహ్మోత్సవాలకు విచ్చేసే భక్తులు తమవెంట కదిరి మల్లెలు, కదిరి కుంకుమ, కదిరి దవణంను విధిగా తీసుకెళ్తుంటారు. ఆలయంలో శ్రీవారి దర్శనం వేళలు ఖాద్రీ లక్ష్మీ నరసింహ స్వామి సుప్రభాత సేవతో మేల్కొల్పుతారు. పూజల అనంతరం ఉదయం 6 నుంచి 7.30 వరకు సర్వదర్శనం ఉంటుంది. తర్వాత 7.30 నుంచి 9.30 గంటల వరకు శ్రీవారికి అభిషేకం నిర్వహిస్తారు. అభిషేకం కోసం వెళ్లిన భక్తుల దర్శనానంతరం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు మళ్లీ సర్వదర్శనం ఉంటుంది. తిరిగి సాయంత్రం 5.30 గంటల నుంచి 7 గంటల వరకు, తర్వాత నైవేద్యం అనంతరం రాత్రి 8.30 గంటల వరకు సర్వదర్శనం ఉంటుంది. శాశ్విత పూజలు భక్తులు రూ. లక్ష విరాళం చెల్లిస్తే వారిని ‘మహారాజ పోషకులు’గా గుర్తించి, వారు కోరిన రోజున ఏడాదికి ఒక్క రోజు చొప్పున 10 ఏళ్ల పాటు శ్రీవారికి అభిషేకం చేస్తారు. ఈ అభిషేకానికి వారి తరఫున ఆరుగురు భక్తులకు అనుమతిస్తారు. రూ. 50 వేలు చెల్లించిన వారిని ‘రాజపోషకులు’గా పిలుస్తారు. వీరి తరఫున నలుగురిని 10 ఏళ్లపాటు అభిషేకానికి అనుమతిస్తారు. రూ.25 వేలు చెల్లించిన భక్తులు ‘పోషకులు’గా పిలవబడతారు. వీరిలో ఏడాదికి ఒక్క రోజు చొప్పున ఇరువురిని అభిషేకానికి 10 ఏళ్లపాటు అనుమతిస్తారు. రూ.10 వేలు చెల్లిస్తే దాతలుగా గుర్తించి ఇద్దరికి ప్రత్యేక దర్శనం 5 ఏళ్లపాటు ఉంటుంది. ఇవి కాకుండా ప్రత్యేకంగా శ్రీవారికి కల్యాణం చేయించాలంటే రూ. 4 వేలు, ఉయ్యాలోత్సవానికి రూ.516 చెల్లిస్తే చాలు. ప్రతిరోజూ జరిగే అభిషేకానికి రూ.300 చెల్లిస్తే ఇద్దరు భక్తులను అనుమతిస్తారు. భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు : ఆలయ సహాయ కమిషనర్ దొడ్డా వెంకటేశ్వరరెడ్డి బ్రహ్మోత్సవాల్లో రోజంతా నిత్యాన్నదానం ఉంటుంది. శ్రీవారి కల్యాణోత్సవంతో పాటు భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేసే బ్రహ్మరథోత్సవానికి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నాం. సుదూర ప్రాంతాల నుండి విచ్చేసే భక్తులకు అద్దె గదులున్నాయి. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ ప్రాంగణమంతా సీసీ కెమెరాల నిఘా ఉంది. బ్రహ్మోత్సవాలు పూర్తయ్యేవరకూ ఆలయం ముందు పోలీస్ ఔట్‌పోస్ట్ కూడా ఉంటుంది. సామాన్య భక్తులకే మొదటి ప్రాధాన్యత – ఆలయ పాలక మండలి చైర్మన్ పచ్చిపులుసు నరేంద్రబాబు బ్రహ్మోత్సవాలకు భారీ ఏర్పాట్లు చేస్తున్నాం. ముఖ్యంగా సామాన్య భక్తులకు ఎటువంటి ఆటంకం కలగకూడదన్నదే మా ఉద్దేశ్యం. ఖాద్రీ లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు ఇంతటి గొప్పగా మరెక్కడా జరగవు. రాష్ట్ర నలుమూలల నుంచే కాకుండా తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేస్తారు. రథోత్సవం నాడు సుమారు 5 లక్షల మంది దాకా భక్తులు పాల్గొంటారు. నేను కూడా ఇక్కడ స్వామివారికి ఒక సేవకున్ని మాత్రమే. పరిసర ప్రాంతాల్లో చూడదగ్గ ప్రదేశాలు కదిరి లక్ష్మీ నారసింహుని దర్శించు కున్న పిమ్మట కదిరి–రాయచోటి రోడ్డు మార్గంలో కేవలం 12 కి.మీ దూరంలో గాండ్లపెంట మండలం కటారుపల్లిలో యోగి వేమన సమాధిని చూడవచ్చు. తర్వాత అదే మార్గంలో మరో 15 కి.మీ దూరంలో ఎన్పీ కుంట మండలం గూటిబైలు గ్రామంలో ఉన్న ప్రపంచ ప్రసిద్ధి గాంచిన తిమ్మమ్మ మర్రిమానును సందర్శించవచ్చు. వీటిని చూసేందుకు కదిరి ఆర్టీసీ బస్టాండ్ నుంచి బస్సు సౌకర్యం కూడా ఉంది. పుట్టపర్తి కూడా ఇక్కడికి 40 కి.మీ మాత్రమే. ఏరోజు ఏ ఉత్సవం?: మార్చి 7న అంకురార్పణం 8వ తేదీ కళ్యాణోత్సవం 9వ తేదీ హంసవాహనం 10వ తేదీ సింహ వాహనం 11వ తేదీ హనుమద్ వాహనం 12వ తేదీ బ్రహ్మ గరుడోత్సవం 13వ తేదీ శేషవాహనం 14వ తేదీ సూర్య చంద్ర ప్రభ 15వ తేదీ మోహినీ ఉత్సవం 16వ తేదీ ప్రజా గరుడ సేవ 17వ తేదీ గజ వాహనం 18వ తేదీ బ్రహ్మ రథోత్సవం 19వ తేదీ అశ్వవాహనం 20వ తేదీ తీర్థవాది 21వ తేదీ పుష్పయాగోత్సవం ==== -
నరసన్న పెళ్లికొడుకాయెనే..
∙అంతర్వేదిలో కల్యాణోత్సవాలకు శ్రీకారం ∙బుగ్గన చుక్క, నొసట తిలకంతో దర్శనమిచ్చిన స్వామి మాడవీధుల్లో సూర్య, చంద్రప్రభ వాహనాలపై ఉత్సవం అంతర్వేదిలో లక్షీ్మనృసింహస్వామివారి వార్షిక దివ్య తిరు కల్యాణ మహోత్సవాలు శుక్రవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. సూర్యభగవానుడి జన్మదినం రోజైన రథసప్తమి నాడు స్వామిని నవవరుడిని చేశారు. బుగ్గన చుక్క, నొసటన తిలకం, పట్టువస్రా్తలు ధరించి పెళ్లికొడుకుగా సిగ్గులొలుకుతూ దర్శనమిచ్చిన శ్రీవారిని చూసి భక్తులు తన్మయత్వం చెందారు. సఖినేటిపల్లి / మలికిపురం ఏటా మాదిరి ముద్రికాలంకరణ(శ్రీవారిని పెళ్లికుమారుని, అమ్మవారిని పెళ్లి కుమార్తె చేసే కార్యక్రమం)ను కేశవదాసుపాలేనికి చెందిన బెల్లంకొండ, ఉండపల్లి కుటుంబాల వారు ఆలయ అర్చకుల సమక్షంలో ఘనంగా జరిపించారు. సాయంత్రం 6.30 గంటలకు ధూపసేవ అనంతరం ప్రధాన అర్చకుడు పాణింగిపల్లి శ్రీనివాస కిరణ్, వేదపండితుడు చింతా వేంకటశాస్త్రి, స్థానాచార్య వింజమూరి రామరంగాచార్యులు, అర్చకస్వాములు శ్రీవారికి, అమ్మవారికి వైఖానసాగమానుసారం, శ్రీవైష్ణవ సంప్రదాయ ప్రకారం విశేష పూజలు చేశారు. మామిడాకులు భస్మం చేయగా వచ్చిన బూడిదతో బుగ్గన చుక్కపెట్టి, ఉంగరం తొడిగి పెళ్లికుమారుడు, పెళ్లికుమార్తెను చేసే తంతును పూర్తిచేశారు. ఆనవాయితీగా రథసప్తమి పర్వదినాన కేశవదాసుపాలేనికి చెందిన బెల్లంకొండ, ఉండపల్లి కుటుంబాల వారు సంప్రదాయబద్ధంగా స్వామివారికి అభిషేకాలు నిర్వహించారు. స్వామికి బెల్లంకొండ, అమ్మవారికి ఉండపల్లి కుటుంబీకులు నూతన వస్రా్తలను సమర్పించుకున్నారు. వారు ఏర్పాటు చేసిన అన్నదానంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని, స్వామి ప్రసాదాన్ని తీసుకున్నారు. ఆలయ అసిస్టెంట్ కమిషనర్ చిక్కాల వెంకట్రావు పాల్గొన్నారు. ఆలయ నిర్మాత కృష్ణమ్మకు నివాళులు అంతర్వేదిలో కల్యాణోత్సవాలు ప్రారంభం సందర్భంగా ఆలయ నిర్మాత కొపనాతి కృష్ణమ్మ విగ్రహానికి పలువురు ప్రముఖులు, అధికారులు, ప్రజాప్రతినిధులు, ట్రస్టీలు, ఉత్సవ సేవాకమిటీ సభ్యులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఏటా ఉత్సవాలు ప్రారంభానికి ముందు పుణ్యక్షేత్రంలో ఉన్న ఆయన నిలువెత్తు విగ్రహం వద్ద నివాళులు అర్పించడం ఆనవాయితీ. తూర్పు వీధి(మెరకవీధి)కి చేరిన రథం.. స్వామి కల్యాణ మహోత్సవాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచేది రథోత్సవం. ఈ వేడుక ఈనెల ఏడోతేదీ భీష్మ ఏకాదశి పర్వదినాన మెరక వీధి నుంచి మొదలవుతుంది. ఏడాది పొడవునా ఆలయం వద్ద ఉండే రథానికి ఉత్సవాల సందర్భంగా అవసరమైన మరమ్మతులు చేసి, రంగు రంగులతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. మధ్యాహ్నం రాజకీయ ప్రముఖులు, అధికారులు, ట్రస్టీలు, సేవా కమిటీ సభ్యులు, అర్చకులు రథం వద్ద పూజలు చేసి కొబ్బరికాయలు కొట్టారు. అనంతరం గోవింద నామస్మరణల మధ్య రథాన్ని మెరకవీధికి తోడ్కొని వెళ్లారు. ఉత్సవాల తొలిరోజు సాయంత్రం సూర్యవాహనంపైన, రాత్రి చంద్రప్రభ వాహనంపైన కొలువుదీరిన శ్రీస్వామి మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. స్వామివారిని... దర్శించుకున్నారు. అంతర్వేదిలో నేడు.. శ్రీలక్షీ్మనృసింహస్వామి కల్యాణోత్సవాల్లో భాగంగా రెండో రోజు శనివారం సాయంత్రం నాలుగు గంటలకు హంసవాహనంపైన, రాత్రి ఏడు గంటలకు శేషవాహనంపైన గ్రామోత్సవం నిర్వహించనున్నారు. సాయంత్రం ధూపసేవ అనంతరం ధ్వజారోహణ నిర్వహించనున్నారు. పూర్ణాహుతితో ముగిసిన