
కర్ణాటక బ్యాంక్ మేనేజర్ ఆత్మహత్య
రుణాలు వసూలు కాక, అధికారుల ఒత్తిడి తాళలేక కార్యాలయంలోనే ఫ్యాన్‌కు ఉరేసుకొని..
బళ్లారి : నగర నడిబొడ్డున మీనాక్షి సర్కిల్ వద్ద ఉన్న కర్ణాటక బ్యాంక్‌లో పని చేస్తున్న బ్యాంక్ సీనియర్ బ్రాంచ్ మేనేజర్ ఏ కృష్ణమూర్తి(52) ఆత్మహత్య చేసుకున్నారు. ఆయన శుక్రవారం ఉదయం బ్యాంకు కార్యాలయంలోనే ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన నగరంలో కలకలం ృసష్టించింది. బళ్లారి నగరంలోని అగడి మారెప్ప కాంపౌండ్‌లో నివాసం ఉంటున్న కృష్ణమూర్తి ఉదయాన్నే బ్యాంకుకు చేరుకుని తన చాంబర్‌లోని ఫ్యాన్‌కు ఉరి వేసుకుని మరణించిన ఘటన వెలుగులోకి రావడంతో నగర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నగరంలోని పలువురు మైనింగ్ కంపెనీల యజమానులు, ప్రముఖులకు బ్యాంకు ద్వారా రుణాలు ఇవ్వడంతో అవి తిరిగి వసూలు కాకపోవడంతో వసూలు చేయాల్సిందేనని ఉన్నతాధికారులు ఒత్తిడి తీవ్రం చేయడంతో మానసిక ఒత్తిడికి గురై ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసు వర్గాలు పేర్కొన్నాయి.
తన చావుకు ఎవరూ కారణం కాదని, అయితే కొందరికి బ్యాంకు ద్వారా రుణాలిచ్చి తప్పు చేశానని సూసైడ్ నోట్ పెట్టి మరీ ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఈ విషయం దావానలంలా వ్యాపించడంతో పెద్ద సంఖ్యలో ప్రజలు, ఖాతాదారులు బ్యాంకు వద్దకు చేరుకున్నారు. నగర డీఎస్పీ మురుగణ్ణవర్, బ్రూస్‌పేట ఎస్‌ఐ నాగరాజ్‌లు ఘటన స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకున్నారు. ఆత్మహత్యకు పాల్పడిన కృష్ణమూర్తికి భార్య అనిత, కుమార్తెలు అర్చన, ఐశ్వర్య ఉన్నారు. విషయం తెలిసిన వెంటనే భార్య, కుమార్తెలు బ్యాంకుకు చేరుకుని వృుతదేహం వద్ద కన్నీరుమున్నీరుగా విలపించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మైనింగ్ యజమానులకు రుణాలిచ్చి వసూలు కాకపోవడంతో ఆత్మహత్యకు పాల్పడటం వల్ల ఆ కుటుంబానికి తీరని లోటు మిగిలిందని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు.