Karnataka Bank
-
క్రెడిట్ కార్డ్‌లు లేకుండానే చెల్లింపులు
న్యూఢిల్లీ: కర్ణాటక బ్యాంక్, ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీ నవీ టెక్నాలజీస్ తాజాగా క్రెడిట్ లైన్ ఆన్ యూపీఐ సేవలను ఆవిష్కరించాయి. వినియోగదారు యూపీఐ ఖాతాకు క్రెడిట్ లైన్‌ను అనుసంధానించడం ద్వారా విభిన్న క్రెడిట్ కార్డ్‌లను వెంట తీసుకెళ్లాల్సిన అవసరం ఉండదు. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) యాప్ ద్వారా చెల్లింపులు జరుపవచ్చు.ఇక కస్టమర్ యూపీఐ లావాదేవీల ఆధారంగా బ్యాంకులు ప్రీ–సాంక్షన్డ్ క్రెడిట్ లైన్ ఆఫర్ చేస్తాయి. ప్రస్తుతం ఎంపిక చేసిన ప్రీ–క్వాలిఫైడ్ కస్టమర్లకు ఈ సేవలను అందిస్తున్నట్టు బ్యాంక్ ఒక ప్రకటనలో తెలిపింది. వినియోగదార్ల అభిప్రాయం మేరకు మరింత మందికి విస్తరిస్తామని వివరించింది. స్వల్పకాలిక నెలవారీ రుణ ఉత్పత్తితో ఈ సేవలు ప్రారంభించినట్టు బ్యాంక్ తెలిపింది.భవిష్యత్తులో కస్టమర్ల అభివృద్ధి చెందుతున్న అవసరాలకు అనుగుణంగా ఈఎంఐ సౌకర్యాలు, వర్కింగ్ క్యాపిటల్ క్రెడిట్ లైన్ల వంటి ఇతర వేరియంట్లను జోడించడం కోసం చర్చలు జరుపుతున్నట్టు పేర్కొంది. యూపీఐ ద్వారా ప్రజలు కార్డ్‌లు లేకుండా చెల్లించే విధానాన్ని విప్లవాత్మకంగా మారుస్తుందని భావిస్తున్నామని కర్ణాటక బ్యాంక్ ఎండీ, సీఈవో శ్రీకృష్ణన్ హెచ్ అన్నారు. -
క్యూ2లో కర్ణాటక బ్యాంక్ రికార్డు లాభాలు
న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ సంస్థ కర్ణాటక బ్యాంక్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022-23) రెండో త్రైమాసికంలో ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జూలై-సెప్టెంబర్(క్యూ2)లో నికర లాభం 228 శాతం దూసుకెళ్లి రూ. 411 కోట్లను అధిగమించింది. ఇది ఒక క్వార్టర్లో బ్యాంక్ చరిత్రలోనే అత్యధికంకాగా.. గతేడాది(2021-22) ఇదే కాలంలో కేవలం రూ. 125 కోట్లు ఆర్జించింది. నికర వడ్డీ ఆదాయం సైతం 26 శాతం ఎగసి రూ. 803 కోట్లకు చేరింది. స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏలు) 4.03 శాతం నుంచి 3.36 శాతానికి, నికర ఎన్పీఏలు 2.16 శాతం నుంచి 1.72 శాతానికి దిగివచ్చాయి. ఫలితాల నేపథ్యంలో కర్ణాటక బ్యాంక్ షేరు బీఎస్ఈలో 20 శాతం దూసుకెళ్లి రూ. 113 వద్ద ముగిసింది. -
ఈఎంఐ కట్టనందుకు ఏడు రెట్ల జరిమానా
కర్ణాటక ,హుబ్లీ: ప్రభుత్వ ఆదేశాలకు తిలోదకాలు ఇచ్చి కర్ణాటక బ్యాంక్ వినియోగదారుని నుంచి పరోక్షంగా దోపిడీకి పాల్పడుతోందని విమర్శలు సర్వత్రా వెల్లువెత్తాయి. ఆ బ్యాంక్ ఈఎంఐ చెల్లింపులో జాప్యం జరిగినందుకు ఒకే నెలలో ఏడు రెట్ల జరిమానా విధించి సదరు బ్యాంకు వినియోదారున్ని నిలువునా వేధించింది. బాధితుడు సంగమేష్ హడపద తెలిపిన వివరాల మేరకు తమ సెలూన్ షాపు బంద్ అయినందు వల్ల ఈఎంఐ చెల్లించలేకపోయానన్నాడు.(మారిటోరియం పొడిగింపుతో మరిన్ని డిఫాల్ట్స్!) ఒక్క నెల ఈఎంఐ జాప్యం చేయడంతో రూ.590లు చొప్పున బ్యాంక్ మొత్తం ఏడు రెట్లు రూ.4150లను వసూలు చేసిందని వాపోయాడు. దీనిపై సంబంధిత అధికారులను వివరణ అడిగితే ఉదాసీనంగా జవాబు చెప్పారన్నారు. బజాజ్ ఫైనాన్స్‌లో రూ.30 వేలు రుణం తీసుకొన్న సంగమేష్ ప్రతి నెల రూ.3 వేలు ఈఎంఐ చెల్లించేవారు. ఈఎంఐ చెల్లింపులను వాయిదా వేస్తూ కేంద్రం ఆదేశాలు ఉన్నా బ్యాంకులు మాత్రం పట్టించుకోవడం లేదన్నారు. దీంతో బతుకుబండిని సాగించడమే కష్టమైందని బ్యాంక్ మేనేజర్‌కు వివరించగా త్వరలోనే సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారని బాధితుడు పేర్కొన్నాడు. -