క్రతువులు అయినవిల్లి : అయినవిల్లి విఘ్నేశ్వరుని ఆలయంలో మూడురోజుల పాటు నిర్వహిస్తున్న క్రతువులకు శుక్రవారం పూర్ణాహుతి కార్యక్రమంతో ముగింపు పలికారు. ఆలయ ప్రధానార్చకులు మాచరి సూరిబాబు ఆధ్వర్యంలో స్వామిని పంచామృతాలతో అభిషేకించారు. లక్షగరిక పూజలు చేశారు. వేదపండితులు పూర్ణాహుతి కార్యక్రమంతో స్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజలకు ముగింపు పలికారు. విద్యార్థుల కోసం చదువుల పండుగ నిర్వహించారు. కార్యక్రమంలో పండితులు విద్యార్థుల నాలుకపై బీజాక్షరాలను లిఖించారు. ఆలయ చైర్మ¯ŒS రావిపాటి సుబ్బరాజు, ఆలయ ఈఓ ముదునూరి సత్యనారాయణరాజు, ధర్మకర్తల మండలి సభ్యులు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఆదివారం ఎమ్మెల్యే పులపర్తి నారాయణమూర్తి చేతులు మీదుగా స్వామివారి ప్రసాదంగా విద్యార్థులకు పెన్నులను పంపిణీ చేసేందుకు ఏర్పాటు చేశామని ఈఓ తెలిపారు. -
నూతన జిల్లాలను స్వాగతిస్తున్నాం
కరీంనగర్‌ఎడ్యుకేషన్: రాష్ట్రంలోని జోనల్ వ్యవస్థ రద్దును సమర్థిస్తూ, నూతన జిల్లాల ఏర్పాటును స్వాగతిస్తున్నట్లు తెలంగాణ టీచర్స్ యూనియన్ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు ఎ.నర్సింహస్వామి పేర్కోన్నారు. గురువారం నగరంలో యూనియన్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర అభివద్దికి ఆటంకంగా ఉండడంతో పాటు నిరుద్యోగులకు ఆశనిపాతంలా ఉన్న జోనల్ వ్యవస్థ రద్దును సమర్థిస్తున్నామని, నూతన జిల్లాల ఏర్పాటు పూర్తిగా శాస్త్రీయంగా ఉందని వీటిని స్వాగతిస్తున్నామని అన్నారు. సమావేశంలో యూనియన్ జిల్లా అధ్యక్షుడు బైరం హరికిరణ్, నాయకులు జి.వేణుగోపాలస్వామి, సాదిక్మస్రత్ అలీ, నూనవత్ రాజు, వెంకటస్వామి, వేణుగోపాల్, సంతోష్‌కుమార్, మన్సూర్, గణేష్, అశోక్‌కుమార్, లక్ష్మయ్య, రాంమూర్తి, వెంకటేశ్వర్లు, చంద్రమోహన్ పాల్గొన్నారు. -
సంపాదిత సెలవుల నిల్వకు ఉత్తర్వులు ఇవ్వాలి
భీమదేవరపల్లి: వేసవి సెలవుల్లో మధ్యాహ్న భోజన విధులు నిర్వహించిన ఉపాధ్యాయులకు సంపాదిత సెలవులను నిల్వ చేసుకోడానికి ఉత్తర్వులు ఇవ్వాలని తెలంగాణ టీచర్స్ యూనియన్ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు డాక్టర్ ఏరుకొండ నర్సింహాస్వామి అన్నారు. మండలంలోని ముల్కనూర్‌లో ఆ సంఘం మండల శాఖ అధ్యక్షుడు కర్రె సాంబమూర్తి అధ్యక్షతన ఆదివారం సమావేశం జరిగింది. ఈ సందర్భంగా నర్సింహస్వామి మాట్లాడుతూ పదవీ విరమణ పొందుతున్న ఉపాధ్యాయులకు