
న్యూఢిల్లీ: ప్రైవేట్ రంగ కర్ణాటక బ్యాంక్ తాజాగా మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్ ఆధారిత రుణాలపై వడ్డీ రేటును (ఎంసీఎల్‌ఆర్) 0.15 శాతం పెంచింది. దీంతో ఏడాది వ్యవధి ఎంసీఎల్‌ఆర్ 9.10 శాతానికి చేరినట్లవుతుందని, జనవరి 1 నుంచి ఇది అమల్లోకి వచ్చిందని బ్యాంక్ తెలిపింది. ఇక ఆరు నెలల ఎంసీఎల్‌ఆర్ 0.10 శాతం పెరిగి 8.75 శాతానికి, మూడు నెలలది 0.10 శాతం మేర పెరిగి 8.70 శాతానికి చేరాయి. ఒక నెల రోజులు, ఒక్క రోజు వ్యవధి ఎంసీఎల్‌ఆర్‌ను కూడా 0.10 శాతం మేర పెంచినట్లు కర్ణాటక బ్యాంక్ తెలిపింది. ఇకపై 6 నెలల ఎంసీఎల్‌ఆర్‌తో అనుసంధానమైన రూ. 75 లక్షల దాకా రుణాలపై 8.80 శాతం వడ్డీ రేటు ఉంటుందని వివరించింది. అటు మరో ప్రైవేట్ రంగ ధన్‌లక్ష్మి బ్యాంక్ కూడా జనవరి 1 నుంచి 1 ఏడాది వ్యవధి ఎంసీఎల్‌ఆర్‌ను పెంచడంతో ఇది 9.90 శాతానికి చేరింది.
బ్యాంకింగ్ యాప్ ఆవిష్కరణ
కాగా కర్ణాటక బ్యాంక్ గురువారం బ్యాంకింగ్ యాప్‌ను ఆవిష్కరించింది. తన వినియోగదారుల అవసరాలకు తగిన విధంగా ఈ యాప్‌ను ఆవిష్కరించినట్లు బ్యాంక్ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రస్తుతం బ్యాంక్ సేవలకు సంబంధించి ఉన్న పలు యాప్‌ల (బీహెచ్‌ఐఎం కేబీఎల్ యూపీఐ, కేబీఎల్ ఎంపాస్‌బుక్, కేబీఎల్ లొకేటర్, ఎంకామర్స్ ఆన్‌లైన్) సేవలు సహా పలు బ్యాంక్ సేవలు సమగ్రంగా తాజా యాప్ ద్వారా అందుబాటులోకి వస్తాయని బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ సీఈఓ మహాబలేశ్వర్ ఎంఎస్ పేర్కొన్నారు.