12 శాతం తగ్గిన కర్ణాటక బ్యాంక్ లాభం
న్యూఢిల్లీ: ప్రైవేట్ రంగ కర్ణాటక బ్యాంక్ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం (2019–20) మూడో త్రైమాసిక కాలంలో 12 శాతం తగ్గింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ3లో రూ.140 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ3లో రూ.123 కోట్లకు తగ్గిందని కర్ణాటక బ్యాంక్ వెల్లడించింది. మొండి బకాయిలు పెరగడంతో నికర లాభం తగ్గిందని పేర్కొంది. మొత్తం ఆదాయం మాత్రం రూ.1,816 కోట్ల నుంచి రూ.2,024 కోట్లకు పెరిగిందని వివరించింది. గత క్యూ3లో 4.45 శాతంగా ఉన్న స్థూల మొండి బకాయిలు ఈ క్యూ3లో 4.99 శాతానికి పెరిగాయని బ్యాంక్ తెలియజేసింది. నికర మొండి బకాయిలు 3 శాతం నుంచి 3.75 శాతానికి చేరాయి. కేటాయింపులు రూ.209 కోట్ల నుంచి రూ.315 కోట్లకు పెరిగాయని పేర్కొంది. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో కర్ణాటక బ్యాంక్ షేర్ 0.6 శాతం లాభంతో రూ.78 వద్ద ముగిసింది. సౌత్ ఇండియన్ బ్యాంక్ ఆదాయం రూ.2,188 కోట్లు ప్రైవేట్ రంగ సౌత్ ఇండియన్ బ్యాంక్‌కు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2019–20) డిసెంబర్ క్వార్టర్లో రూ.91 కోట్ల నికర లాభం వచ్చింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్లో వచ్చిన నికర లాభం రూ.84 కోట్లతో పోలిస్తే 8 శాతం వృద్ధి సాధించామని సౌత్ ఇండియన్ బ్యాంక్ తెలిపింది. మొత్తం ఆదాయం రూ.1,922 కోట్ల నుంచి రూ.2,188 కోట్లకు పెరిగిందని పేర్కొంది. ఈ బ్యాంక్ స్థూల మొండి బకాయిలు స్వల్పంగా పెరిగాయి. గత క్యూ3లో 4.88 శాతంగా ఉన్న స్థూల మొండి బకాయిలు ఈ క్యూ3లో 4.96 శాతానికి పెరిగాయి. అయితే నికర మొండి బకాయిలు మాత్రం 3.54 శాతం నుంచి 3.44 శాతానికి తగ్గాయి. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో సౌత్ ఇండియన్ బ్యాంక్ షేర్ 1.5 శాతం లాభంతో రూ.11 వద్ద ముగిసింది. -
కర్ణాటక బ్యాంక్‌కు భారీ జరిమానా
సాక్షి, న్యూఢిల్లీ: ప్రయివేటురంగ బ్యాంకు కర్ణాటక బ్యాంకుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారీ జరిమానా విధించింది. నిబంధనలను ఉల్లంఘించినందుకు బ్యాంకుపై ఆర్బీఐ 4 కోట్ల రూపాయల జరిమానా విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ప్రపంచవ్యాప్తంగా బ్యాంకింగ్ సేవలకు వినియోగించే సాఫ్ట్వేర్ స్విఫ్ట్ (సొసైటీ ఫర్ వరల్డ్‌వైడ్ ఇంటర్ బ్యాంక్ ఫైనాన్షియల్ టెలీ కమ్యూనికేషన్) సంబంధిత కార్యాచరణ నియంత్రణ లోపం కారణంగా ముఖ్యంగా, నాలుగు నిబంధనల అమలులో ఆలస్యం జరిగిందని ఆర్బీఐ పేర్కొంది. దీంతోపాటు మరో నాలుగు బ్యాంకులు( ఎస్బీఐ, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, దేనా బ్యాంక్, ఐడిబిఐ)కు నిబంధనల ఉల్లంఘన ఆరోపణలతో నగదు జరిమానా విధించింది. యూనియన్ బ్యాంక్, దేనా బ్యాంకుకు రూ. 2కోట్లు, ఐడీబీఐ, ఎస్బీఐలకు తలా ఒక కోటి రూపాయలు చొప్పున జరిమానా విధించింది. శనివారం రెగ్యులేటరీకి అందించిన సమాచారంలో ఆయా బ్యాంకులు వెల్లడించాయి. కాగా స్విఫ్ట్ లావాదేవీల అక్రమాల కారణంగానే ప్రభుత్వ రంగ బ్యాంకులో రూ.14వేల కోట్ల స్కాం సంభవించిన సంగతి తెలిసిందే. బ్యాంకింగ్ రంగంలో అతిపెద్ద కుంభకోణంగా నిలిచిన ఈ స్కాంలో పీఎన్‌బీలోవజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ అక్రమాలు గత ఏడాది ఫిబ్రవరిలో వెలుగులోకి రావడంతో ప్రభుత్వం అన్ని రకాల లావాదేవీలపై నిబంధనలను కఠినతరం చేసింది. -
61 శాతం పెరిగిన కర్ణాటక బ్యాంక్ లాభం
న్యూఢిల్లీ: ప్రైవేట్ రంగంలోని కర్ణాటక బ్యాంక్ ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక కాలంలో రూ.140 కోట్ల నికర లాభం సాధించింది. గత ఆర్థిక సంవత్సరంలో రూ.87 కోట్ల నికర లాభం వచ్చిందని, 61 శాతం వృద్ధి సాధించామని కర్ణాటక బ్యాంక్ తెలిపింది. నిర్వహణ, ఇతర ఆదాయాలు బాగా పెరగడంతో ఈ స్థాయిలో నికర లాభం పెరిగిందని తెలియజేసింది. నికర వడ్డీ ఆదాయం రూ.451 కోట్ల నుంచి 8 శాతం వృద్ధితో రూ.488 కోట్లకు పెరిగిందని పేర్కొంది. ఇతర ఆదాయం 55 శాతం ఎగసి రూ.301 కోట్లకు, నిర్వహణ లాభం 24 శాతం ఎగసి రూ.400 కోట్లకు పెరిగాయని వివరించింది. పెరిగిన కేటాయింపులు.. రుణ నాణ్యత నిలకడగా ఉన్నా, కేటాయింపులు మాత్రం పెరిగాయి. గత క్యూ3లో 3.96 శాతంగా ఉన్న స్థూల మొండి బకాయిలు ఈ క్యూ3లో 4.45 శాతానికి పెరిగాయని కర్ణాటక బ్యాంక్ పేర్కొంది. నికర మొండి బకాయిలు 2.85 శాతం నుంచి 3 శాతానికి చేరాయని వివరించింది. కేటాయింపులు 6 శాతం పెరిగి రూ.209 కోట్లకు చేరగా, ప్రొవిజన్ కవరేజ్ రేషియో 57.5 శాతం నుంచి 57.2 శాతానికి తగ్గింది. ఆర్థిక ఫలితాలు బాగా ఉండటంతో బీఎస్ఈలో కర్నాటక బ్యాంక్ షేర్ 0.6 శాతం లాభపడి రూ.116 వద్ద ముగిసింది. -
కర్ణాటక బ్యాంక్ ఎంసీఎల్ఆర్ పెంపు
న్యూఢిల్లీ: ప్రైవేట్ రంగ కర్ణాటక బ్యాంక్ తాజాగా మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్ ఆధారిత రుణాలపై వడ్డీ రేటును (ఎంసీఎల్ఆర్) 0.15 శాతం పెంచింది. దీంతో ఏడాది వ్యవధి ఎంసీఎల్ఆర్ 9.10 శాతానికి చేరినట్లవుతుందని, జనవరి 1 నుంచి ఇది అమల్లోకి వచ్చిందని బ్యాంక్ తెలిపింది. ఇక ఆరు నెలల ఎంసీఎల్ఆర్ 0.10 శాతం పెరిగి 8.75 శాతానికి, మూడు నెలలది 0.10 శాతం మేర పెరిగి 8.70 శాతానికి చేరాయి. ఒక నెల రోజులు, ఒక్క రోజు వ్యవధి ఎంసీఎల్ఆర్ను కూడా 0.10 శాతం మేర పెంచినట్లు కర్ణాటక బ్యాంక్ తెలిపింది. ఇకపై 6 నెలల ఎంసీఎల్ఆర్తో అనుసంధానమైన రూ. 75 లక్షల దాకా రుణాలపై 8.80 శాతం వడ్డీ రేటు ఉంటుందని వివరించింది. అటు మరో ప్రైవేట్ రంగ ధన్లక్ష్మి బ్యాంక్ కూడా జనవరి 1 నుంచి 1 ఏడాది వ్యవధి ఎంసీఎల్ఆర్ను పెంచడంతో ఇది 9.90 శాతానికి చేరింది. బ్యాంకింగ్ యాప్ ఆవిష్కరణ కాగా కర్ణాటక బ్యాంక్ గురువారం బ్యాంకింగ్ యాప్‌ను ఆవిష్కరించింది. తన వినియోగదారుల అవసరాలకు తగిన విధంగా ఈ యాప్‌ను ఆవిష్కరించినట్లు బ్యాంక్ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రస్తుతం బ్యాంక్ సేవలకు సంబంధించి ఉన్న పలు యాప్‌ల (బీహెచ్ఐఎం కేబీఎల్ యూపీఐ, కేబీఎల్ ఎంపాస్‌బుక్, కేబీఎల్ లొకేటర్, ఎంకామర్స్ ఆన్లైన్) సేవలు సహా పలు బ్యాంక్ సేవలు సమగ్రంగా తాజా యాప్ ద్వారా అందుబాటులోకి వస్తాయని బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ సీఈఓ మహాబలేశ్వర్ ఎంఎస్ పేర్కొన్నారు. -