ఈఎల్స్ మంజూరు ఉత్తర్వులు ఇచ్చి వారి సేవ పుస్తకంలో నమోదు చేయాలన్నారు. రాష్ట్ర కార్యదర్శులు దస్తరి శంకరయ్య, లింగ్యానాయక్ మాట్లాడుతూ జోనల్ వ్యవస్థ రద్దుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవడాన్ని తాము స్వాగతిస్తున్నట్లు తెలిపారు. ఇందులో నాయకులు మంగ అమరేందర్, గుర్రం శ్రీనివాస్, గుర్రం సాంబయ్య, బత్తిని తిరుపతి, వెంకటస్వామి, సమ్మిరెడ్డి, అంజన్‌కుమార్, భిక్షపతి, రాజయ్య, శ్రీనివాస్, సునంద, మాధవి, జ్యోతి ఉన్నారు. -
నాంపల్లిగుట్ట గ్యాంగ్ అరెస్టు
ముగ్గురిపై రౌడీషీట్ ఆటో, కత్తి, నగదు స్వాధీనం త్వరలో పోలీస్ ఔట్‌పోస్టు వేములవాడ : వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామివారిని దర్శించుకున్న భక్తులు నాంపల్లి శ్రీలక్ష్మీనర్సింహస్వామి వారి దర్శనం కోసం సమీపంలోని నాంపల్లిగుట్టపైకి వెళ్తుంటారు. ఈ క్రమంలో గుట్టపై గూండాగిరి చేస్తూ భక్తులను ఇబ్బంది పెడుతున్న గ్యాంగ్‌ను పోలీసులు సోమవారం పట్టుకున్నారు. నాంపల్లి గ్రామానికి చెందిన దండుగుల నవీన్, బోదాసు మహేశ్, శివరాత్రి పర్శరాంను అదుపులోకి తీసుకున్నారు. సిరిసిల్ల డీఎస్పీ సుధాకర్ సోమవారం వీరిని అరెస్ట్ చూపారు. నిందితుల నుంచి ఓ ఆటో (ఏపీ 15 టీబీ 9663), రూ.7,600, సెల్‌ఫోన్, రెండు పాస్‌పోర్టులు స్వాధీన పరచుకున్నట్లు చెప్పారు. నవీన్, పర్శరాం పాస్‌పోర్టులను సీజ్ చేసినట్లు చెప్పారు. ముగ్గురిపై రౌడీషీట్ ఓపెన్ చేసినట్లు ప్రకటించారు. నాంపల్లి గ్రామంలోని వడ్డెర కులానికి చెందిన వీరు కొన్నేళ్లుగా గల్ఫ్‌కు వెళ్లి ఇటీవలే తిరిగొచ్చారని తెలిపారు. నాంపల్లి గుట్టకు వస్తున్న యువతీయువకులను, భక్తులను బెదిరిస్తూ దోపిడీలు, దొంగతనాలు చేస్తున్నారని పేర్కొన్నారు. గత నెల 30న నాంపల్లికి వచ్చిన పార్వతి అరుణ్‌కుమార్(సిరిసిల్ల) ఫిర్యాదు మేరకు గ్యాంగ్‌ను పట్టుకున్నట్లు తెలిపారు. గ్యాంగ్‌ను పట్టుకోవడంలో కృషి చేసిన సీఐ శ్రీనివాస్ నేతృత్వంలో జీవన్, శ్రీనివాస్, రమేశ్, అనిల్‌ను డీఎస్పీ అభినందించారు. నాంపల్లి గుట్టపైకి చేరుకుంటున్న భక్తులకు మరింత భద్రత కల్పించేందుకు పోలీసు ఔట్‌పోస్టు ఏర్పాటు చేస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు. ఇప్పటికీ పీటీజెడ్ సీసీ కెమెరాలను బిగించామని, సుమారు కిలో మీటర్ వరకు ఏం జరిగినా ఇందులో రికార్డు అవుతుందని పేర్కొన్నారు. రాత్రి 9 గంటల తర్వాత గుట్టపైకి ఎవరినీ అనుమతించమని తెలిపారు. -
