కందుకూరు బైపాస్‌కి కొత్త కష్టాలు
Published Tue, Sep 20 2016 11:28 AM | Last Updated on Mon, Sep 4 2017 2:16 PM
కందుకూరు బైపాస్ రోడ్డు బాలారిష్టాల నుంచి బయటపడలేకపోతోంది. మూడు సంవత్సరాల తరువాత నిర్మాణంలో కదలిక వచ్చిందనుకునే తరుణంలో కొత్త సమస్యలు తలెత్తుతున్నాయి. ఆర్‌అండ్‌బీ అధికారుల ఏకపక్ష నిర్ణయంతో భూమి సర్వే దశలోనే పెద్ద సమస్య ఎదురైంది. పేదలకు పట్టాలు ఇచ్చిన స్థలంలో ఈ బైపాస్ రోడ్డు నిర్మాణ అలైన్‌మెంట్ రూపొందించడమే కారణమైంది. దీంతో ఇప్పుడు ఈ సమస్యను ఎలా అధిగమించాలో తెలియక అధికారులు తలలు పట్టుకుంటున్నారు.
కందుకూరు : పట్టణంలో ఇరుకైన రోడ్లతో నిత్యం ట్రాఫిక్ పెను సమస్యగా మారింది. దీనిని అధిగమించేందుకు గత ప్రభుత్వ హయాంలో బైపాస్ రోడ్డు నిర్మాణానికి రూ. 25 కోట్లు మంజూరు చేశారు. రోడ్లు, భవనాల శాఖ ఉన్నతాధికారుల నుంచి అలైన్‌మెంట్‌కు అనుమతి రావడంతో పాటు, భూసేకరణకు నిధులు విడుదల చేయడంతో రోడ్డు నిర్మాణ పనుల్లో ఇటీవలే కదలిక వచ్చింది. దీంతో రోడ్డుకు సంబంధించి భూసేకరణను చేసేందుకు రెవెన్యూ అధికారులు నలుగురు సర్వేయర్‌లను కేటాయించి పనులు మొదలు పెట్టారు. అలైన్‌మెంట్ సమ్మర్‌స్టోరేజ్ ట్యాంకు పక్కన పేదలకు ఇచ్చిన పట్టాల్లో గుండా వెళ్తుంది. దీంతో పట్టాల్లో ఎలా రోడ్డు నిర్మాణం చేస్తారంటూ, అక్కడ భూసేకరణ ఎలా చేయాలనే సమస్య రెవెన్యూ అధికారుల్లో ప్రస్తుతం ఉత్పన్నమైంది. ఈ సమస్యపై ఇప్పుడు ఇరుశాఖల అధికారులు మదన పడుతున్నారు.
ఇదీ అలైన్‌మెంట్
ఆర్‌అండ్‌బీ అధికారులు రూపొందించిన బైపాస్‌రోడ్డు అలైన్‌మెంట్ ప్రకారం రూ. 25 కోట్లతో మొత్తం 9.6 కిలోమీటర్ల మేర పట్టణానికి వెలుపల డబుల్‌రోడ్డు నిర్మించాల్సి ఉంది. ఇది ప్రస్తుతం ఓవీరోడ్డులోని మాల్యాద్రికాలనీ వద్ద ప్రారంభమై గడ్డంవారికొస్టాలు మీదుగా విక్కిరాలపేట రోడ్డు దాటి లుంబినివనం పై నుంచి సమ్మర్‌స్టోరేజ్ సమీపం నుంచి వెళ్తుంది. అక్కడి నుంచి కోవూరు రోడ్డు దాటి, శ్రీరామ్‌కాలనీ వద్ద కనిగిరి రోడ్డులో, అక్కడ నుంచి ప్రశాంతికాలనీ వద్ద మాలకొండరోడ్డులో కలుస్తుంది. అయితే సమ్మర్‌స్టోరేజ్ ట్యాంకు సమీపంలో చేపట్టాల్సిన రోడ్డు నిర్మాణమే ఇప్పుడు సమస్యగా మారింది. సర్వేనంబర్ 297/26లో మూడేళ్ళ క్రితం రెవెన్యూ అధికారులు లేఅవుట్ వేసి 1200 మందికి పైగా పట్టాలు ఇచ్చారు కానీ పొజిషన్ చూయించలేదు. ఈ పొజిషన్ కోసమే రెండేళ్ళ నుంచి పేదలు ఆందోళన చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సర్వేనంబర్‌లోనే 100 అడుగుల బైపాస్‌రోడ్డు వెళ్తుంది. దీంతో వందల పట్టాలు రద్దు చేయాల్సి వస్తుంది. సోమవారం సర్వేకు వెళ్లిన సర్వేయర్లు ఈ సమస్యను గుర్తించి తలపట్టుకున్నారు. సమస్యను రెవెన్యూ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు.
అలైన్‌మెంట్ మార్చాల్సిందేనా...
ఆర్‌అండ్‌బీ అధికారులు అలైన్‌మెంట్ రూపొందించే సమయంలో తమను సంప్రదించనందు వల్ల ఈ సమస్య వచ్చిపడిందంటున్నారు రెవెన్యూ అధికారులు. ప్రస్తుతం పట్టాలు క్యాన్సిల్ చేసే పరిస్థితి లేదని అలైన్‌మెంట్ మార్చుకోవాల్సి ఉంటుందని చెప్తున్నారు. కొత్త అలైన్‌మెంట్ అంటే మళ్లీ ఉన్నతాధికారుల అనుమతి కోసం పంపాల్సి ఉంటుంది. ఇప్పటికే రెండు అలైన్‌మెంట్‌లు తయారు చేసిన ఆర్‌అండ్‌బీ అధికారులు అనుమతులు తెచ్చుకోవడానికి రెండేళ్లు పట్టింది. మరోసారి అలైన్‌మెంట్ మార్చి అనుమతులు పొందాలంటే ఇంకెంత సమయం పడుతుందో మరీ.
సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తా: మల్లిఖార్జున,ఆర్డీఓ
బైపాస్‌రోడ్డు అలైన్‌మెంట్ మార్చుకోవాలని సూచిస్తున్నాం. అలాగే ప్రస్తుతం ఉత్పన్నమైన సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తాను. అక్కడి నుంచి ఏ ఆదేశాలు వస్తే వాటి ప్రకారమే తదుపరి చర్యలు తీసుకుంటాం.
Advertisement
Advertisement