కూలీలను రైతులుగా చూపి 15కోట్లు బ్యాంక్ లోన్
-
కర్ణాటక బ్యాంక్ లాభం రూ.163 కోట్లు
న్యూఢిల్లీ: ప్రైవేట్ రంగ కర్ణాటక బ్యాంక్ నికర లాభం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక కాలంలో 22 శాతం వృద్ధి చెందింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ1లో రూ.134 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ1లో రూ.163 కోట్లకు చేరుకున్నట్లు కర్ణాటక బ్యాంక్ తెలిపింది. బ్యాంక్ చరిత్రలో ఇదే అత్యధిక త్రైమాసిక లాభమని బ్యాంక్ ఎమ్డీ, సీఈఓ ఎమ్.ఎస్.మహాబలేశ్వర చెప్పారు. రుణ నాణ్యత మెరుగుపడటం, నికర వడ్డీ ఆదాయం అధికంగా ఉండటం, నిర్వహణ లాభం పెరగడంతో ఈ స్థాయిలో నికర లాభం సాధించామని తెలియజేశారు. నికర వడ్డీ ఆదాయం 10 శాతం పెరిగి రూ.469 కోట్లకు చేరిందన్నారు. నిర్వహణ లాభం 19 శాతం పెరిగి రూ.369 కోట్లకు పెరగ్గా, ఇతర ఆదాయం మాత్రం 4 శాతం క్షీణించి రూ.209 కోట్లకు తగ్గిందని తెలిపారు. మొత్తం ఆదాయం రూ.1,548 కోట్ల నుంచి రూ.1,616 కోట్లకు ఎగసిందని వెల్లడించారు. తగ్గిన మొండి బకాయిలు.. గత క్యూ1లో 4.32 శాతంగా ఉన్న స్థూల మొండి బకాయిలు 4.72 శాతానికి పెరిగాయని మహాబలేశ్వర పేర్కొన్నారు. అయితే అంతకు ముందటి క్వార్టర్ స్థూల మొండిబకాయిలతో (4.92 శాతం)తో పోల్చితే ఈ క్యూ1లో తగ్గాయని వివరించారు. ‘‘నికర మొండి బకాయిలు మాత్రం 3.2 శాతం నుంచి 2.92 శాతానికి తగ్గాయి. అంతకు ముందటి క్వార్టర్లో 2.96 శాతంగా ఉన్నాయి. కేటాయింపులు రూ.199 కోట్ల నుంచి రూ.222 కోట్లకు చేరాయి. అంతకు ముందటి క్వార్టర్‌తో పోలిస్తే కేటాయింపులు 59 శాతం తగ్గాయి. అంతకు ముందటి క్వార్టర్లో 41.1 శాతంగా ఉన్న ప్రొవిజన్ కవరేజ్ రేషియో ఈ జూన్ క్వార్టర్లో 67.21 శాతానికి పెరిగింది. ఈ క్యూ1లో బ్యాంక్ డిపాజిట్లు 12 శాతం వృద్ధితో రూ.62,725 కోట్లకు, రుణాలు 24 శాతం వృద్ధితో రూ.47,731 కోట్లకు ఎగిశాయి’’ అని వివరించారు. ఆర్థిక ఫలితాలు బాగుండటంతో బీఎస్ఈలో కర్ణాటక బ్యాంక్ షేర్ 5 శాతం లాభంతో రూ.124 వద్ద ముగిసింది. -
92 శాతం తగ్గిన కర్ణాటక బ్యాంక్ లాభం
న్యూఢిల్లీ: కర్ణాటక బ్యాంక్ నికర లాభం నాలుగో క్వార్టర్లో 92 శాతం క్షీణించింది. 2016–17లో ఇదే కాలంలో రూ.138 కోట్లుగా ఉన్న నికర లాభం తాజా క్యూ4లో రూ.11 కోట్లకు తగ్గిందని బ్యాంక్ తెలిపిం ది. మొండి బకాయిల కేటాయింపులు భారీగా... దాదాపు మూడు రెట్లు పెరగడంతో నికర లాభం ఈ స్థాయిలో తగ్గిందని తెలియజేసింది. మొండి బకాయిలకు కేటాయింపులు రూ.160 కోట్ల నుంచి రూ.542 కోట్లకు ఎగిశాయి. మొత్తం ఆదాయం మాత్రం రూ.1,606 కోట్ల నుంచి రూ.1,738 కోట్లకు పెరిగింది. ఒక్కో షేర్‌కు రూ.3 డివిడెండ్‌ను ఇవ్వనున్నామని బ్యాంకు తెలిపింది. ఇక పూర్తి ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే, 2016–17లో రూ.452 కోట్లుగా ఉన్న నికర లాభం గత ఆర్థిక సంవత్సరంలో రూ.326 కోట్లకు తగ్గింది. ఆదాయం రూ.5,995 కోట్ల నుంచి రూ.6,378 కోట్లకు పెరిగింది. ఇంట్రాడేలో ఈ షేర్ ఏడాది కనిష్టం రూ.108ని తాకింది. చివరకు 1.7% నష్టంతో రూ.111 వద్ద ముగిసింది. -
రూ.86.5 కోట్లకు గీతాంజలి జెమ్స్ మోసం చేసింది
బెంగళూరు: గీతాంజలి జెమ్స్ సంస్థకు మూలధన అవసరాల కోసం నిధులు సర్దుబాటు చేయగా 86.5 కోట్ల మేర మోసానికి పాల్పడిందంటూ కర్ణాటక బ్యాంకు ఆర్బీఐకి రిపోర్ట్ చేసింది. మెహుల్ చోక్సీకి చెందిన గీతాంజలి జెమ్స్‌కు మూలధన అవసరాలను కొనసాగించగా ఆ సంస్థ మోసం చేసినట్టు ఆర్బీఐకి తెలియజేశామని బీఎస్ఈకి సమాచారం అందించింది. ఇందుకు సంబంధించి ఆర్బీఐ మార్గదర్శకాల మేరకు నిధులను కేటాయిస్తామని పేర్కొంది. అయితే, గీతాంజలి జెమ్స్‌కు ఎల్వోయూల పరంగా బ్యాంకుకు ఎటువంటి ఎక్స్పోజర్ లేదని స్పష్టం చేసింది. నీరవ్ మోదీ, మెహుల్‌చోక్సీలు పీఎన్బీ నుంచి ఎల్వోయూలు తీసుకుని రూ.13,540 కోట్ల మేర మోసగించగా, దానిపై విచారణ జరుగుతున్న విషయం తెలిసిందే. -
కర్ణాటక బ్యాంక్ రుణ నాణ్యత మెరుగు
ముంబై: ప్రైవేట్ రంగ కర్ణాటక బ్యాంక్ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక కాలంలో 28 శాతం ఎగిసింది. గత క్యూ3లో రూ.69 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ3లో రూ.87 కోట్లకు పెరిగినట్లు బ్యాంక్ తెలియజేసింది. ఆర్జించిన వడ్డీ ఆదాయం నుంచి చెల్లించిన వడ్డీ ఆదాయాన్ని తీసివేయగా వచ్చే నికర వడ్డీ ఆదాయం 20 శాతం పెరిగిందని పేర్కొంది. ఈ వడ్డీ ఆదాయం రూ.377 కోట్ల నుంచి రూ.452 కోట్లకు వృద్ధి చెందింది. రుణ నాణ్యత మెరుగుపడినట్లు బ్యాంక్ తెలిపింది. స్థూల మొండి బకాయిలు 4.13 శాతం నుంచి 3.97 శాతానికి, నికర మొండి బకాయిలు 3.04 శాతం నుంచి 2.85 శాతానికి తగ్గాయని పేర్కొంది. ఇతర ఆదాయం 46 శాతం వృద్ధితో రూ.195 కోట్లకు, నిర్వహణ లాభం 87 శాతం వృద్ధితో రూ.322 కోట్లకు చేరుకున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం రెండో క్వార్టర్లో రూ.226 కోట్లుగా ఉన్న మొండి బకాయిలకు కేటాయింపులు ఈ క్యూ3లో రూ.196 కోట్లకు తగ్గాయని, అయితే గత క్యూ3 కేటాయింపులైన రూ.101 కోట్లతో పోలిస్తే రెట్టింపయ్యాయని బ్యాంక్ తెలిపింది. నికర లాభం 28 శాతం పెరగడం, మొండి బకాయిలు తగ్గి రుణ నాణ్యత మెరుగుపడడంతో బీఎస్ఈలో కర్ణాటక బ్యాంక్ షేర్ 3 శాతం లాభంతో రూ.167 వద్ద ముగిసింది. -
కర్ణాటక బ్యాంక్ లాభాలు 30శాతం జంప్
ముంబై: ప్రయివేట్ రంగ సంస్థ కర్ణాటక బ్యాంక్ 2016-17సంవత్సరానికిగాను క్యూ4 ఫలితాలు ప్రకటించింది. జనవరి-మార్చి త్రైమాసికంలో భారీ లాభాలను సాధించింది. కంపెనీ నికర లాభం 30 శాతం జంప్‌చేసి రూ. 138 కోట్లకు చేరింది. గత ఏడాది ఇదే క్వార్టర్లో (2015-16 ఆర్థిక సంవత్సరం జనవరి-మార్చి కాలంలో) 106.79 కోట్ల రూపాయల నికరలాభాన్ని నమోదు చేసింది. అయితే నికర వడ్డీ ఆదాయం(ఎన్ఐఐ) మాత్రం 2 శాతం తగ్గి రూ. 352 కోట్లకు పరిమితమైంది. మార్చి త్రైమాసికంలో మొత్తం ఆదాయం రూ. 1,606.19 కోట్లకు పెరిగింది. గత ఏడాది రూ. 1,447.68 కోట్లగా ఉంది. మొత్తం ఆర్థిక సంవత్సరంలో ఆదాయం 5,354.74 కోట్ల రూపాయల నుంచి రూ .5,535.07 కోట్లకు పెరిగింది. త్రైమాసిక ప్రాతిపదికన స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏలు) 4.3 శాతం నుంచి 4.2 శాతానికి స్వల్పంగా తగ్గాయి. నికర ఎన్పీఏలు మరింత అధికంగా 3 శాతం నుంచి 2.64 శాతానికి దిగివచ్చాయి. వార్షిక ప్రాతిపదికన ప్రొవిజన్లు రూ. 112 కోట్ల నుంచి రూ. 160 కోట్లకు పెరిగాయి. అలాగే ప్రతిషేరుకు 4 రూపాయల డివిడెండ్ చెల్లించేందకు బోర్డు ఆమోదం తెలిపిందని బ్యాంకు ప్రకటించింది -