రాష్ర్టంలో ప్రజా వ్యతిరేక పాలన
మురికి వాడల అభివృద్ధి మండలి మాజీ అధ్యక్షుడు జె.నరసింహస్వామి ఎత్తినహొళె పేరుతో ఇంకా మోసం చేస్తున్న మొయిలీ దొడ్డబళ్లాపురం : రాష్ర్టంలో ప్రజా వ్యతిరేక పాలన సాగుతోందంటూ మురికి వాడల అభివృద్ధి మండలి మాజీ అధ్యక్షుడు జె.నరసింహస్వామి విమర్శించారు. కాంగ్రెస్ పాలనపై ప్రజలు విసుగెత్తిపోయారని తెలిపారు. రాబోవు ఎన్నికల్లో ఆ పార్టీకి గుణపాఠం చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. స్థానిక బీజేపీ కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బయలు సీమ జిల్లాలకు శాశ్వత నీటి వనరులు కల్పించాలంటూ యువమోర్చా ఆధ్వర్యంలో చిక్కబళ్లాపురం నుంచి బెంగళూరుకు 300 మంది కార్యకర్తలు చేపట్టిన పాదయాత్రను ప్రభుత్వం నిర్ధయగా అణిచి వేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ర్టంలో బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి సిద్ధరామయ్య చేపట్టిన పాదయాత్రను అప్పటి ప్రభుత్వం అడ్డుకోలేదని గుర్తు చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో సమస్యలపై నిలదీసేందుకు ప్రతి ఒక్కరికీ హక్కు ఉందని, ఈ విషయంపై కనీస పరిజ్ఞానం కూడా రాష్ర్ట ప్రభుత్వానికి లేకుండా పోయిందని మండిపడ్డారు. ఎత్తినహొళె పథకం పేరుతో ఇప్పటికీ బయలుసీమ ప్రజలను ఎంపీ వీరప్ప మొయిలీ మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పథకం పూర్తి అయ్యే అవకాశమే లేదన్నారు. అక్కడి నుండి నీరు తరలించడానికి దక్షిణ కన్నడ జిల్లా వాసులు అంగీకరించడం లేదని స్పష్టం చేశారు. దమ్ముంటే రాజీనామా ఇవ్వండి ‘తాలూకాలో బెంగళూరు చెత్త డంపింగ్ చేయడానికి అనుమతులిచ్చింది బీజేపీ హయాంలో, నరసింహస్వామి ఎమ్మెల్యేగా ఉన్న కాలంలోనే, కావున పాపం ఆయనదే’ అంటూ స్థానిక ఎమ్మెల్యే వెంకటరమణయ్య ప్రకటనలివ్వడం పట్ల నరసింహస్వామి ఫైర్ అయ్యారు. తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తాలూకాలో బీబీఎంపీ బెంగళూరు చెత్త వేయడానికి స్థలాన్ని గుర్తిస్తే అప్పటి ముఖ్యమంత్రి జగదీష్ శెట్టర్‌కు రాజీనామా ఇచ్చి ఆ ప్రయత్నాన్ని అడ్డుకున్నానని గుర్తు చేశారు. ఇప్పటి ఎమ్మెల్యే వెంకటరమణయ్యకు తాలూకా ప్రజల సంక్షేమం పట్ల శ్రద్ధ ఉంటే తాను కూడా ముఖ్యమంత్రికి రాజీనామా ఇచ్చి అడ్డుకోవాలని సవాలు విసిరారు. పాత్రికేయుల సమావేశంలో జిల్లా బీజేపీ కమిటీ అధ్యక్షుడు బీసీ నారాయణస్వామితోపాటు పలువురు బీజేపీ నేతలు హాజరయ్యారు.