
సూపర్‌స్టార్‌ను అధిగమించిన కాజల్
సూపర్‌స్టార్ రజనీకాంత్‌ను అధిగమించారు నటి కాజల్ అగర్వాల్. ప్రతి ఏడాది అధిక ఆదాయం, ప్రాచుర్యం పొందిన వారి పట్టికను ఒక సర్వే సంస్థ విడుదల చేస్తుంది. అలా ఈ ఏడాది అధిక ఆదాయం, ప్రాచుర్యం పొందిన వారిలో రజనీకాంత్, హిందీ నటుడు అభిషేక్ బచ్చన్, దర్శకుడు రాజమౌళిలను నటి కాజల్ అగర్వాల్ అధిగమించారు.
దీని గురించి ఈ ముద్దుగుమ్మ స్పందిస్తూ విజయానికి ఆదాయం, ప్రాచుర్యం కారణం అవుతాయన్నారు.నటిగా తాను కఠినంగా శ్రమిస్తానన్నారు. అందుకు ఫలితమే ఈ స్టార్ అంతస్తు అన్నారు.హీరోయిన్ల కంటే హీరోలకు అధిక పారితోషికం ఉంటుందిగా అని అడుగుతున్నారని, ఇంతకు ముందు అలాంటి పరిస్థితి ఉండేదన్న మాట వాస్తమేనన్నారు. అయితే ఇప్పుడా విధానంలో మార్పు వస్తోందని అన్నారు. ఆదాయం అనేది శ్రమను బట్టి ఉంటుందని పేర్కొన్నారు.
ఒక చిత్రానికి ఎన్ని రోజులు పని చేస్తున్నాం, ఎంత శ్రమను దారపోస్తున్నాం అన్నదాని బట్టి పారితోషికం పెంపు ఉంటుందని అన్నారు. ఈ విషయంలో తానెవరినీ విమర్శించనని అన్నారు. ఇకపోతే మనకు లభించే కథా పాత్రలు అదృష్టాన్ని బట్టి అమరుతాయన్నారు.ఇప్పుడు హీరోయిన్లు కఠిన శ్రమకు సిద్ధం అవుతున్నారని పేర్కొన్నారు. ఉదాహరణకు నటి అనుష్కను తీసుకోవచ్చునన్నారు. అరుంధతి, రుద్రమదేవి, ఇంజి ఇడుప్పళగి చిత్రాల కోసం ఆమె ఎంతగా శ్రమించారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదని కాజల్ అగర్వాల్ అన్నారు.