కర్ణాటక బ్యాంక్ 1.2 రైట్స్ ఇష్యూ
ముంబై: ప్రయివేట్ రంగ సంస్థ కర్ణాటక బ్యాంక్ రైట్స్ ఇష్యూ వివరాలు వెల్లడించింది. 1:2 నిష్పత్తిలో రైట్స్‌ను చేపట్టనుంది. దీని ప్రకారం వాటాదారుల దగ్గరున్న ప్రతీ 2 షేర్లకు 1 షేరును జారీ చేయనుంది. ఒక్కో షేరుకీ రూ. 70 ధరలో రైట్స్ షేర్లను ఇవ్వనున్నట్లు బ్యాంక్ ఒక ప్రకటనలో తెలియజేసింది. శుక్రవారం నాటి బోర్డు డైరెక్టర్ల సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ప్రతి రెండు షేర్లకు ఒక వాటా నిష్పత్తిలో రైట్స్ ఆధారంగా బ్యాంకు ఈక్విటీ షేర్లు జారీ చేయాలని నిర్ణయించారు. జూన్ తో ముగిసిన ఫస్ట్ క్వార్టర్ ఫలితాలను ప్రకటించిన బ్యాంకు 11.16 శాతం వృద్ధితో రూ. 121.54 కోట్ల నికల లాభాలను ఆర్జించింది. బ్యాడ్ లోన్లు 1,389 కోట్లుగా నమోదు చేసింది. రూ 96.000 కోట్ల బజినెస్ టర్నోవర్ బ్యాంకు ఆశిస్తోంది. ఈ వార్తల నేపథ్యంలో కర్ణాటక బ్యాంక్ షేరు ప్రారంభంలో 2.2 శాతానికిపైగా లాభపడింది. చివర్లో అమ్మకాల ఒత్తిడితో 4 శాతానికి పైగా నష్టపోయి 143 దగ్గర ముగిసింది. -
21 శాతం తగ్గిన కర్నాటక బ్యాంక్ నికర లాభం
ఒక్కో షేర్‌కు రూ.5 డివిడెండ్ న్యూఢిల్లీ: ప్రైవేట్ రంగ కర్నాటక బ్యాంక్ గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక కాలంలో రూ.107 కోట్ల నికర లాభం ఆర్జించింది. అంతకు ముందటి ఆర్ధిక సంవత్సరం (2014-15) ఇదే క్వార్టర్లో సాధించిన నికర లాభం(రూ.134 కోట్లు)తో పోల్చితే 21 శాతం క్షీణత నమోదైందని కర్నాటక బ్యాంక్ తెలిపింది. మొండి బకాయిలు పెరగడమే దీనికి కారణమని వివరించింది. 2014-15 క్యూ4లో రూ.1,308 కోట్లుగా ఉన్న మొత్తం ఆదాయం గత ఆర్థిక సంవత్సరం క్యూ4లో రూ.1,448 కోట్లకు ఎగసిందని పేర్కొంది. మొండి బకాయిలు, ఇతర అంశాలకు కేటాయింపులు రూ.4 కోట్ల నుంచి రూ.113 కోట్లకు పెరిగాయని వివరించింది. స్థూల మొండి బకాయిలు 2.95 శాతం నుంచి 3.44 శాతానికి, నికర మొండి బకాయిలు 1.98 శాతం నుంచి 2.35 శాతానికి పెరిగాయని పేర్కొంది. ఒక్కో షేర్‌కు రూ.5 డివిడెండ్‌ను ఇవ్వనున్నామని పేర్కొంది. ఇక ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే 2014-15 లో రూ.451 కోట్లుగా ఉన్న నికర లాభం గత ఆర్థిక సంవత్సరంలో రూ.415 కోట్లకు పడిపోయిందని, మొత్తం ఆదాయం మాత్రం రూ.5,205 కోట్ల నుంచి రూ.5,535 కోట్లకు పెరిగిందని కర్నాటక బ్యాంక్ పేర్కొంది. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో కర్నాటక బ్యాంక్ షేర్ 7 శాతం లాభంతో రూ.120 వద్ద ముగిసింది. -
కారులో రూ. కోటిన్నర
-
కారులో రూ. కోటిన్నర
