కందుకూరు పట్టణ వ్యూ
కందుకూరు: రెవెన్యూ అధికారుల తప్పిదాలు, కాసుల కక్కుర్తి.. ప్రజలను నానా ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ప్రధానంగా భూముల వ్యవహారంలో రెవెన్యూ లీలలు అన్నీ ఇన్నీ కావు. సొంత భూమిని ప్రభుత్వ భూమిగా, ప్రభుత్వ భూమిని సొంత భూములుగా రికార్డుల్లో నమోదు చేసి ప్రజలకు చుక్కలు చూపిస్తున్నారు. కందుకూరు పట్టణంలో రెవెన్యూ శాఖ అధికారులు చేసిన తప్పిదాలే ఇందుకు నిదర్శనం. కందుకూరు పట్టణంలోని భూ రికార్డుల ఆన్‌లైన్‌లో వారు చేసిన పొరపాట్లే ప్రజలకు శాపాలుగా మారాయి. దీంతో తమ భూములకు సంబంధించి అన్ని హక్కులున్నా ఏ లావాదేవీలు నిర్వహించుకోలేని దుస్థితిని పట్టణ వాసులు ఎదురవుతోంది.
కందుకూరు పట్టణం గ్రామీణ ప్రాంతం నుంచి పంచాయతీగా పంచాయతీ నుంచి మున్సిపాలిటీగా రూపాంతరం చెంది దశాబ్దాలు గడిచిపోయాయి. ఈ మధ్య కాలంలో పట్టణంలో భూములకు సంబంధించి ఎన్నో లావాదేవీలు జరిగాయి. వీటిలో ప్రభుత్వ భూములు, జనార్దనస్వామి మాన్యాలు, అసైన్‌మెంట్ భూములు ఇలా పలు రకాల భూములున్నాయి. వీటిలో కొందరికి పట్టాలు పుట్టించుకుంటే, కొందరు మార్కెట్ ధర ప్రకారం ప్రభుత్వం నుంచి భూములు కొనుగోలు చేసుకుని హక్కులు సంపాదించిన వారు ఉన్నారు. ఈ మేరకు రెవెన్యూ రికార్డుల్లో మార్పులు చేయాల్సిన అధికారులు ఆ విషయాన్ని పట్టించుకోలేదు. దీంతో భూములపై అన్ని హక్కులు ఉన్నా కొందరి భూములు ఇంకా ప్రభుత్వ జాబితాలోనే ఉన్నాయి. పైగా గడిచిన రెండు, మూడేళ్లలో రెవెన్యూ రికార్డులను పూర్తిగా ఆన్‌లైన్ చేశారు. ఏ సర్వే నంబర్‌లోని భూములు ఎవరి పేరుపై ఉన్నాయి, ఏ జాబితాలో ఉన్నాయి అనే వివరాలు పూర్తిగా ఆన్‌లైన్‌లో పెట్టారు. ప్రస్తుతం ‘మీ భూమి’ వెబ్‌సైట్ ఆధారంగా తమ భూముల వివరాలు తెలుసుకుంటున్నారు. అయితే భూములను ఆన్‌లైన్ చేసేందుకు అధికారులను ఆర్‌ఎస్‌ఆర్ రికార్డును ప్రామాణికంగా చేసుకున్నారు.
1926లో తయారైన ఆర్‌ఎస్‌ఆర్ రికార్డు ఆధారంగానే భూములను ఆన్‌లైన్‌లో నమోదు చేశారు. ఈ క్రమంలో ప్రభుత్వ భూముల్లో అనేక లావాదేవీలు జరిగాయి. ప్రభుత్వమే కొందరికి పట్టాలు ఇవ్వడం లేదా మార్కెట్ ధర నిర్ణయించి విక్రయించడం లాంటివి చేశారు. కానీ ప్రస్తుతం జరిగిన ఆ లావాదేవీలు ఆన్‌లైన్‌లో నమోదు కాలేదు. ఉదాహరణకు పట్టణంలోని పామూరు బస్టాండ్ ప్రాంతం అభివృద్ధి చెందింది. సింహాద్రినగర్‌లోని 874 సర్వే నంబర్లో పోరంబోకు భూములకు సంబంధించి 9 పట్టాలు ఇచ్చారు. వీటిని వీరు 1970లోనే ప్రభుత్వానికి మార్కెట్ ధరను చెల్లించి సొంతం చేసుకున్నారు. అప్పటి నుంచి మున్సిపాలిటీకి ఆస్తి పన్నులు చెల్లిస్తున్నారు. అదే సందర్భంగా పదుల సంఖ్యలో ఈ భూముల చేతులు మారాయి. ప్రస్తుతం ఆ ప్రాంతంలో పెద్ద పెద్ద అపార్టుమెంట్లు ఉన్నాయి. కానీ 2017లో ఈ సర్వే నంబర్ అధికారులు ఆన్‌లైన్ ప్రోహిబిటెడ్ జాబితాలో నమోదు చేశారు. ఆన్‌లైన్‌లో ఇవి ప్రభుత్వ భూములుగా చూయించారు. దీని వల్ల భూములకు సంబంధించి రిజిస్ట్రేషన్లు జరగడం లేదు. అలాగే బ్యాంకు లోన్లు తీసుకుందామన్నా కుదరని పని. ఈ సమస్యపై ఆ ప్రాంతవాసులు ఎన్నిసార్లు రెవెన్యూ అధికారులను కలిసినా ప్రయోజనం లేకుండా పోయింది. అన్ని ఆధారాలున్నా ఎలా నిషేధిత జాబితాలో పెడతారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలా పట్టణంలో దాదాపు 701 సర్వే నంబర్లు అధికారులు నిషేధిత జాబితాలో నమోదు చేశారు. దీని వల్ల అనేక మంది ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
సవరణలకు ప్రభుత్వం అనుమతి
ప్రస్తుతం ఇలా పేర్కొన్న ఆస్తులను సవరించుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. 22ఏ కింద ఇలా పొరపాటున ప్రభుత్వ భూమిగా నమోదై ఉంటే అధికారులకు దరఖాస్తు చేసుకుని తొలగించుకోవచ్చు. 22ఏ కింద అసైన్‌మెంట్ భూములు, 22బీ కింద ప్రభుత్వ భూములు, 22సీలో దేవాదాయశాఖ భూములు, 22డీలో ల్యాండ్ సీలింగ్ భూములు, 22ఈలో పై నాలుగు రకాలు కాకుండా ఇతర భూములు ఉన్నాయి. వ్యక్తిగత ఆధారాలు ఉండి, పైగా వాటి కింద నమోదై ఉంటే అధికారులకు దరఖాస్తు చేసుకుని నిషేధిత జాబితా నుంచి తొలగించుకోవచ్చు. ఇందుకుగాను నేటి నుంచి జూలై 5వ తేదీ వరకు అధికారులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించనున్నారు. వీటిపై వచ్చిన అర్జీలను కూడా అధికారులు ఎటువంటి విచారణ లేకుండా తిరస్తారని ప్రజలు అనుమానిస్తున్నారు. అదే జరిగితే సమస్య మళ్లీ మొదటికి వస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment