- ముగ్గురిపై రౌడీషీట్
- ఆటో, కత్తి, నగదు స్వాధీనం
- త్వరలో పోలీస్ ఔట్‌పోస్టు
నాంపల్లిగుట్ట గ్యాంగ్ అరెస్టు
Published Tue, Aug 9 2016 12:01 AM | Last Updated on Wed, Sep 26 2018 6:09 PM
వేములవాడ : వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామివారిని దర్శించుకున్న భక్తులు నాంపల్లి శ్రీలక్ష్మీనర్సింహస్వామి వారి దర్శనం కోసం సమీపంలోని నాంపల్లిగుట్టపైకి వెళ్తుంటారు. ఈ క్రమంలో గుట్టపై గూండాగిరి చేస్తూ భక్తులను ఇబ్బంది పెడుతున్న గ్యాంగ్‌ను పోలీసులు సోమవారం పట్టుకున్నారు. నాంపల్లి గ్రామానికి చెందిన దండుగుల నవీన్, బోదాసు మహేశ్, శివరాత్రి పర్శరాంను అదుపులోకి తీసుకున్నారు. సిరిసిల్ల డీఎస్పీ సుధాకర్ సోమవారం వీరిని అరెస్ట్ చూపారు. నిందితుల నుంచి ఓ ఆటో (ఏపీ 15 టీబీ 9663), రూ.7,600, సెల్‌ఫోన్, రెండు పాస్‌పోర్టులు స్వాధీన పరచుకున్నట్లు చెప్పారు. నవీన్, పర్శరాం పాస్‌పోర్టులను సీజ్ చేసినట్లు చెప్పారు. ముగ్గురిపై రౌడీషీట్ ఓపెన్ చేసినట్లు ప్రకటించారు. నాంపల్లి గ్రామంలోని వడ్డెర కులానికి చెందిన వీరు కొన్నేళ్లుగా గల్ఫ్‌కు వెళ్లి ఇటీవలే తిరిగొచ్చారని తెలిపారు. నాంపల్లి గుట్టకు వస్తున్న యువతీయువకులను, భక్తులను బెదిరిస్తూ దోపిడీలు, దొంగతనాలు చేస్తున్నారని పేర్కొన్నారు. గత నెల 30న నాంపల్లికి వచ్చిన పార్వతి అరుణ్‌కుమార్(సిరిసిల్ల) ఫిర్యాదు మేరకు గ్యాంగ్‌ను పట్టుకున్నట్లు తెలిపారు. గ్యాంగ్‌ను పట్టుకోవడంలో కృషి చేసిన సీఐ శ్రీనివాస్ నేతృత్వంలో జీవన్, శ్రీనివాస్, రమేశ్, అనిల్‌ను డీఎస్పీ అభినందించారు. నాంపల్లి గుట్టపైకి చేరుకుంటున్న భక్తులకు మరింత భద్రత కల్పించేందుకు పోలీసు ఔట్‌పోస్టు ఏర్పాటు చేస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు. ఇప్పటికీ పీటీజెడ్ సీసీ కెమెరాలను బిగించామని, సుమారు కిలో మీటర్ వరకు ఏం జరిగినా ఇందులో రికార్డు అవుతుందని పేర్కొన్నారు. రాత్రి 9 గంటల తర్వాత గుట్టపైకి ఎవరినీ అనుమతించమని తెలిపారు.
Advertisement
Advertisement