సూర్యాపేటలో అనుమానాస్పదంగా ఫోర్డ్ కారు * ఎస్పీ ఆదేశానుసారం డిక్కీని పగలగొట్టిన పోలీసులు * గన్నీ బ్యాగ్ నుంచి కరెన్సీ కట్టలు బయటపడిన వైనం * కారు, డబ్బును వదిలివెళ్లిన గుర్తుతెలియని దుండగులు * కర్ణాటక బీజాపూర్‌లోని ఐసీఐసీఐ బ్యాంకు డబ్బుగా అనుమానం సూర్యాపేట: ఉదయం నుంచి అక్కడో ఫోర్డ్ కారు నిలిపి ఉంది. దాన్ని పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు. అయితే సాయంత్రం పోలీసులకు అనుమానమొచ్చి డిక్కీ పగలగొట్టి చూడగా... కరెన్సీ కట్టలు బయటపడ్డాయి. రూ.లక్ష కాదు.. రూ.రెండు లక్షలు కాదు.. ఏకంగా కోటిన్నర రూపాయలు.. మొత్తం రూ.500, రూ.1000 నోట్ల కట్టలే. వాటిని చూసి పోలీసులే అవాక్కయ్యారు. సంచలనం సృష్టించిన ఈ ఘటన నల్లగొండ జిల్లా సూర్యాపేట హైటెక్ బస్టాండ్‌లో చోటుచేసుకుంది. ఇది రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. సూర్యాపేట హైటెక్ బస్టాండ్ వద్ద గురువారం ఉదయం గుర్తుతెలియని వ్యక్తులు ఫోర్డ్ కారును వదిలివెళ్లారు. జిల్లా ఎస్పీ దుగ్గల్ ఆదేశానుసారం సూర్యాపేట డీఎస్పీ ఎంఏ రషీద్ వెంటనే సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకున్నారు. కారు లాక్ చేసి ఉండటంతో డిక్కీని పగలగొట్టి తనిఖీచేయగా డబ్బుల సంచి (గన్నీబ్యాగ్), ఒక పెట్టె బయటపడ్డాయి. వాటిలో రూ.కోటి 50 లక్షలు ఉండడంతో సూర్యాపేట పట్టణ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. తమకు అందిన సమాచారం మేరకు కారును తనిఖీ చేయగా రూ.కోటి 50 లక్షలు స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ ఎంఏ రషీద్ విలేకరులకు తెలిపారు. దీనికి సంబంధించి ఓ వ్యక్తిని కర్ణాటకలోని బీజాపూర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. డీఎస్పీ వెంట రూరల్ సీఐ నర్సింహారెడ్డి, ఎస్ఐలు సంతోష్‌కుమార్, శ్రీనివాస్, ఇతర సిబ్బంది ఉన్నారు. కారు ఎక్కడిదీ? ఇక్కడే ఎందుకు ఆపారు? కర్ణాటక రిజిస్ట్రేషన్‌తో ఉన్న ఈ కారు ఎక్కడి నుంచి వచ్చిందో.. తెలియదు. కానీ సూర్యాపేట హైటెక్ బస్టాండ్‌లో చెట్ల కింద ఉదయం నుంచి ఉందని స్థానికులు చెబుతున్నారు. కర్ణాటకలోని బీజాపూర్‌కు చెందిన ఐసీఐసీఐ బ్యాంకుకు సంబంధించిన డబ్బు రవాణా అవుతున్నట్టు అక్కడి పోలీసులు జిల్లా పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. ఈ డబ్బు చోరీకి గురైందా? లేక బ్యాంకులో పనిచేసే ఉద్యోగులే ఈ ఉదంతానికి పాల్పడ్డారా? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. కర్ణాటక నుంచి వచ్చిన ఈ కారు సూర్యాపేటలో నిలపడానికి గల కారణం తెలియాల్సి ఉంది. కారు ఇక్కడ నిలిపిన వారి కోసం గాలింపు ముమ్మరం చేశామని పోలీసులు చెప్పారు. కర్ణాటక పోలీసులు వస్తే పూర్తి సమాచారం తెలిసే అవకాశముంది. -
సూర్యాపేటలో రూ. 2 కోట్ల కరెన్సీ పట్టివేత
నల్లగొండ జిల్లా సూర్యాపేటలో 2 కోట్ల రూపాయల సొమ్మును పోలీసులు పట్టుకున్నారు. ఈ సొమ్ము కర్ణాటకలోని ఓ బ్యాంకులో చోరీ చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. సూర్యాపేట హైటెక్ బస్టాండు సమీపంలో కారులో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకుని తనిఖీ చేయగా.. వారి వద్ద ఏకంగా రూ. 2 కోట్ల కరెన్సీ పట్టుబడింది. వాళ్లు వాడిన కారు నెంబరు కేఏ 28 ఎన్ 9119గా గుర్తించారు. దాంతో వెంటనే వాళ్లను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కాగా, కర్ణాటకలోని ఒక బ్యాంకులో ఇటీవల భారీ దోపిడీ జరిగింది. బహుశా ఈ సొమ్ము అంతా అక్కడిదే అయి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు ఇంకా అందాల్సి ఉంది. -
కర్నాటక బ్యాంక్లాభం 66% అప్
- ఒక్కో షేర్‌కు రూ.5 డివిడెండ్ - బేస్‌రేట్ పావు శాతం తగ్గింపు న్యూఢిల్లీ: కర్నాటక బ్యాంక్ నికర లాభం గత ఆర్థిక సంవత్సరం క్యూ4లో 66 శాతం పెరిగింది. 2013-14 ఆర్థిక సంవత్సరం క్యూ4లో రూ. 81 కోట్లుగా ఉన్న నికర లాభం 2014-15ఆర్థిక సంవత్సరం క్యూ4లో రూ.134 కోట్లకు పెరిగిందని కర్నాటక బ్యాంక్ తెలిపింది. మొత్తం ఆదాయం రూ.1,173 కోట్ల నుంచి 12 శాతం వృద్ధితో రూ.1,308 కోట్లకు చేరిందని బ్యాంక్ ఎండీ, సీఈఓ పీ. జయరామ భట్ చెప్పారు. ఒక్కో షేర్‌కు రూ.5 డివిడెండ్ ఇస్తామని, బేస్ రేట్‌ను 10.75 శాతం నుంచి 10.50 శాతానికి తగ్గించామని తెలిపారు. -
బనగానిపల్లె వద్ద దారి దోపిడీ
బనగానిపల్లె:కర్నూలు జిల్లా బనగానిపల్లె సమీపంలో శనివారం అర్థరాత్రి దాటిన తర్వాత దారి దోపిడీ జరిగింది. అనంతపురంలోని కర్ణాటక బ్యాంకు అసిస్టెంట్ మేనేజర్ జె.లక్ష్మీనారాయణ అనంతపురం నుంచి మహానంది పట్టణానికి కారులో వెళ్తున్నారు. బనగానిపల్లె మండలం రాళ్లకొత్తూరు సమీపంలో గుర్తు తెలియని దుండగులు రోడ్డుకు అడ్డంగా రాళ్లు, దుంగలు ఉంచి ఆయన కారును ఆపారు. లక్ష్మీనారాయణను బెదిరించి రూ.38 వేల నగదు, బంగారు చైన్‌ను లాక్కున్నారు. బాధితుని ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
కర్ణాటక బ్యాంక్ మేనేజర్ ఆత్మహత్య
రుణాలు వసూలు కాక, అధికారుల ఒత్తిడి తాళలేక కార్యాలయంలోనే ఫ్యాన్‌కు ఉరేసుకొని.. బళ్లారి : నగర నడిబొడ్డున మీనాక్షి సర్కిల్ వద్ద ఉన్న కర్ణాటక బ్యాంక్‌లో పని చేస్తున్న బ్యాంక్ సీనియర్ బ్రాంచ్ మేనేజర్ ఏ కృష్ణమూర్తి(52) ఆత్మహత్య చేసుకున్నారు. ఆయన శుక్రవారం ఉదయం బ్యాంకు కార్యాలయంలోనే ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన నగరంలో కలకలం ృసష్టించింది. బళ్లారి నగరంలోని అగడి మారెప్ప కాంపౌండ్‌లో నివాసం ఉంటున్న కృష్ణమూర్తి ఉదయాన్నే బ్యాంకుకు చేరుకుని తన చాంబర్‌లోని ఫ్యాన్‌కు ఉరి వేసుకుని మరణించిన ఘటన వెలుగులోకి రావడంతో నగర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నగరంలోని పలువురు మైనింగ్ కంపెనీల యజమానులు, ప్రముఖులకు బ్యాంకు ద్వారా రుణాలు ఇవ్వడంతో అవి తిరిగి వసూలు కాకపోవడంతో వసూలు చేయాల్సిందేనని ఉన్నతాధికారులు ఒత్తిడి తీవ్రం చేయడంతో మానసిక ఒత్తిడికి గురై ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసు వర్గాలు పేర్కొన్నాయి. తన చావుకు ఎవరూ కారణం కాదని, అయితే కొందరికి బ్యాంకు ద్వారా రుణాలిచ్చి తప్పు చేశానని సూసైడ్ నోట్ పెట్టి మరీ ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఈ విషయం దావానలంలా వ్యాపించడంతో పెద్ద సంఖ్యలో ప్రజలు, ఖాతాదారులు బ్యాంకు వద్దకు చేరుకున్నారు. నగర డీఎస్పీ మురుగణ్ణవర్, బ్రూస్‌పేట ఎస్ఐ నాగరాజ్‌లు ఘటన స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకున్నారు. ఆత్మహత్యకు పాల్పడిన కృష్ణమూర్తికి భార్య అనిత, కుమార్తెలు అర్చన, ఐశ్వర్య ఉన్నారు. విషయం తెలిసిన వెంటనే భార్య, కుమార్తెలు బ్యాంకుకు చేరుకుని వృుతదేహం వద్ద కన్నీరుమున్నీరుగా విలపించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మైనింగ్ యజమానులకు రుణాలిచ్చి వసూలు కాకపోవడంతో ఆత్మహత్యకు పాల్పడటం వల్ల ఆ కుటుంబానికి తీరని లోటు మిగిలిందని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు.